– ఈ అంశంపై జులై 6 విచారణ
– కవిత జ్యుడీషియల్ కస్టడీ 21 వరకు పొడిగింపు
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కాంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ చార్జిషీట్ ను దాఖలు చేసింది. దాదాపు 2 వేలకు పైగా పేజీలతో కవిత రోల్ ను సీబీఐ పేర్కొన్నట్టు తెలిసింది. శుక్రవారం కవితపై దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ అంశాన్ని సీబీఐ తరపు న్యాయవాదులు రౌస్ ఎవెన్యూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చట్ట ప్రకారం నిర్ణీత సమయంలో కవితపై ఈ చార్జిషీట్ ను దాఖలు చేశామని, దీనిని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. అయితే ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకునే అంశంపై జులై 6 విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ ఏడాది మార్చి 15 ఈడీ, ఏప్రిల్ 11న కవితను దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలు అరెస్ట్ చేశాయి. ఇప్పటికే ఈ కేసులో కవిత పాత్రపై ఈడీ సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేయగా, 3న ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. తాజాగా కవిత పాత్రపై సీబీఐ మరో సపిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. వాస్తవానికి రౌస్ ఎవెన్యూ కోర్టులో ఏడేండ్ల వరకు శిక్ష పడే కేసుల్లో దాదాపు 60 రోజుల్లో అరెస్ట్ చేసిన నిందితులపై చార్జి షీట్ దాఖలు చేయాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత పెట్టుకున్న మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, గత నెల 28న ఇరువైపు వాదనలు ముగించిన జస్టిస్ సర్వకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు.
జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సీబీఐ కేసులో కవిత జ్యూడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి పొడగించింది. గతంలో విధించిన కస్టడీ ముగియడంతో శుక్రవారం కవితను జైలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్(విసి) ద్వారా కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా కవిత కస్టడీని పొడిగించాలని సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, కవిత జ్యుడీషియల్ కస్టడీని 21 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు వెల్లడించారు.