‘ఫార్మా’లో మరో ప్రమాదం

'ఫార్మా'లో మరో ప్రమాదంవిశాఖ కలెక్టరేట్‌ : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం జరిగి 48 గంటల గడవక ముందే ఇదే జిల్లాలోని పరవాడ మండలంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మా సిటీలో మరో ప్రమాదం గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత చోటుచేసుకుంది. సినర్జిన్‌ యాక్టివ్‌ ఇన్‌గ్రేడి యంట్స్‌ ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ కెమికల్‌ లీకవ డంతో మంటల వ్యాపించి నలుగురు తీవ్రంగా గాయ పడ్డారు. వారిలో జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన ముగ్గురు, విజయనగరం జిల్లాకు చెందిన ఒకరు తీవ్ర ఉన్నాయి. వారిని విశాఖలోని ఇండస్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తోటి కార్మికుల కథనం ప్రకారం… సినర్జిన్‌ యాక్టివ్‌ ఇన్‌గ్రేడియంట్స్‌ ఫార్మా కంపెనీలోని బి-బ్లాక్‌ ఒకటో ఫ్లోర్‌లో ఆరు కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన రియాక్టర్‌ ఉంది. దీనిలోకి కెమికల్‌ నింపి ఛార్జింగ్‌ చేస్తున్నప్పుడు మ్యాన్‌హోల్‌ నుంచి కెమికల్‌ లీకవడంతో మంటల వ్యాపించాయి. ఆ సమయంలో సి-షిఫ్టు డ్యూటీలో ఉన్న షిఫ్టు ఇన్‌ఛార్జి విజయనగరానికి చెందిన కొవ్వాడ సూర్యనారాయణ, జార్ఖండ్‌కు చెందిన హెల్పర్లు రొయా అంగారియా, వైబన్‌ కొరా, లాల్‌సింగ్‌ తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కోరాకు 90 శాతం గాయాలవ్వడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వీరంతా విశాఖలోని ఇండస్‌ ఆస్పతిలో చికిత్స పొందుతున్నారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో ఫార్మా కార్మికులు, ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సినర్జిన్‌ యాక్టివ్‌ ఇన్‌గ్రేడియంట్స్‌ కంపెనీ ఎటువంటి భద్రతా చర్యలూ కార్మికులకు కల్పించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. పరవాడ సిఐ బాలసూర్యారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని అనకాపల్లి ఎంపీ సిఎం.రమేష్‌, జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్‌పి దీపిక, పెందుర్తి ఎమ్మెల్యే పంచర్ల రమేష్‌ బాబు పరిశీలించారు.
బాధితులకు మెరుగైన చికిత్స : హోం మంత్రి అనిత
ప్రమాదంలో గాయపడి ఇండస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌, అనకాపల్లి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జాహ్నవి పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తామన్నారు. పరిశ్రమల నిర్వాహకులతో, అధికారులతో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
సమగ్ర విచారణ జరపాలి : సీపీఐ(ఎం), సీఐటీయూ
ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి, కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, కోశాధికారి వివి.శ్రీనివాస రావులతో కలిసి ఘటనాస్థలాన్ని సందర్శించారు. లోకనాథం మాట్లాడుతూ గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. 24 గంటల్లో రెండు ఘటనలు జరిగాయంటే కంపెనీల యాజమాన్యాలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నాయో అర్థమవుతోందని తెలిపారు. భద్రతా ప్రమాణాలు పాటించడంలో ఫార్మా కంపెనీలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు.

Spread the love