– కుటుంబాన్ని ఆదుకోవాలని సీఐటీయూ డిమాండ్
– మృతదేహంతో రోడ్డుపై బైటాయించి ధర్నా
నవతెలంగాణ-వీర్నపల్లి
జీవిత పోరాటంలో అలసిపోయిన మరో జీపీ కార్మికుని గుండె ఆగింది. గుండెపోటుతో గ్రామ పంచాయతీ కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన పసుల మల్లేశం(48) స్థానిక గ్రామ పంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మెలో పాల్గొంటున్నాడు. నెల రోజులు దాటినా ప్రభుత్వం స్పందించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మల్లేశం గుండెపోటుతో మృతిచెందాడు. ఆయనకు భార్య సత్తవ్వ, ఇద్దరు కొడుకులు ఉన్నారు. సీఐటీయూ నాయకులు, ఎంపీటీసీ అరుణ్‌కుమార్ కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వీర్నపల్లి, ఎల్లరేడ్డిపేట ప్రధాన రహదారిపై మల్లేశం మృతదేహాన్ని పెట్టి.. ధర్నా చేశారు. కార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్యాల నర్సయ్య డిమాండ్ చేశారు. నెల రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే బెంగతోనే మల్లేశం చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఐ నవత, ఎంపీడీవో నరేష్, సర్పంచ్ పాటి దినకర్ ఘటనాస్థలానికి వచ్చి.. ప్రభుత్వంతో మాట్లాడి సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కుటుంబానికి తక్షణ సాయం రూ.10 వేలు ఇవ్వడంతో ధర్నా విరమించారు.