నవతెలంగాణ హైదరాబాద్ : పూణే లగ్జరీ కారు ప్రమాదం మరువక ముందే.. అలాంటి యాక్సిడెంట్ ముంబైలో మరోకటి చోటుచేసుకుంది. అయితే ఈసారి కూడా లగ్జరీ కారుతో యాక్సిడెంట్ చేసింది ఓ హైప్రొఫైల్ కుటుంబానికి చెందిన యువకుడే. ఏక్‌నాథ్ షిండే శివసేన పార్టీ నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా(24) ముంబైలోని వర్లీ ప్రాంతంలో బీఎండబ్ల్యూ కారును అతివేగంతో నడిపాడు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో అతడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కారుతో ఓ బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో బైక్ నడుపుతున్న ప్రదీప్ నఖ్వా (50), అతడి భార్య కావేరి(45)కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించగా.. కావేరి అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ప్రదీప్ నఖ్వా చికిత్సపొందుతున్నారు. బైక్‌ను ఢీకొన్న వెంటనే ర్యాష్ డ్రైవింగ్ చేసిన నిందితుడు మిహిర్ షా, అతడితో ఉన్న డ్రైవర్ రాజరిషి బిదావత్ కారును వదిలేసి ఆటోలో అక్కడి నుంచి పరారయ్యారు.
పరారీలో ఉన్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్త నేర, న్యాయ చట్టాల కింద వారిపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వారిని దర్యాప్తు చేస్తున్నారు. ముంబైలోని సాసూన్ డాక్‌కు వెళ్లి చేపలు కొని.. ఇంటికి తీసుకెళ్తుండగా దంపతులు ప్రదీప్ నఖ్వా, కావేరి ఈ ప్రమాదం బారినపడ్డారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.