ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌

– ఏడుగురు మావోయిస్టులు మృతి
– ఆటోమేటిక్‌ ఆయుధాలతో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం
– ఈ ఏడాదిలో 100మందికి పైగా హతం
నవతెలంగాణ-చర్ల
మళ్లీ అబుజ్‌మద్‌ అడవుల్లో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. గత నెలలో వరుసగా జరిగిన ఎన్‌కౌంటర్లు మరవకముందే గురువారం తెల్లవారుజూము నుంచి మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు పోలీస్‌ ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌, దంతేవాడ, నారాయణపూర్‌ జిల్లాల సరిహద్దులోని అబుజ్‌మద్‌లోని రేకవాయా ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో దంతేవాడ, బస్తర్‌, నారాయణపూర్‌ జిల్లాల నుండి 1000 మందికి పైగా డీఆర్‌జీఎస్‌, టీఎఫ్‌ జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు సాయుధ మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. దంతెవాడ డీఆర్‌జీ జవాన్లు ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకోగా, నారాయణపూర్‌ జిల్లా జవాన్లు ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఘటనాస్థలిలో ఆటోమేటిక్‌ ఆయుధాలతో పాటు పెద్ద మొత్తంలో మావోయిస్టుల దైనందిక సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టు అగ్రనేతలూ మరణించినట్టు సమాచారం.

Spread the love