శరణార్థి శిబిరంపై దాడిలో కుటుంబసభ్యులను కోల్పోయిన మరో జర్నలిస్ట్‌

నవతెలంగాణ – గాజా: గాజాలోని అతిపెద్ద శరణార్థి శిబిరంపై ఇజ్రాయిల్‌ మంగళవారం కురిపించిన బాంబుల వర్షంలో మరో జర్నలిస్ట్‌ తన కుటుంబసభ్యులను కోల్పోయారు. అల్‌ జజీరాలో బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అబు అల్‌ ఖుమసన్‌కి చెందిన 19 మంది కుటుంబసభ్యులు ఇజ్రాయిల్‌ దాడిలో మరణించారు. గాజా బ్యూరోగా విధులు నిర్వహిస్తున్న అబు అల్‌ ఖుమసన్‌ తన తండ్రి, సోదరుడు, ఇద్దరు సోదరీ మణులు, ఎనిమిది మంది మేనల్లుళ్లు, మేనకోడళ్లతో సహా ఇతర కుటుంబసభ్యులను కోల్పోయినట్లు అల్‌జజీరా తెలిపింది. ఇజ్రాయిల్‌ నరమేథాన్ని ఖండిస్తున్నట్లు అల్‌జజీరా ప్రకటించింది. గతవారం  ’సురక్షిత ప్రాంతం‘ లో  ఉన్న  అల్‌జజీరాకు చెందిన ఓ జర్నలిస్టు తన భార్య పిల్లలని కల్పోయిన సంగతి తెలిసిందే.  శరణార్థి శిబిరంపై దాడిలో 50 మందికి పైగా మరణించినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయిల్‌ జరిపిన దాడిలో 47 మంది మరణించినట్లు ఇజ్రాయిల్‌ తెలిపింది. వారిలో అక్టోబర్‌ 7న ఇజ్రాయిల్‌పై దాడి చేపట్టిన హమాస్‌ కమాండర్‌ ఇబ్రహీం బియారి కూడా మరణించినట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రకటనను హమాస్‌ ఖండించింది. ఆ శిబిరంలో తమ కమాండర్‌లు ఎవరూ లేరని వెల్లడించింది. గాజాపై భూతల దాడులను పెంచుతున్నట్లు ఇజ్రాయిల్‌ ప్రకటించింది. కాల్పుల విమరణ ప్రసక్తేలేదని స్పష్టం చేసింది.

Spread the love