ట్విట్టర్‌లో మరో కీలక మార్పు..

నవతెలంగాణ – హైదరాబాద్: ట్విట్టర్‌ బాస్‌ ఎలాన్‌మస్క్ ఏం చేసినా సంచలనమే. గతేడాది ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ట్విట్టర్’ (ఎక్స్‌)ను టేకోవర్ చేసిన మస్క్‌.. ఇక అప్పటి నుంచి సమూల మార్పులు చేస్తూ వస్తున్నారు. చివరికి ట్విట్టర్ పేరును ‘ఎక్స్’ అని మార్చేశారు. పిట్ట స్థానంలో ఎక్స్‌ లోగోను చేర్చారు. ఇటీవలే సంస్థ ఆదాయం పెంచుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ ట్వీట్ డెక్  సర్వీసులు ఉచితం.. కానీ వాటిని పెయిడ్ సర్వీసులుగా మార్చేశారు. ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్‌  సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించారు. తాజాగా ట్విట్టర్‌లో మరో కీలక మార్పు చేశారు. ట్వీట్స్‌కు రిప్లయ్‌ ఇచ్చే విషయంలో సంస్థ కీలక మార్పును చేసింది. రిప్లయ్‌లను పరిమితం చేసేందుకు గానూ కొత్తగా ఆప్షన్‌ ను యాడ్‌ చేసింది. కేవలం వెరిఫైడ్‌ అకౌంట్ల నుంచి మాత్రమే రిప్లయ్‌లు వచ్చేలా మార్పు చేసింది. ఈ మార్పుతో ఇకపై వెరిఫైడ్‌ కాని  యూజర్లు రిప్లయ్‌ ఇవ్వడం సాధ్యపడదు. కాగా, సాధారణ యూజర్లను కూడా వెరిఫైడ్ అకౌంట్ల వైపు మళ్లించేందుకే సంస్థ ఇలాంటి మార్పులకు శ్రీకారం చుట్టిందని పలువురు విమర్శిస్తున్నారు.

Spread the love