టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో మరొకరు అరెస్టు

నవతెలంగాణ – హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో మరో నిందితుడిని సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. సతీశ్‌ కుమార్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రవికిశోర్‌ నుంచి సతీశ్‌ ఏఈ పేపర్‌ కొనుగోలు చేసినట్లు సిట్‌ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. సతీశ్‌ అరెస్టుతో ఇప్పటివరకు మొత్తం అరెస్టుల సంఖ్య 43కు చేరింది. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌ రెడ్డి ద్వారా ప్రశ్నపత్రాలు అందుకున్న సురేశ్‌ తాను నివాసం ఉండే అపార్టుమెంట్‌లో ముగ్గురికి ఏఈ, డీఏవో పేపర్లు అందించారు. టీఎస్‌పీఎస్సీ మాజీ ఉద్యోగి అయిన సురేశ్‌ A-12గా గతంలోనే అరెస్టయ్యాడు. నల్గగొండ జిల్లా నకిరేకల్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పూల రవికిశోర్‌ మధ్యవర్తిగా ఉంటూ సురేశ్‌ వద్ద నుంచి ఏఈ పేపర్‌ పొందాడు. తన బావమరిది కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న రాయపురం విక్రమ్‌కు, అతని సోదరి రాయపురం దివ్యకు డీఈవో ప్రశ్నపత్రాలు ఇప్పించాడు. సిట్‌ విచారణలో ఈ విషయం బయటపడటంతో బుధవారం ( మే 24న) రవికిశోర్‌, దివ్య, విక్రమ్‌ను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే మరింత లోతుగా విచారణ జరిపిన సిట్‌ అధికారులు.. రవికిశోర్‌ ద్వారా సతీశ్‌ కూడా పేపర్‌ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అతన్ని కూడా అరెస్టు చేశారు.

Spread the love