– వందమందికి పైగా పాలస్తీనియన్లు మృతి
– ముక్కలైన మృతదేహాలు
– ఖండించిన పలు దేశాలు
గాజా: నిర్వాసితులైన పాలస్తీనియన్లు తలదాచుకున్న స్కూళ్ళను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయిల్ తాజాగా శనివారం నాడు గాజా సిటీ స్కూల్‌పై దాడి చేసింది. దారుణంగా జరిపిన ఈ దాడిలో వందమందికి పైగా మృతి చెందారు. డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. బాంబు దాడిలో చాలా మృతదేహాలు ముక్కలు ముక్కలై చెల్లాచెదురుగా పడ్డాయి. దారుణ స్థితిలో ఉన్న మృతదేహాలను చూసి డాక్టర్లు కూడా భయకంపితులయ్యారు. ఇటీవలి వారాల్లో వరుసగా గాజా స్కూళ్ళే ఇజ్రాయిల్‌కు లక్ష్యాలుగా మారుతు న్నాయి. ఆ వరుసలో ఇది పదో దాడి. అల్ అహ్లి అరబ్ ఆస్పత్రికి వరుసగా మృతదేహాలను, క్షతగాత్రులను తీసుకుని వస్తూనే వున్నారు. ఉదయం ప్రార్ధనల సమయంలో ఈ దాడి జరిగింది. ఇప్పటివరకు వందకు పైగానే మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ సంస్థలు ఈ స్కూలును తమ స్థావరంగా ఉపయోగిస్తున్నాయని ఇజ్రాయిల్ ఆరోపించింది. అందుకు తగిన సాక్ష్యాధారాలను చూపలేదు. ఈ స్కూల్లో 20మందికి పైగా తీవ్రవాదులున్నారని, అందుకే దాడి చేశామని చెప్పుకుంటోంది. ఈ దాడిని ఈజిప్ట్, జోర్డాన్, సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్, ఇయు సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని విమర్శించాయి. ఒక పక్క కాల్పుల విరమణ ఒప్పందం కోసం చర్చలు జరగాలని కసరత్తు చేస్తుంటే మరోపక్క ఇలా స్కూళ్ళపై దాడులు చేయడమంటే ఆ ప్రతిపాదిత చర్చలను దెబ్బతీయడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాజా దారుణాల్లో ఇది మరో రోజని పాలస్తీనా శరణార్ధుల వ్యవహారాల సంస్థ (యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ) అధినేత వ్యాఖ్యానించారు. తక్షణమే కాల్పుల విరమణ జరగాలని డిమాండ్ చేశారు. ఐక్యరాజ్య సమితి ఇటువంటి ఊచకోతలను ఏ రకంగానూ సమర్ధించుకోలేదని యురోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి జోసెఫ్ బోరెల్ వ్యాఖ్యానించారు. అమాయకులైన పౌరుల హత్యలను ఆపగలిగేది, బందీలైన ఇజ్రాయిలీల విడుదలకు మార్గం సుగమం చేసేది కాల్పుల విరమణ ఒప్పందమేనని అటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నారంటూ ఇజ్రాయిల్ ఆర్థిక మంత్రిని ఆయన విమర్శించారు. ఆ స్కూలుపై దాడిని కతార్ విదేశాంగ శాఖ కూడా తీవ్రంగా ఖండించింది. నిర్వాసితులైన, నిరాయుధులైన పౌరులపై ఇటువంటి కిరాతకమైన దాడి జరపడమంటే వారి ప్రాధమిక హక్కులన్నీ దారుణంగా ఉల్లంఘిస్తున్నట్టేనని విమర్శించింది. ఇలా స్కూళ్ళపై జరుపుతున్న దాడులపై వెంటనే స్వతంత్ర ఐక్యరాజ్య సమితి దర్యాప్తు అధికారులతో విచారణ జరిపించాల్సిన అవసరముందని అన్నారు. ఆగస్టులో ఈ పది రోజుల్లోనే 8 స్కూళ్లపై దాడులు జరిపింది. సౌదీ అరేబియా కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. తక్షణమే ఈ ఊచకోతలను ఆపాల్సిన అవసరముందని పేర్కొంది. గాజాపై గత 10మాసాలుగా కొనసాగుతున్న దాడుల్లో ఇప్పటివరకు 39,790మంది మరణించగా, 92702 మంది గాయపడ్డారు.
ఇవన్నీ ఊచకోతలే : ఐక్యరాజ్య సమితి ఖండన
ఒకసారి ఆస్పత్రి, మరోసారి స్కూలు, ఇంకోసారి శరణార్ధుల శిబిరం, సురక్షిత ప్రాంతం ఇలా ఎక్కడైనా ఎప్పుడైనా పాలస్తీనియన్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రా యిల్ ఊచకోతలకు పాల్పడుతోందని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక దూత, మానవ హక్కుల నిపుణురాలు ఫ్రాన్సెసా అల్బనీస్ విమర్శించారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌లో పోస్టు పెట్టారు. పాలస్తీనా ప్రాంతాల్లో మానవ హక్కుల పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా ఆమెను నియమించింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ అందచేసిన ఆయు ధాలను ఉపయోగించి ఈ దాడులకు పాల్పడుతోందని అన్నారు. పాలస్తీనియన్లను కాపాడడంలో మనందరి వైఫల్యాన్ని వారు క్షమించాలని ఆమె వ్యాఖ్యానించారు.