– చైనా కంపెనీల్లో సెబీ చీఫ్ పెట్టుబడులు
– లిస్టెడ్ కంపెనీల్లోనూ రూ.36 కోట్లు ట్రేడింగ్
న్యూఢిల్లీ: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజీ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్ అక్రమ పెట్టుబడులు, ఆదాయాలపై రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. హిండెన్‌బర్గ్ దెబ్బతో ఆమెపై అవినీతి ఆరోపణలు వెల్లువలా బయటికి వస్తోన్నాయి. చైనా సంస్థల్లో మాధబి పెట్టుబడులు కలిగి ఉన్నారని శనివారం కాంగ్రెస్ వెల్లడించింది. ఇప్పటికే కాంగ్రెస్, హెండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలకు మాధబి, ఆమె భర్త సుదీర్ఘ వివరణ ఇచ్చాక.. ఇంతలో మళ్లీ కాంగ్రెస్ కొత్త విమర్శలను ఎక్కుపెట్టింది. మాధబి సెబీ ఛైర్ పర్సన్ హోదాలో ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అన్నారు. ”సెబీలో ఉంటూ 2017 నుంచి 2023 మధ్య లిస్టెడ్ సెక్యూరిటీల్లో రూ.36.9 కోట్లు ట్రేడింగ్ చేశారు. 2018-19లో పెద్ద మొత్తంలో ట్రేడింగ్ నిర్వహించారు. విదేశీ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. ఇందులో చైనాకు చెందిన పెట్టుబడులూ ఉన్నాయి. మొత్తం నాలుగు అంతర్జాతీయ ఫండ్స్‌లో ఆమె మదుపు చేశారు. అందులోనూ చైనాకు చెందిన గ్లోబల్ ఎక్స్‌్ ఎంఎస్‌సిఐ చైౖనా కన్జూమర్, ఇన్వెస్కో చైనా టెక్నాలజీలకు చెందిన ఇటిఎఫ్‌లల్లో మాధబి పెట్టుబడులు పెట్టారు.” అని పవన్ ఖేరా తెలిపారు. ఈ పెట్టుబడులను మాధబి ఎప్పుడూ ప్రకటించలేదని ఖేరా అన్నారు. ఈ విషయం ప్రభుత్వ ఏజెన్సీలకు తెలుసా..? అని ఆయన ప్రశ్నించారు. అలాగే సెబీ ఛైర్‌పర్సన్ ఇచ్చిన వివరణనూ తోసిపుచ్చారు. ముఖ్యంగా ఐసిఐసిఐ, మహీంద్రా గ్రూప్ విషయంలో ఇచ్చిన వివరణ ఏమాత్రం సరిపోదన్నారు. ఖేరా తాజా వ్యాఖ్యలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ మరోమారు ప్రధానీ నరేంద్ర మోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ”సెబీ ఛైర్ పర్సన్‌పై వస్తున్న ఆరోపణల గురించి మోడీకి తెలుసా..?. బయటకు వెల్లడించిన సున్నితమైన ధరల సమాచారం కలిగిన లిస్టెడ్ సెక్యూరిటీల్లో సెబీ ఛైర్‌పర్సన్ ట్రేడింగ్ చేసిన విషయం తెలుసా..?. భారత్ వెలుపల సెబీ చీఫ్‌కు పెట్టుబడులు ఉన్న విషయం తెలుసా..?. ఒకవేళ తెలిస్తే పెట్టుబడులు, ఆయా తేదీలు చెప్పగలరా..? ఓ వైపు చైనాతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సెబీ ఛైర్‌పర్సన్ చైనా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన విషయం తెలుసా..?.” అంటూ జైరామ్ రమేష్ ప్రశ్నల వర్షం కురిపించారు.