– రెండ్రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినులు మృతి
– కుటుంబాన్ని ఆదుకుంటామని వైస్ ఛాన్స్‌లర్ హామీ
నవతెలంగాణ-బాసర
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో విషాదం నెలకొంది. రెండ్రోజుల వ్యవధిలో యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థినులు మృతిచెందడం కలకలం రేపుతోంది. దీపిక ఆత్మహత్య ఘటన నుంచి తేరుకోకముందే బుధవారం అర్ధరాత్రి సమయంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన బూర లిఖిత హాస్టల్‌లోని నాల్గవ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడి మృతిచెందింది. కింద అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది మొదట స్థానిక ఆస్పత్రికి తరలించారు. తనంతరం భైంసా ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి, నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రి తరలించాలని సూచించగా అక్కడ పరీక్షించిన వైద్యులు లిఖిత అప్పటికే మృతిచెందిందని ధృవీకరించారు. యూనివర్సిటీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక విద్యార్థులు, తల్లిదండ్రులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. వరుస విషాద ఘటనలతో యూనివర్సిటీ ప్రతిష్ట దిగజారుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు యూనివర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రిలో లిఖిత మృతదేహాన్ని యూనివర్సిటీ వీసీ వెంకటరమణ పరిశీలించారు. బయటకు వచ్చిన వీసీ వాహనాన్ని ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు మృతి చెందుతున్నారని, ముమ్మాటికీ ఇవి ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లిఖిత హాస్టల్ భవనాన్ని తల్లిదండ్రులు పరిశీలించేందుకు అనుమతిని ఇవ్వాలని కోరగా వీసీ అనుమతి ఇచ్చారు. పోలీసు వాహనంలో లిఖిత తల్లిదండ్రులు యూనివర్సిటీలోని గంగా హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. అనంతరం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రిలో లిఖిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, తల్లిదండ్రులకు అప్పగించారు. లిఖిత కుటుంబాన్ని ఆదుకుంటామని యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ వెంకటరమణ హామీ ఇచ్చారు.