మరోలోకం…

ఆవుమూత్రం తాగండి, బురదలో బొర్లండి, గంటలు కొట్టండి, దీపాలు
వెలిగించండి, ధ్యానం చేయండి అని బోధచేసిన పాలకులున్న దేశంలో
మరింత మూఢత్వాలు పెచ్చరిల్లే ప్రమాదముంది. వినాయకుడు ప్లాస్టిక్‌
సర్జరీ ద్వారా ఆ అవతారాన్ని పొందాడన్న జ్ఞానవంతుల ఏలుబడిలో
యజ్ఞాలకు, యాగాలకు, మతతత్వపు ప్రచారాలకు కొదవే ఉండదు.
తమిళనాడులో ఆకాశంలో ఎగురుతున్న ఒక యువకున్ని చూపి
పవన్‌పుత్ర శ్రీహనుమాన్‌ జీ అని నమ్మిస్తున్న మేధావులకు అదొక
మెజీషియన్‌ చేస్తున్న కనికట్టు విద్యని తెలియదనుకుంటామా!
ఈ లోకం బాగోలేదు. సుఖంగానూ లేదు, సౌఖ్యంగానూ లేదు. పైగా ఎన్ని బాధలు! ఎన్నెన్ని దుఃఖాలు! ఈ అగచాట్లు, బాధలు, కష్టాలు ఎప్పుడు తీరేను! ఎలా తీరేను. విముక్తికి మార్గమేమిటి? ఎలా సాధించాలి. ఏదో మార్గం వెతకాలి. నిరంతరంగా మనుషుల్ని తొలుస్తున్న ప్రశ్నలు. ఆనాటి బుద్ధుడి నుండి నేటి ఆధునికుని వరకు ఇవే ప్రశ్నలు. ఎందరెందరో వీటికి సమాధానాలు చెబుతూనే ఉన్నారు. పరిష్కార మార్గాలనూ సూచిస్తూనే ఉన్నారు. అనేక విధాలయిన మత ధోరణులు తాత్విక ఆలోచనలూ అందులోంచే విస్తరిస్తూ వచ్చాయి కూడా. అయితే ఇన్ని వేల సంవత్సరాల కాలగమనంలో వాస్తవిక పరిష్కారం ఏదీ చూపెట్టలేకపోయింది. ఒక్క మార్క్సిజం తప్ప. అయినా అనేక విశ్వాసాలతో సమూహాలు కొనసాగుతూ ఉన్నాయి. దగ్గర దారులు వెతుక్కోవడం, తేలికయిన ప్రయత్నాలకు పూనుకోవటం మనం చూస్తూవున్నాం. ఎన్నిరకాలుగా ఇవి ఉన్నా ఒక్క విషయంలో ప్రపంచ మానవులందరూ ఏకీభావంతోనే ఉన్నారు. అదేమిటంటే, మానవులు విముక్తమవ్వాల్సి ఉందనేది. మరోలోకం అవసరమనేది. ఈ లోకం వేదనలతో, ఇక్కట్లతో, దుఃఖంతో నిండి ఉందన్న విషయం మాత్రం అందరూ అంగీకరించుతున్నారు. అందుకే పరలోకాన్ని, స్వర్గాన్ని ఊహించుకున్నారు. మోక్షము, విముక్తి మొదలైన ఆలోచనలతో ఊహాలోకాలనూ సృష్టించుకున్నాడు. విశ్వాసాలు, నమ్మకాల నుండి మూఢత్వంలోకి అంధత్వంలోకి జారిపోతున్నాడు.
ప్రపంచంలోని మతాలన్ని ఇక్కడి బాధలకు, దుఃఖాలకు, వేదనలకు పరలోకంలో పరిష్కారం చూపడంలోనే మూఢవిశ్వాసాలు ఒక్కొక్కటీ పెరుగుతూ వచ్చాయి. విశ్వాసం కలిగి ఉండటంలో ఒక రకమైన సాంత్వన, ఓదార్పు కలిగితే కలగవచ్చు కానీ మూఢత్వంలోకి వెళితే అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయి. మతాల చుట్టూ మొదలైన భ్రమలు క్రమంగా మూఢ విశ్వాసాలకు పాదువేస్తూనే ఉంటాయి. ప్రాచీన కాలం నుండి, నేటి వరకూ మూఢత్వం కొత్త రూపాలెత్తుతూనే ఉంది. వేదనలు, ఒత్తిళ్లు, సవాళ్లు, దోపిడీ పీడనలు పెరుగుతున్న కొద్దీ, వీటి నుండి ఉపశమనం పొందటం ఎలానో తెలియని పరిస్థితుల్లో, ప్రజలను మూఢవిశ్వాసాల్లోకి ప్రేరేపించి దోచుకోవడమూ మనం గమనించవచ్చు! దుఃఖాలకు అసలు కారకులైన పాలకులపై తిరగబడకుండా, ప్రశ్నించకుండా, ప్రజలలో కొన్ని మూఢ విశ్వాసాలను సృష్టించాలని మన చాణుక్యుడు కూడా సెలవిచ్చేవున్నాడు. ఇవన్నీ పాలకుల కుయుక్తులు. ఇప్పుడు మతం చుట్టూ పేరుకునే అంధత్వాలు పెరిగిపోతున్నాయి.
ఇటీవల కెన్యాలోని ఎడారిలో 80కి పైగా మృతదేహాలు దొరికాయి. ఇంటర్నేషనల్‌ చర్చ్‌ ఆఫ్‌ గుడ్‌ న్యూస్‌కు చెందిన వీరంతా ఆకలితో చనిపోవడం (ఉవాసం) ద్వారా స్వర్గానికి చేరుకోవచ్చని ఆ సంస్థ బోధించిందట. డేవిడ్‌ అనే ఫాస్టర్‌ వందల మంది విశ్వాసకులను ప్రేరేపించి ఉపవాస దీక్షకు పురికొల్పాడు. ఆయన ‘ఆధ్యాత్మిక వివాహాలు’ అనే పద్ధతిని తీసుకువచ్చి, దాని ద్వారా అన్ని వయసుల ఆడవారితో లైంగిక సంబంధాలు పెట్టుకుని లైంగిక దోపిడీకి పాల్పడ్డాడనీ తెలిసింది. ఒక ఉపవాసం చేసి ఆకలితో మరణించి దేవున్ని చేరుకోవడం ద్వారా విముక్తి పొందవచ్చన్నది వారి మూఢవిశ్వాసం. అలా చనిపోవడానికి ఇంకా వందలమంది ఉన్నారని తెలిసింది. ఇలా మతాన్ని అంటుకుని ఉన్న అంధవిశ్వాసాల వల్ల జీవితాలను, ప్రాణాలను కోల్పోవటం, గతం నుంచీ జరుగుతుండటం మనం చూస్తున్నాం. ఆ మధ్య ఆంధ్ర ప్రాంతంలో ఇద్దరు కూతుళ్లను ఇనుపబండతో బాది చంపి, తిరిగి లేచొస్తారని భావించిన తల్లిదండ్రులనూ చూశాము. కొన్ని మానవాతీత శక్తులను సంపాదించాలని మనుషులను బలిచ్చే ఘటనలూ వింటుంటాం. చేతబడులనీ, భూతవైద్యమనీ, దెయ్యం పట్టిందనీ, యంత్ర, తంత్ర, మంత్రాల తతంగాలన్నీ ఇలాంటి మూఢత్వం నుండే ఉద్భవిస్తుంటాయి. ఇలాంటి వన్నీ కూడా మనుషులు ఆలోచించాల్సిన విషయాల నుండి, చేయాల్సిన పనుల నుండి పక్కదారి పట్టించడమే.
కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం వైద్యం అందించాల్సింది పోయి, ఆవుమూత్రం తాగండి, బురదలో బొర్లండి, గంటలు కొట్టండి, దీపాలు వెలిగించండి, ధాన్యం చేయండి అని బోధచేసిన పాలకులున్న దేశంలో మరింత మూఢత్వాలు పెచ్చరిల్లే ప్రమాదముంది. వినాయకుడు ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా ఆ అవతారాన్ని పొందాడన్న జ్ఞానవంతుల ఏలుబడిలో యజ్ఞాలకు, యాగాలకు, మతతత్వపు ప్రచారాలకు కొదవే ఉండదు. తమిళనాడులో ఆకాశంలో ఎగురుతున్న ఒక యువకున్ని చూపి పవన్‌పుత్ర శ్రీహనుమాన్‌ జీ అని నమ్మిస్తున్న మేధావులకు అదొక మెజీషియన్‌ చేస్తున్న కనికట్టు విద్యని తెలియదనుకుంటామా!
ప్రజల మత విశ్వాసాలను ఆసరా చేసుకుని అనేక భ్రమలను సృష్టిస్తూ, దోపిడీలకు పాల్పడుతున్న వారి పట్ల జాగరూకులై ఉండాలి. మూఢత్వం వల్ల, అసలు సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత అనర్థాలు జరుగుతాయి. వేదనలూ, బాధలూ లేని మరో ప్రపంచాన్ని మన కృషి ద్వారా ఇక్కడే నిర్మించుకోవటమే అసలైన పరిష్కారం.

Spread the love