ఈ ప్రశ్నకు బదులివ్వు

పరిశీలించడం కావచ్చో, అధ్యయనం కావచ్చో, శ్రద్ధ కావచ్చో ఏదైతేనేమి మెరుగైన కవిత్వం సాహిత్య పత్రికల్లో కనిపిస్తుంది. సాహిత్య పత్రికలు నేటితరం కవులకు అందిస్తున్న ప్రోత్సాహం ఎంతో గొప్పది.
అచ్చయిన కవితే గొప్పది. అచ్చుకాని కవిత గొప్పది కాదని అనుకోవడానికి వీలులేదు. ఆయా సందర్భాలని బట్టి, ఆయా పరిస్థితులను బట్టి అచ్చు అవుతుండొచ్చు. ఇలా అచ్చయిన కవితల్లోంచి కావచ్చు, మాధ్యమాల్లో ప్రభావవంతంగా కనిపిస్తున్న కవిత కావచ్చు, అందులోంచి ఓ కవితను గురించి నేను ఈ కాలమ్‌ లో పరిశీలన చేస్తున్నాను. ఈ వారం డి.నాగజ్యోతి కవిత ‘ఈ ప్రశ్నకు బదులివ్వు’ ను ఎంపిక చేసుకున్నాను. ‘మాతక’ మ్యాగజైన్‌ లో అచ్చయిన కవిత ఇది.
వీరు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కవయిత్రి. ‘రెప్పవాల్చని స్వప్నం’ పేరుతో కవితా సంపుటిని ముద్రించారు.
‘ఈ ప్రశ్నకు బదులివ్వు’ అంటూ సమాధానాన్ని కోరుతున్న పేరును కవితకు పెట్టడంలోనే కవయిత్రి ఆసక్తిని రేకేత్తించింది.
ఈ వాక్యం కవితలో ఎక్కడ కనబడదు. సాధారణంగా కవిత లోపలి అర్థవంతమైన పదాన్ని, వాక్యాన్ని శీర్షికగా పెడుతుంటాం. అలా పెట్టాలని నియమమేమి లేదు. శీర్షిక నిర్ణయించటంలో కాస్త విచక్షణ అవసరం. ఈ కవితలో కవయిత్రి మొత్తం సారాన్ని ప్రతిబింబించేలా పేరు పెట్టింది. శీర్షిక నిర్వహణలో వైవిధ్యతను సాధించింది.
ప్రారంభంలోని వాక్యాలు గమనిస్తే ఎత్తుగడంతా మార్మికతతో కూడి కవితపట్ల ఆలోచనను కలిగిస్తుంది.
కవయిత్రి మూలవిషయాన్ని చెప్పటంలో ఉపయోగించుకున్న ప్రతీకలు ఆకర్షిస్తాయి. పాఠక దృష్టి కోణంలోంచి చూసినప్పుడు ఇంకాస్త సాధారణీకరిస్తే బాగుండేమో అనిపించింది.
”గీయాలనుకున్న చిత్రం
గుండెకుంచె విరిగి మరుగున పడింది
వొలికిపోయిన రంగులకలలు
లోయల్లోకి జారిపోతున్నవి”.
పై వాక్యాల్లో తన కలలను బందీ చేస్తున్న భర్తనో, ప్రియున్నో నిలదీస్తున్న
స్త్రీరూపంలోని కవయిత్రి గొంతుక ఇందులో కనబడుతుంది. ఎత్తుగడలోనే చిధ్రమయిన కలల తాలూకూ దృశ్యచిత్రాన్ని కవయిత్రి చూపించింది.
మొదటి యూనిట్‌, రెండవ యూనిట్‌, మూడవ యూనిట్‌ వరకు కవిత ఒకే రీతిగానే నడిచింది. స్త్రీ పడుతున్న వేదననంతా తెలియపరచడానికి ఈ మూడు యూనిట్లను కవయిత్రి వాడుకుంది. బాధ తీవ్రతను తెలియజేయడానికి 1) గుండె కుంచె విరిగింది 2) కలలు గొంతుబావిలో పూడుకుపోవడం 3) పదాలు పెదాల్లో సమాధి అవటం లాంటి ‘రూపకాలు’ ప్రయోగించిన తీరు కవయిత్రిలోని నిర్మాణపరమైన అవగాహనను తెలియపరుస్తుంది.
నాల్గవ యూనిట్‌కు వచ్చేసరికి కవయిత్రి ఎవరు, ఎవరితో మాట్లాడుతున్నారన్న విషయాన్ని వ్యక్తపరిచే ఒక ఆధారాన్ని వదిలింది. ‘నీవు’ అంటూ మధ్యమపురుషను ప్రయోగించటం మూలాన ఇంకో వ్యక్తితో జరిగిన సంభాషణ సారాంశం ఈ కవిత అని మనం అర్థం చేసుకోవచ్చు. కుటుంబం కోసం త్యాగం చేస్తున్న ఓ స్త్రీ పడుతున్న బాధలను గుర్తుచేస్తూ కనీసం ఏనాడయినా ఆమె కష్టాన్ని తలుచుకొని కఠిన హృదయాన్ని ప్రశ్నిస్తున్న విధానం ఈ వాక్యాల్లో గమనిస్తాం.
”నువ్వెప్పుడూ గమనించి ఉండవు
అసలెపుడూ దర్శించి ఉండవు
నువ్వెళ్ళె దారిలో నలుగుతున్న
మనోపుష్పాలని!
నువ్వు తవ్వెళ్ళుతున్న కన్నీటినదుల్ని”
ఒకటి, రెండు, మూడు, నాలుగో యూనిట్‌ వరకు కవయిత్రి స్త్రీ చే మాట్లాడిస్తుందా అని అనుమానం కలుగుతుంది. అయిదో యూనిట్‌ లో కవయిత్రి గొంతుకే ఈ కవితా అని స్పష్టంగా అర్థమవుతుంది. వస్తునిర్వహణలో కవయిత్రి కొంత నిగూఢతను ప్రదర్శించింది. మెల్లగా కవిత లోపలికి దారులు తెరిచింది.
”నీ చూపుడు వేలు గోరుతగిలికదూ
ఆమె శకలాలయ్యింది!
నీ అహంచూపులు గుచ్చుకొని కదూ
నెత్తురోడుతున్నది!”
‘అహం’ అనేది ఎంతో మందిని దూరం చేస్తున్న తరుణమిది. ఇద్దరు వ్యక్తుల మధ్య ‘అహం’ లేకుండా ఉన్నప్పుడే అవగాహన కుదురుతుంది. ఇద్దరు ఎంత దూరమైనా ఒకరికొకరుగా ప్రయాణించగలుగుతారు. ఈ విషయాన్ని ఆధారంగా చేసుకొనే కవయిత్రి అయిదవ యూనిట్‌ను నడిపింది. అహమున్న పురుషుడి వల్ల స్త్రీ ఎంతలా బాధననుభవిస్తుందో సూటిగా చెబుతుంది.
ఆరవ యూనిట్‌ ఈ కవితకు ప్రాణం లాంటిది. ఇందులో స్త్రీ, పురుషులు ఇరువురు సమానమనే భావనను తెలియజేస్తుంది. సమానతను వ్యక్తపరచడానికి ఉపయోగించిన ఈ వాక్యాలు అందరినీ మేల్కొల్పేవి.
ఈ కవితలో ఆలోచనను పుట్టించేలా ”ఒక్క సమానత్వ వాక్యమైనా/
ఆమె ఎదపుస్తకంలో రాసావా ఎపుడైనా” అంటూ కవయిత్రి కవితను పై స్థాయిలోకి తీసుకెళ్ళింది. ఇంకా స్త్రీ త్యాగాన్ని తెలియపరుస్తూ ఇంటి అభివృద్ధిలో, పురుషుని వ్యక్తిగత అభివృద్ధిలో ఎలా సహాయపడుతుందో ఈ వాక్యాల ద్వారా కళ్ళకుకడుతుంది.
ముగింపులో బలమైన పరిష్కార మార్గాన్ని చూపుతూ స్త్రీలను చైతన్యపరిచేలా చక్కని వాక్యాలు రాసింది. ఎలాంటి అర్థరహిత వాక్యాలు, అనవసరమయిన పదజాలాల మోతలు లేకుండా చిక్కగా నదీప్రవాహంలా సాగిన కవిత ఇది.
‘ఈ ప్రశ్నకు బదులివ్వు’
గీయాలనుకున్న చిత్రం
గుండెకుంచె విరిగి మరుగునపడింది
వొలికిపోయిన రంగులకలలు
లోయల్లోకి జారిపోతున్నవి!

పాడాలనుకున్న గేయం
గొంతు బావిలో పూడుకుపోయింది నిన్ననే పల్లవించిన పదాలు
పెదాల్లో సమాధి అయ్యాయి!

చెప్పాలనుకున్న మాటొకటి
మౌనం మింగి మూగబోయింది ఒంటరైన అక్షరాలు
ముక్కలై మూలుగుతున్నవి!

నువ్వెప్పుడూ గమనించి ఉండవు అసలెపుడూ దర్శించి ఉండవు
నువ్వు వెళ్లే దారిలో నలుగుతున్న మనోపుష్పాలని!
నువ్వు తవ్వెళ్లుతున్న కన్నీటి నదుల్ని!

నీ చూపుడువేలు గోరు తగిలి కదూ ఆమె శకలాలయ్యింది!
నీ అహం చూపులు గుచ్చుకొని
కదూ నెత్తురోడుతున్నది!

నిష్కల్మషమైన మనస్సు పాళీతో
ఒక్క సమానత్వవాక్యమైనా
ఆమె ఎద పుస్తకంలో
రాసావా ఎపుడైనా..

తనని చీల్చుకొచ్చిన విత్తువి కదా నువ్వు
నీ సొత్తుకై చీల్చబడ్డ తనువు కదూ ఆమె
ఎలా మర్చిపోయి
మరణ శాసనాన్ని రాస్తావు ఇలా.. ఎన్నాళ్ళిలా..

ఆమె కత్తులు ప్రసవించేంతవరకా.. నిన్ను ప్రహరించేంత వరకా..

– తండా హరీష్‌, 8978439551

Spread the love