– ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు
– ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో డ్రగ్స్‌ను నిరోధించడానికి ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పోలీసులు, ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులతో కలిపి కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ప్రత్యేక చర్యలను తీసుకోనున్నట్టు తెలిపారు. పాఠశాలలు, పిల్లల సంరక్షణ కేంద్రాల పరిధిలో మాదక ద్రవ్యాల విక్రయాలు జరగకుండా విద్యార్థులు వాటి బారిన పడకుండా ప్రహరీ క్లబ్‌లు నిఘా పెట్టాలని ఆదేశించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు /హెడ్మాస్టర్/ప్రిన్సిపాల్ అధ్యక్షతన ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఈ కమిటీలో సీనియర్ టీచర్ లేదా విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండే టీచర్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తారనీ, సభ్యులు ఆరు నుంచి పదో తరగతి వరకు తరగతికి ఇద్దరు చొప్పున, తల్లిదండ్రుల సంఘం లేదా తల్లిదండ్రుల నుంచి ఒకరు, స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఒకరు ఉంటారని తెలిపారు. విద్యాసంస్థల్లోకి మత్తు పదార్థాలు చేరనీయకుండా విద్యార్థులు మాదక ద్రవ్యాల ఊబిలో చిక్కకుండా నుంచి అవసరమైన ప్రణాళికను ప్రహరీ క్లబ్‌లు రూపొందించాలని కోరారు.