– ఏండ్లుగా సీపీఎఫ్, టీఎస్‌జీఎల్‌ఐసీ, జీపీఎఫ్ చెల్లింపుల్లేవు
– అడిగితే డిప్యూటేషన్ వేస్తూ బెదిరింపులు
– రూ.ఐదారు కోట్ల కుంభకోణం
– సమగ్ర విచారణ కోరుతున్న ఉద్యోగులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ లోపిస్తే క్షేత్రస్థాయిలో దోపిడీకి అంతు లేకుండా పోతున్నది. అక్రమార్కులు రెచ్చిపోయి ఎక్కడ అవకాశం దొరికితే ఆక్కడ చేతివాటం ప్రదర్శించడం షరామామూలే. చివరకు ప్రభుత్వాస్పత్రుల్లో పని చేసే రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత పొందేందుకు వీలుగా ప్రతి నెలా కూడబెట్టుకు నేందుకు ఉన్న సీపీఎఫ్, టీఎస్‌జీఎల్‌ఐసీ, జీపీఎఫ్‌లకు ఏండ్లుగా చెల్లింపులు చేయకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొన్నది. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఈ దారుణ పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తున్నది. వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్థన్నపేట, హన్మకొండ జిల్లా పరిధిలోని కమలాపూర్ పరకాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు సంబంధించి ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్, కో ఆర్డినేటర్, ఆఫీస్ సిబ్బంది లీలలపై ఉద్యోగులు జోరుగా చర్చించుకుంటున్నారు.
రెగ్యులర్ ఉద్యోగులు డాక్టర్స్ మొదలు 4వ తరగతి ఉద్యోగుల వరకు సీపీఎఫ్, టీఎస్‌జీఎల్‌ఐసీ, జీపీఎఫ్ కోసం వారి జీతాల నుంచి కట్ చేసుకుంటున్నారు. అయితే గత కొన్నేండ్లుగా వాటిని కట్టడం లేదని ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై కొంత మంది ఉద్యోగులు కో ఆర్డినేటర్‌ను అడిగితే డిప్యూటేషన్స్ పేరుతో బెదిరిస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటి వరకు రెగ్యులరైజేషన్ కాని ఉద్యోగులకు క్రమబద్ధీకరణ కాకుండా చూస్తానని బెదిరిస్తున్నట్టు సమాచారం. రెగ్యులర్ ఉద్యోగులకైతే ఐదేండ్ల నుంచి టీఎస్‌జేఎల్‌ఐసీ నెంబర్ లేకపోవడం గమనార్హం. అయితే ఇన్నేండ్లుగా ఇలాంటి పరిస్థితి నెలకొన్నా ఆడిట్ చేస్తున్న రాష్ట్రస్థాయి అధికారులు ప్రశ్నించకపోవడం పట్ల ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రెగ్యులర్ ఉద్యోగుల బేసిక్ పే నుంచి 10 శాతాన్ని సీపీఎఫ్ అమౌంట్‌గా కట్ చేస్తారు. టీఎస్జీఎల్‌ఐసీ కోసం కూడా కట్ చేస్తారు. అయితే తమ జీతాల నుంచి కట్ అవుతున్న అమౌంట్ వ్యక్తిగత ఖాతాల్లో జమ కావడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఇలాగే కొనసాగితే పదవీ విరమణ అనంతరం తాము నష్టపోతామనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటికే పలువురు ఉద్యోగులు స్థానికంగా ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు తమ జీతాల నుంచి మినహాయించిన సొమ్మును తమ వ్యక్తిగత ఖాతాల్లో వేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాలను సమర్పించినట్టు తెలుస్తున్నది. ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లో కట్టకుండా ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లాయో విజిలెన్స్ సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని వారు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
సీపీఎఫ్, టీఎస్‌జీఎల్‌ఐసీ సొమ్మును ఖాతాల్లో వేయాలి : బైరపాక శ్రీనివాస్
ఉద్యోగుల జీతాల నుంచి సీపీఎఫ్, టీఎస్ జీఎల్‌ఐసీ కోసం మినహాయించిన సొమ్మును వారి ఖాతాల్లో వేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) వైద్య విధాన పరిషత్ విభాగం కార్యదర్శి బైరపాక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అకౌంట్ లేని వారికి అకౌంట్ క్రియేట్ చేయాలని కోరారు. లేకపోతే యూనియన్ తరపున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.