పాలమూరు-రంగారెడ్డిపై ట్రిబ్యునల్‌లో ఏపీ కేసు కొట్టివేత

On Palamuru-Ranga Reddy Dismissal of AP case in tribunal– తెలంగాణకు 90 టీఎంసీలు వాడుకునే అవకాశం
– మంత్రులు, నిపుణుల హర్షం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కృష్ణాట్రిబ్యునల్‌ కొట్టివేసింది. దీంతో తెలంగాణకు మార్గం సుగమమైంది. పాలమూరు ఎత్తి పోతల ద్వారా కృష్ణా జలాల్లో 90 టీఎంసీల వరకు నీటిని వాడుకునే అవకాశం తెలంగాణకు దక్కినట్టయింది. బుధ వారం కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్‌-2 చైర్మెన్‌ జస్టీస్‌ బ్రిజేశ్‌కుమార్‌ అధ్యక్షతన సభ్యులు జస్టీస్‌ రాంమోహన్‌రెడ్డి, జస్టీస్‌ ఎస్‌. తలపత్ర తుది తీర్పునిచ్చారు. ఈ కేసులో తెలంగాణ తరపున సీనియర్‌ అడ్వకేట్‌ సీఎస్‌ వైద్యనాథన్‌, అడ్వకేట్‌ ఆన్‌ రికార్డు నిఖిల్‌ స్వామి, న్యాయవాది హరీశ్‌ వైద్యనాథన్‌ ఇతర న్యాయవాదులు వాదనలు వినిపించారు. అలాగే ఏపీ తరపున సీనయర్‌ న్యాయవాది ఉమాపతి, శ్రీనివాస్‌ ఇతరులు తమ వాదనలను ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లారు. కాగా 2015లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన విషయం విదితమే.ఈ ప్రాజెక్టుకు 90 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అభ్యంతరం చెబుతూ ఏపీ ట్రిబ్యునల్‌లో ఇంటర్‌లాక్యుటరీ పిటిషన్‌ (మధ్యంతర దరఖాస్తు)ను దాఖలు చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ అంశం తమ పరిధిలో లేదనీ, సరైన ఫోరంలో తేల్చుకోవాలని చెబుతూ కేసును కొట్టివేసింది. ఇందు కోసం తగిన వేదికలను ఆశ్రయించాలని ఏపీ ప్రభుత్వానికి ట్రిబ్యునల్‌ సూచించడం గమనార్హం. దీంతో కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను పరిశీలించేందుకు ఇప్పటి వరకు ఉన్న కేసు అడ్దంకి తొలగిపోయినట్టయింది. దీంతో డీపీఆర్‌ పరిశీలన వేగంగా జరిగే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర సాగునీటి శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే అటవీ, పర్యావరణ, మోటా, కేంద్ర భూగర్భజల శాఖ, కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంస్థ, కేంద్ర మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ సంస్థలు అనుమతులను ఇచ్చాయి. అంతేగాక రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 16న నార్లపూర్‌లో పాలమూరు-రంగారెడ్డి తొలి పంపును ప్రారంభించిన విషయమూ విదితమే. దీంతో ప్రాజెక్టు పనులు మరింత వేగిరం చేయడానికి వీలవుతుందని సాగునీటి శాఖ అధికారులు సైతం అంటున్నారు.
సీడబ్ల్యూసీ వెంటనే డీపీఆర్‌ను క్లియర్‌ చేయాలి సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే
పాలమూరు-రంగారెడ్డి విషయంలో కృష్ణా ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పు హర్షణీయం. 2021లో కేంద్ర ప్రభుత్వం కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీల పరిధిని నిర్ణయిస్తూ జారీ చేసిన ఆదేశాల మేరకు పాలమూరుకు కృష్ణా నుంచి కేటాయింపులు చేశాం. అది కూడా మన కేటాయిం పుల్లో నుంచే. ఇతర రాష్ట్రాలవి కాదు. ఈ పద్ధతిని గతంలో కర్నాటక సైతం అనుసరిం చింది. అప్పర్‌భద్రాకు కేటాయిం పులు చేసుకుంది. అలాగే తెలంగాణకు సంబంధించి కూడా చేశాం. కేసు అడ్డంకి తోలగిన నేపథ్యంలో ఈనపథ్యంలో సీడబ్ల్యూసీ డీపీఆర్‌ను వెంటనే పరిశీలించి సాకులు చెప్పకుండా అనుమతులు ఇవ్వాలి. ప్రాజెక్టులు పనులు సవ్యంగా సాగడానికి సహకరించాలి.
రాష్ట్రాల నీటి వాటాలను తేల్చాలి
బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పును స్వాగతిస్తున్నాం. అదే సందర్భంలో తీర్పు చాలా ఆలస్యంగా ఇవ్వడం దుదృష్టకరం. కృష్ణాజలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల వాటాను తేల్చాలి. తద్వారా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాలి. తెలంగాణ, ఏపీలో కూడా 50:50 నిష్పత్తి ప్రాతిపదికన కేటాయింపులు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేయాలి. సాగునీటి శాఖ అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలి. ప్రధాన కేసుకు సంబంధించి వ్యవహారాన్ని న్యాయసమ్మతంగా పరిష్కరించాలి.
– సాగునీటిరంగ నిపుణులు సారంపల్లి మల్లారెడ్డి
ఇది పాలమూరు విజయం
కృష్ణా ట్రిబ్యునల్‌ తీర్పు పాలమూరు విజయం. ఏపీ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పై కృష్ణా ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును మంత్రి స్వాగతిస్తున్నాం. ఎత్తిపోతల ప్రాజెక్టుకు 90 టీఎంసీల వరకు కృష్ణాజలాలు తీసుకునే అవకాశం ఈ తీర్పుతో వచ్చింది. కేసు అడ్డంకి తోలగిపోయింది. కృష్ణానదీలో తెలంగాణ నీటివాటాను వెంటనే తేల్చాలని డిమాండ్‌ చేస్తున్నాం.
– మంత్రి నిరంజన్‌రెడ్డి
సీఎం కేసీఆర్‌ గెలుపు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికత వల్లే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు వేగంగా సాగుతున్నాయి. ట్రిబ్యునల్‌లో కేసు కొట్టివేతకు సీఎం కేసీఆర్‌ పట్టుదలే కారణం. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రయోజనాలు నెరవేరతాయి. ఇప్పుడు కృష్ణాజలాలతో ఆయా ప్రాంతాలు సస్యశ్యా మలమవుతాయి. అడ్డంకులు తోలగిన నేపథ్యంలో పనులు వేగవంతం కావడానికి అవకాశం ఏర్పడింది.
– మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌

Spread the love