నవతెలంగాణ – అమరావతి: జీరో పావర్టీ విధానంపై తన ఆలోచనలు, అభిప్రాయాలు చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన మానస పుత్రిక వంటి పీ4 (పబ్లిక్ -ప్రైవేట్- పీపుల్-పార్టనర్ షిప్) విధానాన్ని మరోసారి ప్రస్తావించారు. ఆర్థిక అసమానతలు తగ్గించి సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచేందుకు పీ4 విధానం తోడ్పడుతుందని తెలిపారు. మనం బాగుండాలి… మనతో పాటు మన చుట్టూ ఉన్న అందరూ బాగుండాలి… అప్పుడే నిజమైన పండుగ అంటూ వ్యాఖ్యానించారు. జన్మభూమి స్ఫూర్తితో పీ4 విధానంలో భాగస్వాములు అవ్వాలని రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వారికి పిలుపునిచ్చారు. పీ4 అమలుకు ఈ సంక్రాంతి పండుగ వేదికగా తొలి అడుగు పడాలని ఆకాంక్షిస్తూ పీ4 విధానంపై సీఎం చంద్రబాబు నేడు ప్రకటన చేశారు. ఈ క్రమంలో ప్రజలనుంచి సూచనలు, సలహాలు, అనుభవాలు స్వీకరిస్తామని తెలిపారు.