ఏపీ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జీలు

AP High Court has four new judges–  సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు నలుగురు నూతన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సీనియర్‌ న్యాయవాదులు హరినాథ్‌ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్ ను హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రతిపాదనలకు సీజేఐ డివై చంద్రచూడ్‌ సారథ్యంలోని కొలీజియం ఆమోదం తెలిపింది. మొత్తంగా వివిధ హైకోర్టులకు జడ్జీలుగా 13 మంది పేర్లును కొలీజియం సిఫారసు చేసింది. ఢిల్లీ హైకోర్టు జడ్జీలుగా జ్యడిషియల్‌ అధికారులు శలిందర్‌ కౌర్‌, రవిందర్‌ దుడేజను సిఫారసు చేసింది. ఈ జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్ర న్యాయశాఖ ఆమోదం లభించాల్సి ఉంది.
హరినాథ్‌ నూనెపల్లి
సుప్రీంకోర్టు కొలీజియంలోని న్యాయమూర్తులు హరినాథ్‌ నూనెపల్లిని హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఆయనపై ఎటువంటి ప్రతికూలతను సూచించలేదు. అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సంబంధిత వాస్తవాలు, పరిస్థితులను సుప్రీంకోర్టు కొలీజియం పరిగణనలోకి తీసుకుంది. అన్ని విషయాల పరిశీలన అనంతరం హైకోర్టు న్యాయమూర్తిగా నియామకానికి తగినవారని భావించింది.
కిరణ్మయి మండవ
కిరణ్మయి మండవ పేరును కొలిజియం న్యాయమూర్తులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కిరణ్మయి మండవ హైకోర్టు న్యాయమూర్తిగా నియామకానికి తగినవారని భావించారు. కేంద్ర ప్రభుత్వం పరిశీలన అనంతరం అన్నింటినీ దష్టిలో ఉంచుకుని కొలీజియం కిరణ్మయి పేరును పరిగణనలోకి తీసుకుంది.
సుమతి జగడం
సుమతి జగడం ఫైల్‌ పై కొన్ని ప్రతికూల ఇన్‌పుట్‌లు ఉన్నా భారత ప్రభుత్వం అంచనాను దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్డ్‌ కులాల వర్గానికి చెందిన మహిళ అయిన ఈమెను హైకోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు కొలీజియం నిర్ణయం తీసుకుంది.
న్యాపతి విజయ్
కొలీజియం న్యాయమూర్తులు నలుగురు న్యాపతి విజయ్ ను హైకోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు అంగీకరించారు. అయితే జస్టిస్‌ జేకే మహేశ్వరి ఎటువంటి అభిప్రాయం ఇవ్వలేదు.

Spread the love