నవతెలంగాణ-హిమాయత్ నగర్ : గణేష్ నిమజ్జనం సందర్భంగా సోమవారం నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అపశృతి చోటు చేసుకుంది.తండ్రిని కాపాడబోయి 18 ఏండ్ల కూతురు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు కన్నీరు పెట్టించాయి.నారాయణగూడ సీఐ యు.చంద్రశేఖర్, డీఎస్ఐ జి.వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం..సోమవారం తెల్లవారుజామున ఎల్బీనగర్ నుండి ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనం కోసం టాస్కర్ వాహనంలో నిమజ్జనానికి వచ్చిన తండ్రి మహేందర్, తన కూతురు పూజిత (18), నిమజ్జనం అనంతరం ఇంటికి బయలుదేరుతూ హిమాయత్ నగర్ లోని వన్ ప్లస్ షోరూం వద్ద టస్కర్ వాహనంలో ఉన్న పూజిత తండ్రి మహేందర్ ప్రమాదవశాత్తు కాలు జారీ కింద పడిపోవడంతో వెంటనే తండ్రిని రక్షించే ప్రయత్నంలో పూజిత టస్కర్ వాహనం నుండి దూకడంతో వాహనం వెనుక టైర్లు ఆమె కడుపు భాగంలో బలంగా నొక్కడంతో తీవ్రంగా గాయపడింది.దీంతో వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.తండ్రి మహేందర్ క్షేమంగా ఉన్నట్లు, పూజిత డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.