గాంధీభవన్‌లో జాతర దండులా వస్తున్న దరఖాస్తులు

Fair at Gandhi Bhavan Applications are pouring in– అర్జీలకు నేడు ఆఖరు తేదీ
– కొడంగల్‌ నుంచి రేవంత్‌
– దరఖాస్తు చేసుకున్న పలువురు ముఖ్య నేతలు
– కంటోన్మెంట్‌ నుంచి నేడు సర్వే దరఖాస్తు
– భట్టి, ఉత్తమ్‌, దామోదర, పొన్నం,వంశీ కూడా…
– ఇప్పటికి 630 అర్జీలు…
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
నేతలు తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు గాంధీభవన్‌కు దండులా వచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నారు. తమ అనుచరులను వెంటేసుకుని ప్రదర్శనగా గాంధీభవన్‌కు వస్తున్నారు. డప్పు చప్పుళ్లు, జిందాబాద్‌లు, నినాదాలతో గాంధీభవన్‌ ఆవరణం దద్దరిల్లుతున్నది. దూర ప్రాంతాల నుంచి నాయకులు వాహనాలతో ర్యాలీలుగా వస్తున్నారు. పెద్ద ఎత్తున సెల్పీలకు, ఫోటోలకు ఫోజులిస్తున్నారు. కొడంగల్‌ నుంచి బరిలోదిగేందుకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ తమ దరఖాస్తులను వారి అనుచరులతో పంపించారు. ఓబీసీ జాతీయ నేత ప్రొఫెసర్‌ కత్తి వెంకటస్వామి, సీఎం కేసీఆర్‌ అన్న కూతురు కల్వకుంట్ల రమ్యారావు, మహిళా నేత ఉజ్మషాకీర్‌, నాగేష్‌ముదిరాజ్‌, జగదీశ్వర్‌రావు దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం చివరితేదీ కావడంతో కీలక నేతలు దరఖాస్తు చేసుకోవడంతోపాటు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్నది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ దంపతులు స్వయంగా వచ్చి దరఖాస్తు చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. సీడబ్ల్యూసీ సభ్యులు, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌తోపాటు పలువురు కీలక నేతలు శుక్రవారం దరఖాస్తు చేసుకోనున్నారు. గురువారం సాయంత్రానికి 630 దరఖాస్తులు వచ్చాయి.
నేడు సర్వే దరఖాస్తు
నాటి పార్టీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో విభేదించి, పార్టీకి దూరంగా ఉన్న మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ సైతం శుక్రవారం దరఖాస్తు చేసుకోనున్నారు. ఉత్తమ్‌ అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు గాంధీభవన్‌కు రాను అని చెప్పిన ఆయన…కంటోన్మెంట్‌ నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు.
కమ్మ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వండి ఠాక్రేకు కమ్మ రాజకీయ ఐక్యవేదిక వినతి
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కమ్మ సామాజికవర్గానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కమ్మ రాజకీయ ఐక్యవేదిక కోరింది. ఈమేరకు గురువారం రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, పరిశీలకులు దీపదాస్‌ మున్షీకి వినతిపత్రం సమర్పించారు.
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ నేత కొత్త జైపాల్‌రెడ్డి
బీఆర్‌ఎస్‌ నేత, మైత్రి గ్రూప్‌ చైర్మెన్‌ కొత్త జైపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆయకు రేవంత్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Spread the love