– ఉమ్మడి కరీంనగర్ బీజేపీలో కనిపించని స్ట్రాంగ్ లీడర్
– ఒకట్రెండు చోట్ల తప్ప బలమైన అభ్యర్థులు కరువు
– గత ఎన్నికల్లో హుజూరాబాద్, మంథనిలో నోటాకొచ్చిన ఓట్లూ రాని వైనం
– పోటీపై స్పష్టత లేని కరీంనగర్ ఎంపీ సంజరు
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈసారి ఎన్నికల్లోనూ బీజేపీ పోటీనిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ఒకట్రెండు చోట్ల తప్ప మిగిలిన స్థానాల్లో మూడు, నాలుగు స్థానాలు సహా కనీసం ‘నోటా’కు వచ్చిన ఓట్లూ సాధించలేకపోయింది. ఇప్పుడు కూడా బలమైన అభ్యర్థులు కనిపించడం లేదు. కరీంనగర్ ఎంపీ సంజరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారో స్పష్టత లేదు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి బలమైన నేతగా ఎదిగిన ఈటల ప్రస్తుతం బీజేపీలో ఉండటం, ఆయనకు వచ్చే ఓట్ల శాతమే ఇప్పుడు ఆ పార్టీకి ప్లస్ కానుంది. ఉమ్మడి కరీంనగర్లో గత ఎన్నికల్లో కమలం పార్టీకి వచ్చిన ఓట్లు, ఇతర అంశాలపై ‘నవతెలంగాణ’ ప్రత్యేక కథనం.కరీంనగర్ నుంచి బండి సంజరు 2014, 2018 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనా తనపై గెెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. తరువాత 2019లో వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన ఆయన ప్రస్తుతం ఎక్కడి నుంచి పోటీ చేస్తారో స్పష్టత లేదు. అయితే, కరీంనగర్ స్థానాన్ని వదులుకుని ఎల్బీనగర్, వేములవాడ, సిరిసిల్ల స్థానాల నుంచి పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే, వాటిపైనా ఆయన అనుచరుల్లోగానీ, పార్టీ శ్రేణుల్లోగానీ కనీస స్పష్టత కరువైంది.
హుజూరాబాద్‌లో ‘ఈటల’ బలమే..
బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ బలమే ఇప్పుడు కమలం పార్టీ తమ బలమనని చెప్పుకునేందుకు ప్లస్ పాయింట్‌గా మారింది. 2018 సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్‌కు లక్షా 4వేల 840 ఓట్లు వస్తే.. కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్‌కు 61,121ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ నోటాకు 2867ఓట్లు రాగా, స్వతంత్య్ర అభ్యర్థి బరిగె గట్టయ్యకు 2660 ఓట్లు వచ్చాయి. బీజేపీ నుంచి పోటీ చేసిన పుప్పాల రఘుకు 1683ఓట్లు మాత్రమే వచ్చాయి. కమలం పార్టీ ఐదో స్థానంలో నిలిచింది. అక్కడ ఏనాడూ 2వేల ఓట్లు కూడా సాధించని బీజేపీకి రాజేందర్ చేరికతో బలం వచ్చినట్టయింది. అక్కడ రాజేందర్ బలమే తప్ప ఆ పార్టీకి ఓటింగ్ లేదని విశ్లేషకులు అంటున్నారు.
మిగిలిన 11స్థానాల్లోనూ బలహీనంగానే..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఎక్కడా బీజేపీ పోటీనిచ్చే పరిస్థితి లేదనే చెప్పొచ్చు. అన్ని స్థానాల్లో ద్వితీయశ్రేణి నాయకులు, పెద్దగా ప్రజల్లో పేరూ లేని నాయకులే ఆ పార్టీ టిక్కెట్ ఆశిస్తుండటం గమనార్హం. గత ఎన్నికల్లో కరీంనగర్ మినహా ఏ నియోజకవర్గంలోనూ కనీసం 5వేల ఓట్లు కూడా సాధించలేకపోయింది. ప్రస్తుతం వేములవాడలో చెన్నమనేని కుటుంబం నుంచి వికాస్‌రావు, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మెన్ తుల ఉమ బీజేపీ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. వారు కొంత పేరున్న లీడర్లు అయినా.. గత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ప్రతాప రామకృష్ణకు 6,592ఓట్లు మాత్రమే వచ్చి మూడో స్థానంలో నిలిచారు. తరువాత చొప్పదండిలో 2014లో ఎమ్మెల్యేగా గెలిచి 2018లో బీజేపీ నుంచి పోటీ చేసిన తుల ఉమకు 15వేల ఓట్లు మాత్రమే వచ్చి మూడో స్థానంలో నిలిచారు. ధర్మపురిలో కేవలం 447ఓట్ల తేడాతోనే కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై ఓడిపోగా.. ఇక్కడ బీజేపీ అభ్యర్థి అంజయ్యకు 5272ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఆ పార్టీ నాలుగో స్థానంలో నిలిచింది. మానకొండూర్‌లో కూడా బీజేపీ అభ్యర్థి నాగరాజుకు 4356ఓట్లు మాత్రమే వచ్చి నాలుగో స్థానానికి పరిమితమైంది. ఇక్కడ సమాజ్‌వాది ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థికి 13,610ఓట్లు రావడం గమనార్హం. హుస్నాబాద్‌లో తెలంగాణ ఇంటి పార్టీ నుంచి పోటీ చేసిన తిరుపతిరెడ్డికి 4556 ఓట్లు రాగా కనీసం ఈ పార్టీతోనూ బీజేపీ పోటీపడలేక 4309ఓట్లు మాత్రమే సాధించింది. సిరిసిల్లలో బీఎస్పీతోనూ పోటీపడలేక 3243ఓట్లు మాత్రమే వచ్చిన బీజేపీకి నాలుగో స్థానమే దక్కింది. జగిత్యాలలో కూడా 4817 ఓట్లు మాత్రమే పోలైన బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది. కోరుట్లలో కొంత మెరుగ్గా 16వేల ఓట్లు సాధించినా.. ఇక్కడా మూడో స్థానమే పదిలమైంది. పెద్దపల్లి నియోజకవర్గంలో బీజేపీ సీనియర్ నేత గుజ్జుల రామకృష్ణారెడ్డికి కూడా 9375ఓట్లు మాత్రమే వచ్చాయి. మంథనిలో కమలం పార్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలనూ తట్టుకోలేకపోయింది. ఇక్కడ 1876 ఓట్లు మాత్రమే పోలై ఐదో స్థానానికి పరిమితమైంది. రామగుండం నియోజకవర్గంలో 1553 ఓట్లు మాత్రమే సాధించిన బీజేపీ అభ్యర్థి బల్మూరి వనిత ఆరో స్థానంలో నిలిచారు.