రెండో పీఆర్సీ కమిటీ నియామకం

Appointment of second PRC committee– చైర్మెన్‌గా ఎన్‌ శివశంకర్‌
– సభ్యునిగా బి రామయ్య
– 6 నెలల్లో నివేదిక
– ఐఆర్‌ 5 శాతమే..
– ఎన్నికల వేళ ప్రభుత్వ నిర్ణయం
– ఉత్తర్వులు విడుదల
– ఉద్యోగుల్లో ఆనందం… ఆశాభంగం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపికబురు అందించింది. రెండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) కమిటీని ఏర్పాటు చేసింది. పీఆర్సీ కమిటీ చైర్మెన్‌గా ఐఏఎస్‌ మాజీ అధికారి ఎన్‌ శివశంకర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సభ్యునిగా ఐఏఎస్‌ మాజీ అధికారి బి రామయ్య ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఉద్యోగులకు పేస్కేల్‌ చెల్లింపు కోసం పే రివిజన్‌ కమిటీ (పీఆర్సీ)ని నియమించాలని నిర్ణయించా రని తెలిపారు. ఆర్నెల్లలోనే పీఆర్సీ నివేదిక సమర్పించాలని ద్విసభ్య కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పీఆర్సీ బాధ్యతలను నిర్వహించేందుకు నిధులు, సిబ్బందిని సమకూర్చాలని ఆర్థిక శాఖను కోరింది. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఐదు శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌)ని ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం చెల్లిస్తున్న జీతాలు, వివిధ రాష్రాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న జీతాలతో పోల్చి చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆదాయం పెరుగుదల, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రస్తుతం అమలవుతున్న పథకాలు, వాటికయ్యే ఖర్చు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను పరిశీలించాలని కోరారు. అయితే పీఆర్సీ కమిటీని నియమించినందుకు ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. అదే సందర్భంలో ఐదు శాతమే ఐఆర్‌ ప్రకటించడం పట్ల తీవ్ర నిరాశతో ఉన్నారు. కొత్త వేతనాలు 2023, జులై ఒకటి నుంచి అమల్లోకి రావాలి. అయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ఈనెల రెండో వారంలో వచ్చే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడం, ఐఆర్‌ను ప్రకటించడం గమనార్హం.
మూడు డీఏలు పెండింగ్‌
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. గతేడాది జులై నుంచి 3.64 శాతం, ఈ ఏడాది జనవరి నుంచి 3.64 శాతం, జులై నుంచి 3.64 శాతం కలిపి మొత్తం 10.92 శాతం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉన్నది. వాటిని ఇప్పటి వరకు పెండింగ్‌లోనే ఉంచింది. మూడు డీఏలు పెండింగ్‌లో ఉంచడంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డీఏలను ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
ఉద్యోగ సంఘాల హర్షం
రెండో పీఆర్సీ కమిటీని నియమించడం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు హర్షం ప్రకటించాయి. పీఆర్సీ నియామకం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు టీఎన్జీవో అధ్యక్షులు మామిల్ల రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్‌ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రెండు పీఆర్సీలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే ఉందని పేర్కొన్నారు. ఉద్యోగుల ఆకాంక్షల మేరకు మంచి ఫిట్‌మెంట్‌తో నూతన పీఆర్సీ ఫలితాలు ఉద్యోగులందరికీ వస్తాయని తెలిపారు. ప్రభుత్వం ఆశించిన మేరకు ఉద్యోగులు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. త్వరలో సీఎం కేసీఆర్‌ను కలిసి మెరుగైన ఐఆర్‌ ప్రకటించాలని కోరతామని వివరించారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌), కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) రద్దు, డీఏలను విడుదల చేయాలని తెలిపారు.
పీఆర్సీ కమిటీ ఏర్పాటును స్వాగతించిన టీఎస్‌యూటీఎఫ్‌
పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడాన్ని టీఎస్‌యూటీఎఫ్‌ స్వాగతించింది. ఆర్నెల్లలో నివేదికను తెప్పించి అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యంతర భృతి (ఐఆర్‌) కేవలం ఐదు శాతమే ప్రకటించడం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఊహకందని అంశమనీ, దాని పట్ల తీవ్రమైన అసంతృపిని వ్యక్తం చేశారు. సంఘాలతో చర్చలు జరిపి కనీసం పది శాతం ఐఆర్‌ ఇస్తారని ఆశించిన ఉద్యోగులకు ఆశాభంగం కలిగిందని తెలిపారు. గత పీఆర్సీ బకాయిలు ఇంకా పూర్తిగా చెల్లించలేదని పేర్కొన్నారు. బకాయి ఉన్న మూడు డీఏలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ట్రెజరీల్లో ఆమోదం పొంది ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఎన్నికల షెడ్యూల్‌కు ముందే చెల్లించాలని కోరారు.
18 శాతం ఐఆర్‌ ప్రకటించాలి : టీపీటీఎఫ్‌
పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడం శుభపరిణామమని టీపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై అశోక్‌కుమార్‌, పి నాగిరెడ్డి తెలిపారు. ఐఆర్‌ ఐదు శాతం ప్రకటించడం అన్యాయమనీ, 18 శాతం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మధ్యంతర భృతి (ఐఆర్‌) 20 శాతం ప్రకటించాలని తపస్‌ రాష్ట్ర అధ్యక్షులు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్‌ సురేష్‌ డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు ఐదు శాతం మధ్యంతర భృతి ప్రకటించడం అవమానపర్చడమేనని ఇంటర్‌ విద్యా జేఏసీ చైర్మెన్‌ పి మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. తక్షణమే ఆ జీవోను రద్దు చేసి ఐఆర్‌ 20 శాతం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పీఆర్సీ కమిటీ నియామకం పట్ల సంతోషం, ఐదు శాతం ఐఆర్‌ ప్రకటించడం పట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర నిరాశకు గురయ్యారని సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాముక కమలాకర్‌, ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావు తెలిపారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు పట్ల టీజీజేఎల్‌ఏ-475 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వస్కుల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్‌ హర్షం ప్రకటించారు. ఆర్నెల్లు కాకుండా అన్ని సంఘాలతో సంప్రదించి సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదికను అందించాలని కోరారు. ఒక డీఏకు సరిపోని మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇవ్వడమంటే ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లను అవమానించడమేనని టీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్‌ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి చందూరి రాజిరెడ్డి విమర్శించారు. 15 శాతం ఐఆర్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. మధ్యంతర భృతి (ఐఆర్‌) ఐదు శాతం సరిపోదనీ, పెన్షనర్లను తీవ్ర నిరాశకు గురిచేసిందని టాప్ర రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్వులు పోతుల నారాయణరెడ్డి, పాలకుర్తి కృష్ణమూర్తి తెలిపారు.

 

Spread the love