జలకళ..

– ప్రాజెక్టుల్లోకి భారీ వరద నిండుకుండల్లా చెరువులు
– పొంగి పొర్లుతున్న వాగులు, రాకపోకలకు అంతరాయాలు
– పునరావాస కేంద్రాలకు గిరిజన ముంపు ప్రాంతాల ప్రజలు
– గోదావరి ఉధృతితో భద్రాద్రిలో మొదటి ప్రమాద హెచ్చరిక
–  నిలిచిన బొగ్గు ఉత్పత్తి
నవతెలంగాణ-విలేకరులు
రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలన్నీ నిండుకుండలా మారాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లన్నీ గండ్లు పడి రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. పలుచోట్ల పొలాల్లో నీరు చేరడంతో మొక్క దశలో ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరి నారుమడులు వరద నీటితో నిండిపోయాయి.ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. ముఖ్యంగా నగరంలోని చందానగర్‌, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, నార్సింగి, గండిపేట, బండ్లగూడ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శేరిలింగంపల్లిలోని రైల్వే అండర్‌ బ్రిడ్జి పూర్తిగా వర్షపు నీటితో నిండిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాలుగు అడుగుల మేర నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేవెళ్ల మండలం కుమ్మెర గ్రామానికి చెందిన చిన్న పెంటయ్యకు చెందిన 20 గొర్రెలు, మూడు మేకలు మృత్యువాత పడ్డాయి. నార్సింగిలో శిథిలావస్థకు చేరిన ఇండ్లను కూల్చివేశారు. వికారాబాద్‌ జిల్లాలో పలు మండలాల్లో పత్తి, మొక్కజొన్న తదితర పంటలతో పాటు కూరగాయల పంటలు నీటమునిగాయి. పరిగి సమీపంలో ఉన్న వాగు పొంగడంతో బ్రిడ్జి మీద నుంచి నీళ్లు ప్రవహించాయి. దాంతో పరిగి నుంచి వికారాబాద్‌కు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు రెండు గంటలసేపు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
పునరావాస కేంద్రాలకు ముంపు ప్రాంత ప్రజలు
ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఏటూరు నాగారం మండలం ఎలిశెట్టిపల్లి గోదావరి నది సమీపంలో ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చని ఆ గ్రామ ప్రజలను ఏటూరు నాగారంలోని ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. వాజేడు, వెంకటాపురం మండలాల్లోని ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్‌ త్రిపాఠి ఆయా మండలాల ప్రత్యేక అధికారులను, తహసీల్దార్లను ఆదేశించారు. వెంకటాపురం మండలంలో జిన్నేవాగు గురువారం ఉద్రిక్తతంగా ప్రవహించడంతో ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చత్తీస్‌గఢ్‌లో కురిసిన భారీ వర్షాలకు బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పాటు గోదావరి ఉధృతికి టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపై భారీగా నీరు చేరి ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జనగామ జిల్లాలో 150 పైగా చెరువులు నిండాయి.
మూసీ వెంట పొలాలు మునక
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. హైదరాబాద్‌ నుంచి పెద్ద ఎత్తున నీరు వస్తుండటంతో మూసీ నది పొంగిపొర్లుతోంది. దాంతో మూసీని ఆనుకొని ఉన్న పంట పొలాలు మునిగిపోయాయి. ఆలేరు, కొలనుపాక గ్రామాల మధ్యలో వాగుపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. భద్రాద్రి జిల్లాలోని ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వర్రెలు పొంగి ప్రవహిస్తున్నాయి. పాల్వంచ మండలం సీతారామ పట్టణం గ్రామంలో అత్యధికంగా 37.3 మీమీ వర్షపాతం నమోదైంది. దుమ్ముగూడెం మండలంలో నారచీర ప్రదేశం, దుకాణ సముదాయాలు నీట మునిగాయి. సున్నంబట్టి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.
ఉధృతంగా గోదావరి
భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద సాయంత్రం 5 గంటలకు గోదావరి నీటి మట్టం 43.30 అడుగులకు చేరింది. 94,64,412 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి అధికారులను జిల్లా కలెక్టర్‌ అప్రమత్తం చేశారు. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇరిగేషన్‌ అధికారుల నిర్లక్ష్యంతో స్లూయిస్‌ల వద్ద మోటార్లు పనిచేయకపోవడంతో రామాలయం ఆవరణం జలమయమైంది. 24 గంటల కంట్రోల్‌ రూమ్‌లనూ ఏర్పాటుచేశారు.
త్రివేణి సంగమంలో వరద నీరు
నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం కందకుర్తి గోదావరి త్రివేణి సంగమంలో వరద ప్రవాహం పెరిగింది. ఎగువ భాగం నుంచి నీరు వచ్చి చేరడంతో త్రివేణి సంగమంలో నీటి కళ ఉట్టిపడుతోంది. గోదావరిలో చేపల వేటకు వెళ్ళకూడదని, జాలర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే భక్తులు ఘాట్ల వద్దనే స్నానాలు చేయాలని తెలిపారు. ములుగు జిల్లా పేరూరు వద్ద గోదావరి నది 15.73 మీటర్ల ఎత్తు, రామన్నగూడెం వద్ద 14.170 మీటర్ల ఎత్తు ప్రవహిస్తూ మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరగా ఉండటంతో లోతట్టు గ్రామాల ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నారు. కాళేశ్వరం వద్ద 9.980 మీటర్ల మేర నీటి మట్టం నమోదైంది. ఇది మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల
ములుగు జిల్లాలోని సమ్మక్క సాగర్‌ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేయడంతో 59 గేట్లను ఎత్తివేశారు. అదేవిధంగా పాలెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేయడంతో నాలుగు గేట్లు ఎత్తివేశారు. ఇప్పటికే మల్లూరు ప్రాజెక్టు పూర్తిగా నిండిపోగా, లక్నవరం, రామప్ప సరస్సుల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్‌కు వరద చేరడంతో 24 గేట్లను పైకి ఎత్తి, 87933 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని ప్రాజెక్ట్‌ గేట్లు రెండు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.
స్తంభించిన బొగ్గు ఉత్పత్తి
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కాకతీయ ఖని ఓపెన్‌ కాస్ట్‌-2,3 గనుల్లో సుమారు 31,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దాంతో సుమారు రూ.15 కోట్లు నష్టం వాటిల్లింది.

Spread the love