ఆరని ‘మణిపూర్‌’ చిచ్చు

ఆదివాసీ కుకి గ్రూపుపై మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ తీవ్రవాద ముద్ర వేస్తే..అమిత్‌ షా ఏకంగా బెదిరింపులకే దిగడం ఆగ్రహంతో ఉన్నవారిని మరింత రెచ్చగొట్టడమే. ఇప్పటికైనా బెదిరింపు ధోరణలను మానుకొని విద్వేష నాటకాలకు తెరదించి చర్చల ప్రక్రియ ద్వారా శాంతి పున:స్థాపనకు పాలకులు ఉపక్రమించాలి. డబుల్‌ ఇంజిన్‌ నినాదాల మాటున విధ్వంసకర, హింసాత్మక ‘బుల్డోజర్‌’ రాజకీయాలు సాగిస్తున్న బీజేపీ దుష్ట పన్నాగాల పట్ల దేశ ప్రజానీకం, ప్రధానంగా ఆదివాసీలు, దళితులు అప్రమత్తంగా ఉండాలి.

      నింగి నేలా ఏకమైన తీరు… ఎత్తైన జలపాతాలు… విశాలమైన తోటలు, చూపు తిప్పనివ్వని గడ్డిపూలు ఎటుచూసినా రమణీయత ఉట్టిపడే ప్రకృతి సోయగాల మణిపూస… మణిపూర్‌. ఈశాన్య భారతావనిలో సెవెన్‌ సిస్టర్స్‌లో ఒకటిగా ఉన్న ఈ కొండ ప్రాంత రాష్ట్రం నెల రోజులుగా రక్తమోడుతూనే ఉంది. గత మే నెల 3న రాజుకున్న హింసాగ్ని చల్లారడం లేదు. లోయలో మెజార్టీ తెగ మైతేయి గ్రూపునకు, మైనార్టీ కుకి – నాగా ఆదివాసీలకు మధ్య ఘర్షణల్లో ఇప్పటి వరకు 120మందికి పైగా చనిపోయారు. మరో 300మందికి పైగా గాయపడ్డారు. వందలాది మంది ఆచూకీ కానరావడం లేదు. 115గిరిజన గ్రామాల్లో 3000కు పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి. దాదాపు 250కి పైగా చర్చిలు నేలమట్టమయ్యాయి. కోటిన్నర మంది సహాయక శిబిరాల్లో తలదాచు కున్నారు. ఇంతటి విధ్వంసానికి, హింసకు కారణమెవ్వరు? అంటే వేళ్లన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ‘డబుల్‌ ఇంజిన్‌’ వైపే చూపుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలోనూ బీజేపీనే గెలిపించుకుంటే ప్రగతి పరుగులెడుతుందంటూ ఎన్నికల సభల్లో ఊదరగొట్టే కాషాయ నేతలు మణిపూర్‌ అశాంతికి ఏమని బదులిస్తారు? ఇదేనా డబుల్‌ ఇంజిన్‌ ప్రగతి?
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన సమయంలోనూ దాడులు కొనసాగాయంటే శాంతిభద్రతలు ఎంతటి ఘోరమైన స్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 2002లో గుజరాత్‌లో జరిగిన గోద్రా అనంతర మారణ హోమాన్ని ప్రస్తుత మణిపూర్‌ హింసాకాండ గుర్తు చేస్తోంది. నాడు గోద్రా రైలు తగలబడిందన్న పేరుతో మైనార్టీ ముస్లింలపై పెద్దఎత్తున మారణకాండ సాగింది. ప్రభుత్వ అండదండలతో సంఫ్‌ు పరివార్‌ మూకలు పగ్గాలు తెగిన ఆంబోతుల్లా మైనార్టీల మానప్రాణాలను బలిగొన్నాయి. 2000 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. బిల్కిస్‌ బానో వంటి ప్రత్యక్ష బాధిత సాక్షులతో తడారని నెత్తుటి పుండులా గుజరాత్‌ మారణకాండ ఈనాటికీ కళ్ల ఎదుటే కదలాడుతోంది. మణిపూర్‌లోనూ ఇప్పుడు నడుస్తున్నది అలాంటి విధ్వంసమే.
మెజారిటీ మైతేయిలను షెడ్యూల్డ్‌ తెగల జాబితాలో చేర్చే ప్రక్రియపై నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో కుకి గ్రూపు ఆదివాసీలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ర్యాలీపై గుర్తు తెలియని దుండగుడు తూటాలతో విరుచుకుపడ్డాడు. దీంతో హింస రాజుకుంది. మైతేయిలకు బీజేపీ అండదండలు పుష్కలంగా ఉన్నందున… కారులో వచ్చి కాల్పులు జరిపి ఉడాయించిన ఆ దుండగులు ఎవరి పరివారమో వేరే చెప్పనవసం లేదు. మణిపూర్‌ లోయ నుండి క్రిస్టియన్‌ కుకీ-నాగా తెగలను తరిమికొట్టి మైజారిటీ మైతేయిల మెప్పుతో అధికారంలో అంటకాగాలనే దుర్బుద్ధితోనే బీజేపీ ఈ నాటకాలు ఆడుతోంది. ఇప్పటికే మైనార్టీ ఆదివాసీ తెగలను అడవుల నుంచి వెళ్లగొట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం యత్నించింది. దీంతో వారిలో తీవ్ర అభద్రత నెలకొంది. ఈ హింసాకాండలో కూల్చివేసిన ఇళ్లలో అత్యధికం కుకి గ్రూపు ఆదివాసీలవే. మూడేళ్ల కిందటే సర్వే పేరిట గిరిజనుల ఇళ్లకు మార్కు చేయడం, ఇప్పుడు ఆ ఇళ్లనే నేలమట్టం చేయడం, మణిపూర్‌ పోలీసు శిక్షణా అకాడమీ నుంచి మైతేయిలు ఆయుధాలు ఎత్తుకెళ్తున్నా మిన్నుకుండిపోవడం ఇవన్నీ… డబుల్‌ ఇంజిన్‌ విధ్వంస రచనకు దర్పణం పడతాయి. సామరస్యంగా జీవిస్తున్న గిరిజన తెగల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి వైషమ్యాలు సృష్టించి బీజేపీ ప్రమాదకరమైన మతతత్వ ఎజెండాను అమల్జేస్తోంది.
మణిపూర్‌ హింసాకాండపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని సర్వత్రా డిమాండ్‌ చేస్తుంటే… కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) కనుసన్నల్లో న్యాయ విచారణ కమిషన్‌ ఏర్పాటు చేస్తామనడం దేనికి సంకేతం? మైతేయి, కుకి గ్రూపులకు, కేంద్ర ప్రభుత్వం మధ్య కుదిరిన సస్పెన్షన్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ (సూ) ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని అమిత్‌షా హెచ్చరించారు. ఒక వైపు మైతేయిలకు ఆయుధాలు అందుబాటులో ఉంచుతూ మరోవైపు కుకిలు ఆయుధాలు అప్పగించాల్సిందేనంటూ హెచ్చరికలు జారీ చేయడం బీజేపీ పాలకుల దుర్మార్గాన్ని ప్రతిబింబిస్తోంది. ఆదివాసీ కుకి గ్రూపుపై మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ తీవ్రవాద ముద్ర వేస్తే..అమిత్‌ షా ఏకంగా బెదిరింపులకే దిగడం ఆగ్రహంతో ఉన్నవారిని మరింత రెచ్చగొట్టడమే. ఇప్పటికైనా బెదిరింపు ధోరణలను మానుకొని విద్వేష నాటకాలకు తెరదించి చర్చల ప్రక్రియ ద్వారా శాంతి పున:స్థాపనకు పాలకులు ఉపక్రమించాలి. డబుల్‌ ఇంజిన్‌ నినాదాల మాటున విధ్వంసకర, హింసాత్మక ‘బుల్డోజర్‌’ రాజకీయాలు సాగిస్తున్న బీజేపీ దుష్ట పన్నాగాల పట్ల దేశ ప్రజానీకం, ప్రధానంగా ఆదివాసీలు, దళితులు అప్రమత్తంగా ఉండాలి.

Spread the love