– రాత్రి పూట తరలింపు.. అధికారుల నిర్లక్ష్యం
– ప్రభుత్వ ఆదాయానికి గండి
నవతెలంగాణ-గార్ల
మహబూబాబాద్ జిల్లాలోనే ప్రాధాన్యత సంతరించుకున్న తెల్లరాయి (బైరెటిస్) ఖనిజం నిల్వ ఉన్న ప్రాంతం గార్ల మండలం. మండల కేంద్రానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో బాలాజీ తండా, కోట్యానాయక్ తండా పంచాయతీల సమీపంలో సుమారు 1000 ఎకరాల్లో తెల్ల రాయి ఖనిజం నిల్వ ఉన్న అటవీ ప్రాంతం. కొన్ని దశాబ్దాల కాలం పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన కొందరు పెత్తందార్లు.. కొంతమంది గిరిజనులను బినామీలుగా చూపి నాటి ప్రభుత్వం అండదండలతో బైరెటిస్ తవ్వకాలు ముమ్మరంగా జరిపి కోట్ల రూపాయలు దండు కున్నారు. ఈ ఖనిజాలు నిల్వ ఉన్న ప్రాంతం అటవీ శాఖ పరిధిలో ఉందని, తవ్వకాలకు అటవీశాఖ అనుమతులు లేవని 12 ఏండ్ల కిందటే అనుమతులు నిలిపివేశారు. ఈ క్రమంలో గతంలో తవ్వకాలు జరిపి నిల్వ ఉన్న బైరెటిస్ రాళ్లను తరలించకుండా, అక్రమ రవాణాకు వీలు లేకుండా అటవీశాఖ అధికారులు ట్రెంచ్ కొట్టించడం వంటి నియంత్రణా చర్యలు చేపట్టారు. కానీ, బైరెటిస్ రాళ్లను గతంలో లీజుకు తీసుకున్న సమయంలో సబ్ కాంట్రాక్టర్‌గా పని చేసిన ఓ కీలక వ్యక్తి.. రాజకీయ పార్టీ నాయకులు, సంబంధిత శాఖ అధికారుల అండదండలతో రాత్రి సమయంలో గుట్ట రాళ్లను ఖమ్మంలోని ఓ ప్రాంతానికి ట్రాక్టర్లు, లారీల ద్వారా మూడో కంటికి కనిపించకుండా అక్రమంగా రవాణా చేస్తూ లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం. బైరెటిస్ రాళ్లను తరలించడానికి వీలులేదని అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చెప్పు తున్నారు. కానీ 40-50 కిలోమీటర్ల దూరం నుండి ట్రాక్టర్లు, లారీలు అర్థరాత్రులు బైరెటిస్ గుట్ట ప్రాంతానికి వచ్చి పట్టు పడుతుండటంతో ప్రభుత్వ అధికారుల పాత్రపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మచ్చుకు కొన్ని ఘటనలు…
గతేడాది లారీలో అక్రమంగా బైరెటిస్ రాళ్లను తరలిస్తున్న లారీని స్థానిక పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి భూగర్భ గనుల శాఖ అధికారులకు అప్పగించారు. సంబంధిత అధికారులు జరిమానా విధించగా సదరు అక్రమదారులు చెల్లించడం గమనార్హం. ఇటీవల రాత్రి సమయంలో బైరెటిస్ గుట్ట నుంచి తెల్ల రాయిని అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టరు మధ్యలోనే మరమ్మతులకు గురి కాగా మార్గమధ్యలోనే తెల్ల రాయిని దిగుమతి చేసిన ఘటన ఉంది. కొన్ని నెలల క్రితం బైరెటిస్ రాళ్లను అక్రమంగా తరలించేందుకు అర్ధరాత్రి బైరెటిస్ గుట్ట వైపు వెళ్తున్న ఓ ట్రాక్టర్.. పినిరెడ్డిగూడెం గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢ కొట్టింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా ఖమ్మంకు చెందిన ట్రాక్టరని తేలింది. అసలు అర్ధరాత్రి వేళ ఖమ్మం నుంచి ట్రాక్టరు ఎందుకు వచ్చిందని సమీప ప్రాంతాల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బైరెటిస్ రాళ్లను తరలించేందుకు వచ్చిన ఖమ్మం, మరిపెడకు చెందిన రెండు ట్రాక్టర్లను పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు పట్టుకుని నలుగురిపై కేసు నమోదు చేశారు. బైరెటిస్ రాళ్ల అక్రమ రవాణా జరుగుతుందనడానికి ఈ ఘటనలన్నీ నిదర్శనంగా నిలుస్తున్నాయి. విషయం తెలుసుకున్న ప్రజాప్రతినిధులతో సహ కొందరు నాయకులు క్షేత్ర స్దాయిలో బైరెటిస్ రాళ్ల నిల్వను పరిశీలించి అక్రమదార్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలి
బైరెటిస్ రాళ్లను అక్రమంగా తరలించకుండా అటవీశాఖ అధ్వర్యంలో ఫారెస్ట్ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసి, రెగ్యులర్ వాచర్‌ను ఏర్పాటు చేసి తెల్లరాళ్ల అక్రమ రవాణాను నియంత్రించాలి. అక్రమదా రులపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి. ఇదే విషయం మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
-మాళోత్ వెంకట్‌లాల్, మాజీ ఎంపీపీ
పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలి
కొన్నేండ్లుగా అక్రమార్కులు సంబంధిత శాఖల అధికారుల అండదం డలతో రాత్రి వేళల్లో తెల్లరాయి ఖనిజాన్ని యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తూ లక్షలు గడిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. రాయి తరలిస్తున్న వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నా.. పోలీసు శాఖకు అటవీ, రెవెన్యూ శాఖలు పూర్తిగా సహకరించి పూర్తి స్థ్దాయిలో బైరెటీస్ అక్రమ రవాణాను నియంత్రించాలి.
-కందునూరి శ్రీనివాస్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి