ప్రాజెక్టులన్నీ పరిహాసాలేనా..!?

Are all the projects a joke?– మేడిగడ్డ బ్యారేజీ బాటలోనే అన్నారం
– ఇసుక సమస్యతో నీటిబుంగలు !
– సుందిళ్లలోనూ లోపాలు ?
– కాళేశ్వరంపై నీలినీడలు
బి.బసవపున్నయ్య
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పదేండ్ల పరిపాలనా కాలంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకమ వుతున్నది. వాటి ఉనికిపై రోజురోజుకు అనుమానాలు పెరుగుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల నిధులు కృష్ణా, గోదావరి జలాల్లో కొట్టుకుపోయిన భావన కలుగుతున్నది. నాసిరకం పనులు చేశారనడానికి అనేక భౌతిక సాక్ష్యాలు ఆయా ప్రాజెక్టుల బ్యారేజీ పిల్లర్ల పగుళ్లు, నీటి బుంగల రూపంలో కండ్లకుకడుతున్నాయి. అవినీతి, అక్రమాలకు అడ్రస్‌గా తెలంగాణ ప్రాజెక్టులు మిగిలిపోయే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు నిజంగానే అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నది. ప్రభుత్వంతోపాటు టెండర్లు దక్కించు కున్న కాంట్రాక్టు సంస్థలవైపు ప్రజలు అనుమానపు చూపులు చూసే పరిస్థితి ఎదురవుతున్నది. అధికార, ప్రతిపక్షాల ఆవేశకావేశాలు ఎలా ఉన్నా, వాస్తవాలను ఏమార్చే పరిస్థితి లేదు. నిన్నటీ మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ ఉదంతం మరువక ముందే నేడు జయశంకర్‌-భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బ్యారేజీ నాలుగో బ్లాకులోని 38, 39, 40 నంబరు గల రెండు గేట్ల వద్ద లీకేజీతో మరో ప్రమాదం ముందుకురావడంతో కాళేశ్వరంపై నీలినీడలు కమ్ముకుంటు న్నాయి. పిల్లర్ల బేస్‌మెంట్‌ కింద ఇసుకలో కదలికలు ఉండటం మూలానే నీటిబుంగలు ఏర్పడుతున్నాయి. ఇది పక్కా భారీ లీకేజీ ఉంటేనే సాధ్యమవుతుందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. ఆఫ్కాన్స్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ సంస్థ ఆధ్వర్యంలో రూ. 2730 కోట్లతో అన్నారం బ్యారేజీ నిర్మితమైంది. ఈ విషయాన్ని ఇరిగేషన్‌ అధికారులు ఖండిస్తున్నా, ఇదే వాస్తవమని స్థానికులు చెబుతున్నారు. మేడగడ్డ బ్యారేజీలోనూ ఇసుక సమస్యమూలంగా పగుళ్లు వచ్చినట్టు సాగునీటిశాఖ తాత్కాలిక నిర్ణయాకొచ్చింది. విచారణ అనంతరం వాస్తవాలు బయటకురానున్నాయి. దీంతో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ సర్కారు నిర్మించిన ప్రాజెక్టులపై అనుమానాలు పొడసూపుతున్నాయి. నాణ్యత ప్రశ్నార్థకమ వుతుండటంతో ఆయా ప్రాజెక్టుల నాణ్యతపై వాటి కింద ఉన్న సామాన్య నిర్వాసితులు, ఇతర అంశాలపై అందోళన కలుగుతున్నది.
కేసీఆర్‌ సర్కారు సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. తెలంగాణ కోసం పోరాడే క్రమంలో నీళ్లు, నిధులు, నియామకాల పేర ట్యాగ్‌లైన్‌ సైతం తగిలించుకుంది. నీళ్ల విషయంలో తప్ప మిగిలిన రెండింటిలో పెద్దగా పురోగతి లేదు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ను ఎక్కువశాతం ప్రాజెక్టుల్లోనే కుమ్మరించింది. నిధుల విషయానికొస్తే ప్రజల నుంచి వచ్చిన ఆదాయాన్ని మాత్రం ఖర్చుపెట్టగలిగిందిగానీ, కేంద్రంలోని బీజేపీ సర్కారు నుంచి ఏమీ రాబట్టలేకపోయింది. నిటిఅయోగ్‌ సూచించినా కాళేశ్వరానికి నయాపైసాను తెచ్చుకోలేకపోయింది. కాగా భారీగా ప్రజల సొమ్ముని ఖర్చుపెట్టి నిర్మించిన ప్రాజెక్టుల్లో లోపాలు బట్టబయలవుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు మూడున్నాయి. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీ, అన్నారం(సరస్వతీ) బ్యారేజీ, పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాశీపేటలో సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారు. కేంద్ర ప్రభుత్వ కంప్ట్రోలర్‌, అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) రిపోర్టు ప్రకారం కాళేశ్వరం బహుళార్థక సాధక ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుకు రూ.1.26 లక్షల కోట్లు ఖర్చుపెట్టారు. మరో రూ. 50 వేల కోట్లు ఖర్చుపెడితేగానీ ఆ ప్రాజెక్టు పూర్తికాదనేది సాగునీటి శాఖ సమాచారం. ఆమేరకు ‘కాగ్‌’ సైతం దృవీకరించింది. ప్రాజెక్టు కోసం తొలుత రూ. 80 వేల కోట్లకుపైగా ప్రాథమిక అంచనాలతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను ప్రభుత్వం సైతం రూపొందించింది. కాలం గడుస్తున్నా కొద్దీ అంచనాలుపెరుగుతూ వచ్చాయి. ప్రాజెక్టును వేగంగా చేపట్టి పూర్తిచేయాలనే లక్ష్యంతో ఒక్క కంపెనీకి కాకుండా పలు సంస్థలకు పనులు కేటాయించింది. గ్లోబల్‌ టెండర్లు పిలిచినా కొన్ని సంస్థల పట్ల పక్షపాతం చూపించారంటూ అరోపణలు, విమర్శలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. చివరకు అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. ప్రతిపక్షాలు గులాబీ సర్కారుపై ఒంటికాలిపై లేచాయి. వాటిన్నంటిని బేఖాతరు కేసీఆర్‌ ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లంటూ ముందుకు సాగిపోయింది. ప్రస్తుత పరిస్థితి ప్రాజెక్టుల్లోని డొల్లతనాన్ని బహిర్గతం చేస్తుండటం గమనార్హం. వర్షాలతో వచ్చిన వరదలకు రక్షణ గోడ సరిగ్గాలేక కన్నేపల్లి పంపుహౌజ్‌లోని దాదాపు సగం మోటర్లు నీటమునిగాయి. బీహెచ్‌ఈఎల్‌ ద్వారా మెఘా ఇంజినీరింగ్‌ కంపెనీ మోటర్లను సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. వీటిని పునరుద్ధరించడానికి దాదాపు ఏడాదిపైనే సమయం పట్టింది. ఇకపోతే మేడిగడ్డ సంగతి ఇంకా తేలనేలేదు, అప్పుడే ముచ్చటగా మూడో సంఘటన చోటుచేసుకోవడం సర్కారుపై దెబ్బమీద దెబ్బపడుతున్నది. ఇదిలావుండగా సుందిళ్లబ్యారేజీ నిర్మాణంలోనూ లోపాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

Spread the love