అ’ధర’కొడుతున్నాయి..!

ప్రముఖ ఫాస్ట్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌ మెక్‌ డోనాల్డ్‌ వంటకాల్లో టమాటాను వాడటం లేదు. కన్నాట్‌ ప్లాజా రెస్టారెంట్‌ యాజమాన్యం మెక్‌డోనాల్డ్‌ ఫ్రాంచైజీగా ఉత్తర, ఈస్ట్‌ ఇండియాలో దాదాపు నూటయాభై ఔట్‌లెట్లను నడుపుతోంది. అయితే ఇది ఢిల్లీలోని తమ రెండు రెస్టారెంట్లలో ఓ ఆసక్తికర నోటీసులంటించింది. ”మేం ఎంత ప్రయత్నించినా నాణ్యమైన టమా టాలను అందుకోలేకపోతున్నాం. దీంతో మా కస్టమర్లకు రుచికరమైన వంటకాలు అందించలేకపోతున్నాం. మా వంటకాల్లో టమాట వినియోగించడం లేదు. అర్థం చేసుకోండి” అన్నది ఆ నోటీసుల సారాంశం. పెరిగిన టమాట ధరలతో పొరుగు రాష్ట్రం కర్నాటకలో ఏకంగా ఒక భారీ చోరీయే జరిగింది. ఒక మహిళా రైతుకు చెందిన రూ.2 లక్షల విలువైన టమాటలను రాత్రి సంచుల్లో ఎత్తుకుపోయారు. ధరలు తగ్గకుంటే రానున్న కాలంలో ఇలాంటి ఘోరాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో..! పెరిగిన ధరలకు అద్దం పట్టే ఈ సంఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నా… దీన్ని అరికట్టాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం చేష్టలుడిగి చోద్యం చూస్తూ ఉండటం విచారకరం.
దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. బియ్యానికి రెక్కలొచ్చాయి. పప్పులు కొండెక్కాయి. సంతకెళ్తే కూర ‘గాయాలే’ ఎదురవుతున్నాయి. ఏకధాటిగా పెరుగుతున్న ధరలతో పేద, మధ్య తరగతి ప్రజానీకం గగ్గోలు పెడుతోంది. ధరల నియంత్రణ కమిటీ ద్వారా అదుపు చేయాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో సామాన్యుడి బతుకు గతుకుల రోడ్డు మీద ప్రయాణించే బండిలా సాగుతోంది. అగ్గిపెట్టె దగ్గర్నుంచి ఆయిల్‌ వరకు బహిరంగ మార్కెట్‌లో ధరలు మండుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉదాసీన వైఖరి వీడటం లేదు. ప్రతీ ఆరునెలలకోసారి ధరలపై సమీక్షించి అవసరమై చర్యలు తీసుకోవాలనే నిబంధలున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయలోపం అందుకు ఆటంకంగా మారుతోంది. ఇది కూడా ధరల పెరుగుదలకు ఒక కారణంగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో పేద, మధ్య తరగతి వర్గాల ఆదాయంలో ఏవైనా పెనుమార్పులు సంభవించాయా? అంటే అదేం లేదు. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు ఈ ధరాఘాతం భరించలేనిది. వచ్చే సంపాదన చేతి ఖర్చులకు సరిపోవడం లేదు. పెరిగిన ధరలతో పోలిస్తే వేతనాలు ఏమైనా పెరిగాయా అంటే అదీ లేదు. కేంద్రం కనీస వేతనం రోజుకు రూ. 178 ప్రకటించింది. అంటే నెలకు రూ.4628. ఈ లెక్కన చూస్తే సగటు కుటుంబం ఈ ఖర్చుతో వారం కూడా గడపలేదు. సన్నబియ్యం క్వింటాల్‌కు దాదాపు అదనంగా రూ.800 నుంచి వెయ్యికి పెరిగింది. కిలో కందిపప్పు రూ.118 ఉంటే తాజాగా 160. మధ్య తరగతి ప్రజలకు పప్పన్నమే పరమావధి. ఇప్పుడది కూడా అందుకోలేనంత ఎత్తుకు ఎగబాకింది. అల్లం, వెల్లుల్లి రేట్లు కిలో రూ. 150 దాటేశాయి. మినపప్పు, పెసరపప్పుది కూడా అదేదారి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగినప్పుడల్లా ఈ పెరుగుదల అదనం.
ఇక కూరగాయల ధరలైతే చెప్పలేని పరిస్థితి. టమాట ధర వింటే మాట పడిపోతుందా? అన్నట్టుగా ఉంది. కిలో టమాట రూ.150. రెండు నెలల కిందటి వరకు కిలో రూ.20 ఉన్న ధర అమాంతం పెరగడంతో చాలావరకు టమాటను కొనడమే మానేశారు. సోషల్‌మీడియాలో దీనిపై సెటైర్లు కూడా వస్తున్నాయి. ఒక్క టమాటే కాదు పచ్చిమిర్చి, బెండకాయ, దొండకాయ, క్యాప్సికమ్‌ ఏది చూసినా కిలో వంద పైనే ఉన్నాయి. ధరల పెరుగుదలతో వ్యాపార సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లలోనూ టమాట వినియోగం తగ్గించారు. పేదోడికి మాంసహారం స్థానాన్ని కోడిగుడ్డు, చికెన్‌ భర్తీచేస్తుంది. గుడ్డు రూ.7, చికెన్‌ రూ.400కు చేరింది. కనీసం పచ్చడితోనైనా సరిపెట్టుకుందామంటే వంటనూనెల ధరలు, మామిడి కాయలు ప్రియమైపోయాయి. గ్యాస్‌ భారం సరేసరి. కరోనాకు ముందు లీటర్‌ రూ.90 ఉన్న నూనె మార్కెట్‌లో నేడు రూ.140 నుంచి 150 పలుకుతోంది. ఈ ధరల పెరుగుదలకు కారణాలు విశ్లేషిస్తే ప్రకృతి విపత్తులతో పంటలకు నష్టం రావడం, ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, దీనికితోడు బడా వ్యాపార వర్గాలు నిత్యావసర సరుకులకు కృత్రిమ కొరత సృష్టించడమేనని బోధపడుతోంది. వీటికితోడు కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ ప్రభావం కూడా అంతా ఇంతా కాదు. ఇది పేరుకు వ్యాపారులకే అని చెప్పినా వాటి భారమంతా సామాన్యులపైనే కదా! అయితే ప్రజల పట్ల బాధ్యతగల ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రకాల సాగులకు తగిన ప్రోత్సాహమివ్వాలి. అప్పుడు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం రాదు.పైగా రైతులకు కూడా తగిన సహకరమందించినట్టు అవుతుంది. కానీ ఈ పాలకులు ఆ బాధ్యతను విస్మరిస్తే ఏం చేయాలి? ఇది ప్రజలు ఆలోచించాలి.

Spread the love