గురుకులాలు, హాస్టళ్లలో వసతులున్నాయా?

– ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
నవతెలంగాణ – హైదరాబాద్‌
ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాసంస్థలు, హాస్టళ్లలో కనీస వసతులున్నాయో?, లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హాస్టళ్లలో మౌలిక వసతులపై సమగ్ర వివరాలు అందజేయాలని ఆదేశించింది. అక్కడ కలుషిత ఆహారం సరఫరా కారణంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆస్పత్రిపాలు కావడంపై వివరాలు ఇవ్వాలని కోరింది. విచారణను వచ్చే ఆరో తేదీకి వాయిదా వేస్తూ పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఆలోక్‌ అరాదే, జస్టిస్‌ ఎన్‌వి శ్రవణ్‌ కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం ఆదేశాలిచ్చింది. బాలల హక్కుల పరిరక్షణకు నేషనల్‌ కమిషన్‌ నిర్దేశించిన మార్గదర్శకాలను అమలు చేయడం లేదంటూ గతంలో హైదరాబాద్‌కు చెందిన కె అఖిల్‌ గురుతేజ దాఖలు చేసిన పిల్‌లో ఇటీవల నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని హాస్టళ్లలో విద్యార్థినిలు కలుషిత ఆహారం వల్ల పెద్ద సంఖ్యలో ఆస్పత్రిలో చేరారంటూ అనుబంధ పిటిషన్‌ వేశారు. సుమారు 300 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చేరారనీ, ఇంకా పది మందికిపైగా విద్యార్థినులు ఐసీయూలో ఉన్నారని వివరించారు. పిటిషనర్‌ వాదనల తర్వాత ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులను జారీ చేసింది. విచారణను వచ్చేనెల ఆరో తేదీకి వాయిదా వేసింది.
రిజర్వేషన్లకు లోబడే ఆ పోస్టుల భర్తీ : హైకోర్టు
గురుకులాల్లో బోధనా సిబ్బంది 3,026 పోస్టుల భర్తీకి ఇచ్చిన వేర్వేరు ఐదు నోటిఫికేషన్లను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్‌ మాధవీదేవి మంగళవారం విచారించారు. రిజర్వేషన్‌ విధానం అమలు చేస్తున్నదీ లేనిదీ వివరిస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని గురుకుల విద్యాలయాల సంస్థ నియామక బోర్డును ఆదేశించింది. గురుకులాల్లో బోధనా సిబ్బంది నియామకాలప్పుడు గతంలో సుప్రీంకోర్టు రాజస్థాన్‌ కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేస్తున్నారో? లేదో? చెప్పాలని కోరింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. గురుకులాల్లోని డిగ్రీ కాలేజీ, జూనియర్‌ కాలేజీల్లో లెక్చరర్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రరియన్లు, పీజీ టీచర్లు, గ్రాడ్యుయేట్‌ టీచర్‌ పోస్టుల భర్తీ సమాతరంగా కాకుండా వర్టికల్‌గా రిజర్వేషన్లు అమలు చేయడం చెల్లదంటూ ఏప్రిల్‌ ఐదున జారీ చేసిన ఐదు నోటిఫికేషన్లను సవాలు చేస్తూ కె శ్రీను ఇతరులు వేసిన పిటిషన్‌పై విచారణను వచ్చే నెల 16కి వాయిదా వేసింది.

Spread the love