శారీరక ఆరోగ్యం కోసం పండ్లు తినాలని సూచిస్తుంటారు ఆరోగ్య నిపుణలు. పండ్లు తినడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఇతర పోషకాలు అందుతాయి. బలమైన రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడానికి, మెరిసే చర్మం కోసం పండ్లను క్రమం తప్పకుండా తినాలని సూచిస్తారు. అయితే, పండ్లు తినడమే కాదు.. వాటి ద్వారా కలిగే ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందడానికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. మరి పండ్లు ఎలా తినాలి? అనే కీలక వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
– పండ్లను జ్యూస్‌గా చేసుకుని తాగడం కంటే.. వాటిని సహజ రూపంలోనే తినేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిని నేరుగా తినడం వలన శరీరానికి అవసరమైన ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పూర్తి స్థాయిలో అందుతాయి. పండు పూర్తిగా తినడం వల్ల.. వాటిని ప్రయోజనాలు పొందడంతో పాటు, దాని రుచిని కూడా ఆస్వాదించొచ్చు.
– చాలా మంది భోజనం చేసిన వెంటనే పండ్లను తింటారు. కానీ, అలా చేయొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, అజీర్తి, బరువు పెరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పండ్లను లంచ్ గానీ, డిన్నర్ తరువాత గానీ వెంటనే తీసుకుంటే వాటి ప్రయోజనాలను పొందలేరు.
– గింజలు కూడా ముఖ్యం: కొన్ని పండ్లలో గింజలు కూడా ఉంటాయి. వాటిని తప్పకుండా తినాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ గింజలు మంచి పోషకాలు కలిగి ఉంటాయని చెబుతున్నారు.
– పండ్లు ఎప్పుడు తిన్నా తాజా వాటినే తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజా పండ్లు మంచి రుచితో పాటు.. ఆరోగ్యాన్ని ఇస్తాయి. పాడైన పండ్లు తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. తాజా పండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
– ఒకే రకమైన పండ్లు కాకుండా.. వివిధ రకాల పండ్లను తినాలి. తద్వారా అన్ని రకాల పండ్లలో ఉన్న పోషకాలు శరీరానికి అందుతాయి. రోజూ కనీసం కొన్ని పండ్లు తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.