అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..?

– ఎమ్మెల్యే  జగదీశ్ రెడ్డికి మాజీమంత్రి దామోదర్ రెడ్డి బహిరంగ సవాల్…
– విధ్యా శాఖామంత్రిగా ఉండి కనీసం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తెచ్చావా..?
– విద్యుత్ శాఖామంత్రిగా ఉండి సూర్యాపేటకు ఎన్ని సబ్ స్టేషన్లు తెచ్చావు??
– గ్రామాల్లో నువ్వు వేసిన రోడ్లు ఎన్ని, తీసిన కాలువలెన్ని..?
– గ్రామాలలో ఎంతమందికి డబుల్ బెడ్ రూం  ఇండ్లు ఇచ్చావు..?
– సుందరీకరణ పేరుతో సర్వం దోచుకుంది నిజం కాదా..?
– రెండెకరాల యజమానివైన నీకు రూ.2 వేళ కోట్లు ఏవిధంగా వచ్చాయి..?
నవతెలంగాణ – చివ్వేంల
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివ్వేంల మండలం ఉండ్రుగొండ , తుల్జారావుపేట, గుంపుల, తిరుమలగిరి, గుంజలూరు గ్రామాలలో పర్యటించిన మాజీమంత్రి కాంగ్రెస్ పార్టీ   సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి పర్యటించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. కాంగ్రేస్ పార్టీకి ఓటువేసి అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు.   నాలుగు తరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని రాజకీయాల్లో ముందుకు సాగుతున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్తున్న బిజెపి యువతను, నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. దేవుని పేరు చెప్పుకొని బిజెపి పార్టీ రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ కంటే ముందే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అంశాన్ని లేవనెత్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఢిల్లీకి పిలిపించి కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందని హామీ ఇచ్చారని, ఆ హామీ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని చెప్పారు. టిఆర్ఎస్ నాయకులు ఉద్యమాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం రాలేదని కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే వచ్చిందన్నారు. చెప్పిన ప్రతి హామీని అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష్యమన్నారు.  ఈనెల 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి కి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఏఐసీసీ  సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కొప్పుల వేణారెడ్డి  జిల్లా నాయకులు,చివ్వేంల మండల  కాంగ్రేస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.
Spread the love