– ఎలివేటెడ్ కారిడార్ ప్లైఓవర్ పనుల జాప్యంపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం
– కేటీఆర్ ఇంగ్లీషులో మాట్లాడటమే కానీ అభివృద్ధి చేయలే..
– వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు
– అందులో 135 మేమే గెలుస్తాం
– ముఖ్యమంత్రి మళ్ళీ రేవంత్ రెడ్డే..
– ఎలివేటెడ్ కారిడార్ పనుల పరిశీలన సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
ఆరేండ్ల నుంచి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో తీవ్రమైన జాప్యం జరుగుతుందని, వరంగల్, నల్లగొండ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. గత పాలకుల అలసత్వం కారణంగానే ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి కాలేదని తెలిపారు. ఆదివారం మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ పనులను స్థానిక ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అన్నీ తానై నడిపిన మాజీ మంత్రి కేటీఆర్ ఇంగ్లీషులో మాట్లాడటం, సెల్ఫీలు తీసుకోవడం తప్ప.. ఏనాడూ హైదరాబాద్ అభివృద్ధిపై దృష్టి సాధించలేదని విమర్శించారు. గతంలో ఈ ప్రాంత ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డి ఎలివేటర్ కారిడార్ నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై అనేక సార్లు పార్లమెంటులో ప్రశ్నించారని గుర్తుచేశారు. ఈ మధ్య కాలంలో స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఫ్లై ఓవర్ సమస్యను వివరించామని తెలిపారు. నూతన టెండర్లతో పనులు చేసేందుకు అవకాశం ఇచ్చారని, అయితే వ్యయం రూ.200 నుంచి రూ.300 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మరో పది రోజుల్లో పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో 175 అసెంబ్లీ స్థానాలు అవుతాయని, అందులో 135 స్థానాలను మళ్లీ కాంగ్రెస్ కైవసం చేసుకొని అధికారంలోకి వస్తుందని, రేవంత్ రెడ్డే మళ్ళీ సీఎం అవుతారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే రూ.31 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేసినట్టు తెలిపారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్.. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు కనీసం అసెంబ్లీకి రాలేదని, ఇదేనా కేసీఆర్ చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు సభను పక్కదారి పట్టించాయని అన్నారు. త్వరలోనే ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, మేడ్చల్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి, బోడుప్పల్ మేయర్ తోటకూర అజరు యాదవ్, ఫీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, ఐఏఎస్ అధికారి హరిచందన తదితరులు పాల్గొన్నారు.