ఆర్మీ భూమికి రెక్కలు

Army wings to land– కొనుగోలు చేసిన అదానీ, రవిశంకర్‌, బాబా రాందేవ్‌
– స్నేహితుల కోసం మోడీ ధారాదత్తం చేశారు : ప్రతిపక్షం
– అయోధ్యలో భూ రాబందులు
– ఆ తర్వాత డీ-నోటిఫై చేసిన యూపీ గవర్నర్‌
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఆర్మీ శిక్షణ కోసం ప్రభుత్వం నోటిఫై చేసిన భూమిని పారిశ్రామికవేత్త అదానీ, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ రవిశంకర్‌, యోగా గురు బాబా రాందేవ్‌ గుట్టుచప్పుడు కాకుండా కొనేశారు. ఇది జరిగిన తర్వాత రాష్ట్ర గవర్నర్‌ దానిని డీ-నోటిఫై చేశారు. చట్ట ప్రకారం ఆ భూమిని కేవలం వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే వినియోగించాల్సి ఉండగా ఇప్పుడు నిర్మాణాలు, వాణిజ్య కార్యకలాపాలు చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాంతంలో మ్యాపింగ్‌ను అనుమతిస్తామని అయోధ్య డెవలప్‌మెంట్‌ అథారిటీ తాజాగా చేసిన ప్రకటన దీనికి ఊతమిస్తోంది. ప్రధాని మోడీ తన స్నేహితుల కోసం సైనిక భూమిని ధారాదత్తం చేశారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
లక్నో : అయోధ్యలో సైనిక శిక్షణ కోసం ‘బఫర్‌ జో్‌’గా గుర్తించిన ప్రాంతాన్ని ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ డీ-నోటిఫై చేసిన మరునాడే ఆ ప్రాంతంలో మ్యాపింగ్‌ను అనుమతిస్తామని అయోధ్య డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏడీఏ) తెలిపింది. అంటే ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టేందుకు, దానిని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించేందుకు పచ్చజెండా ఊపింది. అదానీ గ్రూపుకు చెందిన హోంక్వెస్ట్‌ ఇన్‌ఫ్రా స్పేస్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆధ్వర్యంలో రజిస్టరైన వ్యక్తి వికాస్‌ కేంద్రం (వీవీకే)తో పాటు యోగా గురు రాందేవ్‌ బాబాతో, రాందేవ్‌కే చెందిన భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్ట్‌తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు భూమిని కొనుగోలు చేసిన కొన్ని నెలలకే ఆ ప్రాంతాన్ని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం డీ-నోటిఫై చేయడం గమనార్హం. ఆ భూమిలో మ్యాపింగ్‌లను అనుమతిస్తామని ఈ నెల 6న ఏడీఏ ఒక ప్రకటనలో తెలిపింది.
గుట్టుచప్పుడు కాకుండా డీ-నోటిఫై
2020 ఆగస్ట‌, 2024 జూలై మధ్య కాలంలో 14 గ్రామాలకు చెందిన 13,391 ఎకరాల భూమిని సైనిక శిక్షణ కోసం బఫర్‌ జోన్‌గా నోటిఫై చేశారు. జనవరిలో అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగానికి ముందు ఇందులోని 2,211 ఎకరాల భూమిని పైన తెలిపిన సంస్థలు కొనుగోలు చేశాయి. ఇప్పుడు ఆ భూమిని డీ-నోటిఫై చేశారని ‘ది ప్రింట్‌’ పోర్టల్‌ తెలిపింది. డీ-నోటిఫై చేసిన రెండు నెలల తర్వాత కానీ ఆ విషయం ప్రజలకు తెలియలేదు. ఆ ప్రాంతాన్న అభివృద్ధి చేయడానికి మ్యాపింగ్‌ను అనుమతిస్తామని స్థానిక మీడియాలో ప్రకటనలు విడుదల చేసిన తర్వాతే విషయం బహిర్గతమైంది.
కోర్టు ఆదేశాలు బేఖాతరు
ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేసినా, విక్రయించినా దానిని కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని చట్టం చెబుతోంది. ఆ ప్రాంతంలో నిర్మాణాలు, వాణిజ్య కార్యకలాపాలు నిషిద్ధం. ఎందుకంటే దాని పక్కనే ఉన్న ఆర్మీ భూమిలో సైని కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుంటారు. దీనివల్ల ప్రజలు, జంతువులకు గాయాలు కావచ్చు. ఆస్తులకు నష్టం కలవచ్చు. అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై గత సంవత్సరం నవంబరులో ఏడీఏ ఓ ఆర్డర్‌ జారీ చేసింది. నోటిఫై చేసిన భూమిలో అభివృద్ధి కోసం మ్యాపింగ్‌ను లేదా నిర్మాణాలను అనుమతించబోనని అందులో తెలిపింది. బఫర్‌ జోన్‌లో ఆక్రమణలు జరుగుతున్నాయంటూ అయోధ్యు చెందిన న్యాయవాది ప్రవీణ్‌ కుమార్‌ దూబే దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పురస్కరించుకొని హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
‘రక్షణ మంత్రిత్వ శాఖకు అప్పగించిన ప్రభుత్వ భూమిలో అక్రమణలను అనుమతించకూడదు. చట్టాన్ని ఉల్లంఘించి ఇతర ప్రయోజనాలకు దానిని ఉపయోగించకూడదు’ అని కోర్టు తెలిపింది.గతంలో కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటానని చెప్పిన ఏడీఏ, ఇప్పుడు మాట మార్చింది. గతంలో ఇచ్చిన ఆర్డర్‌ నుండి 2,211 ఎకరాలను తాజా పత్రికా ప్రకటన నుండి తొలగించింది.
ప్రతిపక్షాల మండిపాటు
ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. డీ-నోటిఫికేషన్‌పై నిలదీశాయి. ఈ అంశం ఇప్పటికీ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎలా డీ-నోటిఫై చేస్తారని న్యాయవాది దూబే ప్రశ్నించారు. బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. మతం, జాతీయతావాదం ముసుగులో వారు ఏం చేస్ున్నారో చెప్పాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పవన్‌ ఖేరా డిమాండ్‌ చేశారు. ‘సైనిక శిక్షణ కోసం బఫర్‌ జోన్‌గా నోటిఫై చేసిన భూమిని ముందుగా అదానీ, రవిశంకర్‌, బాబా రాందేవ్‌ కొనుగోలు చేశారు. ఆ తర్వాత గవర్నర్‌ దానిని డీ-నోటిఫై చేశారు’ అని చెప్పారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అయోధ్యలోని సైనిక భూమిని స్వాధీనం చేసుకొని, తన స్నేహితులకు కట్టబెట్టిందని అమ్‌ఆద్మీ పార్టీ నాయకుడు సంజరు సింగ్‌ రోపించారు.

Spread the love