ఆర్టీసిలో ఎన్నికల నిర్వహణకు ఆర్నెల్ల గడువు కోరడం సరైందికాదు

– ఈయూ నేత రాజిరెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఆర్టీసీలో ఎన్నికలను నిర్వహించేందుకు ఆర్నెల్ల గడువు కావాలని కోరడం సరైందికాదని ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె రాజిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆర్టీసీలో ప్రతిఏటా జులై, ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాలు స్లాక్‌ సీజన్‌గా ఉంటుందనీ, వర్షాలు పడటం వల్ల ప్రజలు వ్యవసాయ పనుల్లో నిమగమై ఉంటారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూన్‌ 18 నుంచి ఆగస్టు 18 వరకు ముహూర్తాలు కూడా లేవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఆగస్టు లోపు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి, ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా బీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘాలు చిత్తుగా ఓడిపోతాయనీ, ఆ ప్రభావంతో వచ్చే సాధారణ ఎన్నికల్లో పార్టీకి నష్టం కలుగుతుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్త్తోందని విమర్శించారు. టీఎంయూ నాదంటే, నాదంటూ థామస్‌రెడ్డి, అశ్వత్థామరెడ్డి కొట్టుకుంటున్నాయని విమర్శించారు. రెండు వర్గాల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందనీ, ఆ యూనియన్‌ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడంతో కూడా ఎన్నికలకు ఈ ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని పేర్కొన్నారు.

Spread the love