తెరపై అద్భుతాలను ఆవిష్కరించిన ఉత్తమ చితం ఎరౌండ్‌ ది వరల్డ్‌ ఇన్‌ 80 డేస్‌

The best film that unleashes wonders on screen Around the World in 80 Daysఫ్రెంచ్‌ రచయిత జూల్స్‌ వర్న్‌ 1872లో రాసిన నవల అధారంగా అదే పేరుతో 1956లో తీసిన అడ్వెంచర్‌ కామెడీ ‘ఎరౌండ్‌ ది వరల్డ్‌ ఇన్‌ 80 డేస్‌”. ఈ భారీ చిత్రం షూటింగ్‌ 13 దేశాల్లో, 112 లొకేషన్లు, 140 సెట్‌లలో జరిగింది. దీని కోసం నటులందరూ ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, ఇండియా, తూర్పు పాకిస్తాన్‌ (ప్రస్తుత బంగ్లాదేశ్‌) స్పెయిన్‌, థారులాండ్‌ జపాన్‌లను సందర్శించారు. టైమ్‌ మ్యాగజైన్‌లో వచ్చిన సమీక్ష ప్రకారం మొత్తం 68,894 మంది నటులు ఈ చిత్రంలో పాల్గొన్నారు. ఇందులో ‘4 ఉష్ట్రపక్షులు, 6 ఉడుములు, 15 ఏనుగులు, 17 ఫైటింగ్‌ ఎద్దులు, 512 రీసస్‌ కోతులు, 800 గుర్రాలు, 950 బర్రెలు, 2,448 అమెరికన్‌ గేదెలు, 3,800 రాకీ మౌంటైన్‌ షీప్‌లు, 7,959 జంతువులు పాల్గొన్నాయి. ఇవి కాక రెండు ప్రత్యేక సీన్లలో ఓ పిల్లి, ఓ ఆవు కూడా కనిపిస్తాయి. వార్డ్‌రోబ్‌ విభాగం 74,685 దుస్తులు, 36,092 ట్రింకెట్‌లను అందించడానికి 410,000 డాలర్లు ఖర్చు చేసింది. ఇంత భారీగా దుస్తులు డిజైన్‌ చేయించిన హాలీవుడ్‌ చిత్రం కూడా ఇదే.
కథా నేపద్యంలో చూపినట్లుగానే 1872 లోనే సాగుతుంది. ఫాగ్‌ అనే ఓ ధనిక ఇంగ్లీషు వ్యక్తి క్రమబద్దమైన జీవితాన్ని కోరుకుని లండన్‌లో ఓ ఇంట నివాసం ఉంటాడు. స్నానం చేసే టబ్‌ ఎంత వరకు నింపాలో, టోస్ట్‌ ఎన్ని ఫారెన్‌ హీట్ల వేడితో ఉండాలో చెబుతూ ఆ నియమాల్లో కాస్త తేడా వచ్చినా ఊరుకోడు. ఈ నియమాలకు భయపడి అక్కడ పని చేయలేక ఎందరో పారిపోతారు. ఓ ఏజెన్సీకి పని వెతుక్కుంటూ వచ్చిన పాస్పార్తోత్‌ ఈ ఉద్యోగంలో కోరి చేరతాడు.
ఫాగ్‌ ఓ ప్రతిష్టాత్మకమైన రిఫార్మ్‌ క్లబ్‌ మెంబర్‌. అక్కడ ఓ బ్యాంక్‌ దోపిడి గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. ఫాగ్‌ ఆ దొంగ నైపుణ్యాన్ని మెచ్చుకుంటాడు. అలా మొదలైన సంభాషణ ప్రపంచ యాత్రపైకి మళ్లుతుంది. తాను ఎనభై రోజుల్లో ప్రపంచాన్ని చుట్టు రాగలనని ఫాగ్‌ సవాలు చేస్తాడు. దీన్ని నలుగురు మిత్రులు ఖండిస్తారు. పంతం పెరిగి, పందెం కాసే వరకు వస్తుంది. ఫాగ్‌ ఆ మరునాటి నుండి లెక్కపెట్టి ఎనభై రోజుల్లో ప్రపంచ యాత్ర చేసి వస్తే ఆ నలుగురు ఐదువేల ఫౌండ్లు ఒకొక్కరుగా ఫాగ్‌కు ఇస్తామని చెప్తారు. రాలేని పక్షాన అంతే మొత్తం వారొక్కొక్కరికీ తాను ఇస్తానని ఫాగ్‌ బదులిస్తాడు. అంటే ఈ పందెం ఓడిపోతే ఫాగ్‌ ఒక్కడికి ఇరవై వేల పౌండ్ల నష్టం జరుగుతుంది. ఇది ఫాగ్‌ మొత్తం ఆస్తి విలువ.
ఆ రాత్రి ఇంటికి చేరిన ఫాగ్‌ అంతకు ముందు రోజే ఉద్యోగంలో చేరిన పాస్పార్తోత్‌తో కలిసి ప్రపంచ యాత్ర మొదలెడతాడు. డబ్బు ఎక్కువ ఇస్తూ, వాహనాలను వేగంగా నడిపించుకుంటూ పారిస్‌ చేరతారు ఇద్దరు. అక్కడి నుండి మొదలవాల్సిన రైలు ఆల్ప్స్‌ పర్వతాలలో ఓ సొరంగంలో జరిగే మరమ్మత్తుల కారణంగా ఆగిపోతుంది. దానితో థామస్‌ కుక్‌ ఎజెంట్‌ దగ్గర ఓ హైడ్రోజన్‌ బెలూన్‌ కొనుక్కుని అందులో ఇద్దరూ ప్రయాణం చేస్తారు. ఈ బెలూన్‌కి కట్టిన పెద్ద బుట్టలోకి ఎక్కి షాంపేన్‌ తాగుతూ ఆల్ప్స్‌ పర్వతాలను దాటుతున్న ఆ ఇద్దరిని చూస్తే ప్రేక్షకులకు అసూయ కలగక మానదు. అయితే ఈ సన్నివేశం నవలలో లేదు. రచయిత అంతకు ముందు రాసిన ‘పైవ్‌ వీక్స్‌ ఇన్‌ ఏ బెలూన్‌’ అనే నవలలో కొంత భాగం తీసుకుని ఈ సన్నివేశాన్ని చిత్రించారు. ఇది ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకునే చిత్రీకరణ కూడా.
బెలూన్‌ చివరకు స్పెయిన్‌లో దిగుతుంది. అక్కడ ఓ నావ కోసం ఫాగ్‌ ప్రయత్నిస్తాడు. అది ఓ ధనిక నావికుడు దగ్గర ఉందని తెలుసుకుని అతన్ని కలవడానికి ఓ బార్‌కి వెళ్తారు ఫాగ్‌ పాస్పార్తోత్‌లు. ఆ బార్‌లో చేసే స్పెయిన్‌ సాంప్రదాయ ఫ్లామెంకో నత్యం సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఆ నతంలో ఎర్రని గుడ్డతో నాట్యం చేస్తూ అలరిస్తాడు పాస్పార్తోత్‌. దాన్ని చూసిన ఆ నావికుడు మరునాడు జరగబోయే బుల్‌ ఫైట్‌లో పాస్పార్తోత్‌ పాల్గొంటే తాను నావను వారికి ఇస్తానని చెప్తాడు. ఆ ఫైట్‌లో పాస్పార్తోత్‌ పాల్గొని ప్రేక్షకుల మనసుల్ని దోచేస్తాడు. దాంతో నావికుడు ఆ నావను వారికి ఇచ్చేస్తాడు. ఈ బుల్‌ ఫైట్‌ సీన్‌ ఒక్కదాని కోసమే పూర్తి కాస్టూమ్స్‌తో దర్శకులు పదివేల మంది ఎక్స్ట్రాలను ఉపయోగించుకున్నారంటే ఈ సీన్‌ తెరపై ఎలా వచ్చిందో ఊహించుకోవచ్చు.
స్పేయిన్‌ నుండి ఇటలీ చేరతారు ఫాగ్‌ పాస్పార్తోత్‌లు. ఈ లోపు లండన్‌లో ఆ బ్యాంకు దొంగతనం చేసింది ఫాగ్‌ అన్న పుకారు మొదలవుతుంది. దొంగతనం చేసి తప్పించుకోవడానికి ప్రపంచ యాత్ర పేరుతో అతను బయలుదేరాడని అందరూ అనుకుంటారు. దాంతో పోలీసులు ఫాగ్‌ కోసం ఫిక్స్‌ అనే డిటేక్టివ్‌ను పంపిస్తారు. వారెంట్‌ వచ్చేదాకా ఫాగ్‌ని కనిపెట్టి ఉండమని, అది రాగానే అరెస్టు చేయమని ఆర్డర్‌ రిలీజ్‌ చేస్తుంది ప్రభుత్వం.
ఇటలీ నుంది భారతదేశం చేరతారు ఆ ఇద్దరు యాత్రికులు. భారతదేశంలోని జనం, గోవులను పూజించే వారి నమ్మకాలు, పాములను ఆడించే వాళ్లు, దారిలో కనిపించే ఏనుగులు ఇవన్నీ వాళ్లను ఆశ్చర్యపరుస్తాయి.
వీళ్ళ వెనుకే వచ్చిన ఫిక్స్‌ ఇండియాలోని పోలీసు ఆఫీసర్ల వద్ద అరెస్ట్‌ వారెంట్‌ సంపాదించాలని వాళ్లకు లంచం ఇవ్వ చూపుతాడు. కాని అలా వారెంట్‌ ఇచ్చే హక్కు తమకు లేదని, అది లండన్‌ నుండే రావాలని అంటారు ఆఫీసర్లు. దాంతో ఫిక్స్‌, ఫాగ్‌ పాస్పార్తోత్‌తో స్నేహం నటిస్తూ వారితో ప్రయాణం చేయవలసి వస్తుంది. బొంబాయి నుండి కలకత్తా వైపుకు రైలులో ప్రయాణం చేస్తారు. కాని అది కొత్తగా వేస్తున్న రైలు మార్గం అవడంతో అలహాబాద్‌కు కొంత ముందుగా రైలు ఆగిపోతుంది. ఆ తర్వాత ట్రాక్‌ నిర్మాణం జరగలేదు. ఆ అడవి ప్రాంతంలో ముందుకు ఎలా వెళ్లాలన్న సమస్య వస్తుంది. ఆ రాత్రి అడవిలోనే మకాం వేస్తారు. అక్కడే ఓ రాజు మరణ యాత్రను చూస్తారు. రాజు భార్య ఔడాను బలవంతంగా సతి చేస్తున్నారని విని ఫాగ్‌ ఆమెను రక్షించాలనుకుంటాడు. చాకచక్యంగా ఔడాను ఆ చితి నుండి పాస్పార్తోత్‌ తప్పిస్తాడు. ఆమెతో పాటు అంతకు ముందు మాట్లాడుకున్న ఏనుగు ఎక్కి ప్రయాణంలో ముందుకు సాగుతారు. అక్కడి నుండి అందరూ హాంగ్‌ కాంగ్‌ చేరుకుంటారు.
షాంగారు మీదుగా యొకాహామాకు వెళ్లడానికి స్టీమర్‌ టికెట్ల కోసం వెళ్లిన పాస్పార్తోత్‌కు మత్తు మందు తాగిస్తాడు ఫిక్స్‌. లండన్‌ నుండి వారెంట్‌ వచ్చేదాకా వాళ్లను అక్కడే ఆపాలన్నది అతని పన్నాగం. పాస్పార్తోత్‌ అక్కడ స్పహ తప్పి పడిపోతే అతని జేబులో ఉన్న స్టీమర్‌ టిక్కెట్లను చూసి అతన్ని తీసుకొచ్చి ఆ స్టీమర్‌లో పడేస్తారు పోలీసులు. స్టీమర్‌లో రెండు రోజుల తర్వాత కండ్లు తెరిచిన పాస్పార్తోత్‌, తాను ఒక్కడే స్టీమర్‌లో ఉన్నానని, తనను నమ్మిన యజమానిని తాను నిరాశ పరిచానని బాధపడతాడు. కాని పట్టువదలని ఫాగ్‌ ఓ కార్గో షిప్‌ కేప్టన్‌కు అడిగినంత డబ్బు ఇచ్చి అందులో నుంచుని ప్రయాణం చేసి ఔడాతో సహా ఒకహామా చేరతాడు. అక్కడికే చేరిన పాస్పార్తోత్‌ ఆకలితో అలమటిస్తూ, ఓ సర్కస్‌ కంపెనీలో పనికి కుదురుతాడు. పాస్పార్తోత్‌ కోసం వెతుకున్న ఫాగ్‌ అప్పటికే అతని కదలికలను అర్ధం చేసుకుంటాడు. ఆ సర్కస్‌ కంపెనీకి వెళ్లి పట్టుకుంటాడు. తనతో మళ్లీ ప్రయాణానికి బయలుదేరదీస్తాడు. అక్కడి నుండి సాన్‌ఫ్రాన్సికోకు వారి ప్రయణం మొదలవుతుంది. న్యూయార్క్‌ నుంచి వెనుజులా వైపుకు బయలుదేరుతారు.
దారిలో ట్రైన్‌ మార్గంలో పట్టాలను దాటుతున్న అడవి దున్నలు, వీళ్ళ ట్రైన్‌ దాటగానే కూలిపోయే బ్రిడ్జి, ట్రైన్‌లో దోచుకోవడానికి జొరబడిన రెడ్‌ ఇండియన్స్‌, వారితో ప్రయాణికులు చేసే యుద్దం ఇవన్నీ గగ్గుర్పాటు కలిగించే దశ్యాలు. వీటి చిత్రీకరణా ఓ అద్భుతమే. ఈ యుద్ద దశ్యాలను సహజంగా చిత్రీకరించడానికి ఎన్నో గుర్రాలను వాడారు. ఇక్కడ రెడ్‌ ఇండియన్లు పాస్పార్తోత్‌ను బంధించి బలి ఇవ్వబోతారు. ఈ దశ్యాలలో రెడ్‌ ఇండియన్ల కాస్టూమ్‌లు ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. ఫాగ్‌ ఇతర నాగరికులతో వచ్చి పాస్పార్తోత్‌ను రక్షించి తనతో తీసుకువెళతాడు. అక్కడి నుండి సమయానికి రైలు లేకపోతే అదే పట్టాలపై రిపేర్‌ వాగన్‌లో వీరంతా కలిసి ప్రయణిస్తారు. వారి ఈ వింత ప్రయాణం ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. దారిలో ఆ మార్గంలో వందల సంఖ్యలో కనిపించే జంతువులు ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి.
రిఫార్మ్‌ క్లబ్‌లో వారందికీ ఈ ప్రయాణ వివరాలు, ఫాగ్‌ వెళ్ళే దేశాల గురించి తెలుస్తూ ఉంటుంది. పందెం ఓడిపోతున్నాం అన్న భయంతో ఫాగ్‌ అరెస్ట్‌ వారెంట్‌ కోసం వాళ్లు కూడా చేయి కలుపుతారు. ఫాగ్‌ వెనిజులా వెళ్ళే ఓ నావలోకి తన పరివారంతో ఎక్కుతాడు. కెప్టేన్‌కు డబ్బు ఆశ చూపి ఇంగ్లండ్‌ వైపుకు నావను మళ్ళించమని చెబుతాడు. ఆయన దానికి ఒప్పుకుంటాడు. కాని మార్గమధ్యంలో నావలో ఇంధనం అయిపోతుంది. దాంతో ఆ నావని తానే అక్కడికక్కడే కొనేస్తాడు ఫాగ్‌. కొన్న నావలోని చెక్కను ఇంధనంగా ఉపయోగిస్తూ, ఆ చెక్క ముక్కలను మంటల్లో వేస్తూ నావతో ముందుకు సాగుతాడు. నావలో చెక్కంతా కాలిపోతుంది. ప్రయాణం ఆగిపోతుందేమో అనుకునేంతలో వారికి భూమి కనిపిస్తుంది. ఆఖరి నిముషంలో ప్రమాదం తప్పి నావ ఇంగ్లండ్‌ చేరుతుంది. ఆ విరిగిన నావను తిరిగి కెప్టేన్‌ కే ఇచ్చేసి ఇంగ్లండ్‌లోకి అడుగు పెడతాడు ఫాగ్‌. నావ పూర్తిగా రూపం మార్చుకుని మిగిలిన అవశేషలతోటి సముద్రంలోకి తిరిగి వెళ్లడం చూడవల్సిన సీన్‌.
లివర్‌ పూల్‌లో దిగిన ఫాగ్‌ను అరెస్టు చేస్తారు పోలీసులు. రాత్రంతా జైల్లో ఉంచుతారు. చివరకు దొంగతనం ఫాగ్‌ చేయలేదని తెలియడంతో అతన్ని వదిలేస్తారు. కానీ ఈ గొడవతో ఫాగ్‌ పందెంలో ఒక రోజును పోగొట్టుకుంటాడు. గడువు ముగిసి సమయానికి లండన్‌ చేరలేకపోతాడు. తాను పందెం ఓడిపోయానని అర్ధం చేసుకుని బాధపడతాడు. తనతో అక్కడి దాకా ప్రయాణించిన ఔడాతో తన జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టాలని నిర్ణయించుకుంటాడు. లండన్‌ చేరాక పాస్పార్తోత్‌తో అది ఆదివారం కాబట్టీ మరుసటి రోజు సోమవారంకు తమ వివాహం కోసం చర్చ్‌లో సమయం తీసుకొమ్మని చెబుతాడు. చర్చ్‌కు ఆనందంతో వెళ్లిన పాస్పార్తోత్‌కు ఆ రోజు ఆదివారం కాదని అది శనివారం అని తెలుస్తుంది. ఇది చెప్పాలని ఫాగ్‌ దగ్గరకు పరిగెత్తుకు వస్తాడు పాస్పార్తోత్‌.
ఫాగ్‌ తాను ప్రయాణంలో ప్రతి నిమిషాన్ని, రోజులను లెక్కించుకుంటూ వచ్చానని, అది శనివారం అయ్యే ప్రసక్తే లేదని చెప్తూనే ఆలోచనలలో పడిపోతాడు. అప్పుడు అతనికి ఓ సత్యం అర్ధమవుతుంది. ఉదయించే సూర్యుని వైపు తాము ఉత్తరం నుండి తూర్పు దిక్కుకు ప్రయాణించామని అలా అంతర్జాతీయ తేదీ రేఖను దాటడం ద్వారా, తాను ఒక రోజును పొందినట్లు ఫాగ్‌ తెలుసుకుంటాడు. అంటే ఆ రోజు శనివారం. తాను పదిహేను నిమిషాల్లో క్లబ్‌ చేరి స్నేహితులకు కనిపిస్తే తాను పందెం గెలిచినట్లే.
ఫాగ్‌ వెంటనే ఇంట్లో వేసుకునే దుస్తులతోనే క్లబ్‌కి పరుగెత్తుతాడు. సరిగ్గా రాత్రి 8:45 గంటలకు స్నేహితుల దగ్గరకు వెళతాడు. అందరూ అతన్ని చూసి ఆశ్చర్యంతో నోళ్ళు తెరుస్తారు. అలాంటి దుస్తులతో ఫాగ్‌ ఎప్పుడూ క్లబ్‌కు వెళ్లలేదు. అతని వెనుక పరుతెత్తుతూ ఔడా కూడా క్లబ్‌లోకి వెళ్తుంది. ఏ స్త్రీ అప్పటిదాకా క్లబ్‌లోకి రాలేదు. అందరికీ ఇవి రెండు పెద్ద వింతలు. అంతా దిగ్భ్రాంతికి గురై చూస్తూ ఉండగానే ఫాగ్‌ పందెం గెలిచాడన్న విషయం వారి మెదళ్లలోకి ఎక్కుతుంది.
ఈ సినిమా మొదలు చివరన కూడా రెండు భిన్నమైన ఆకర్షణలు ఉంటాయి. బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిస్ట్‌ ఎడ్వర్డ్‌ ఆర్‌. ముర్రో జార్జెస్‌ మెలీస్‌ తీసిన ఎ ట్రిప్‌ టు ది మూన్‌ (1902) అనే ఫిలిం ఫుటేజీని ముందు స్క్రీన్‌పై చూపిస్తాడు. ఇది జూల్స్‌ వెర్న్‌ రచించిన ‘ఫ్రమ్‌ ది ఎర్త్‌ టు ద మూన్‌’ అనే పుస్తకంపై ఆధారపడి ఉందని వివరిస్తాడు. మానవ రహిత రాకెట్‌ను ప్రయోగించడం, భూమి వెనక్కి తగ్గడం లాంటి దశ్యాలు ఇందులో ఉన్నాయి. అలా రచయితను, అతని రచనలోని కల్పనా శక్తిని, అందులోని వైజ్ఞానిక వాస్తవాలను విపులంగా వివరిస్తూ అప్పుడు ఈ సినిమాలోకి మనలను తీసుకువెళ్తారు దర్శకులు. చిత్రం చివర్లో ఆరు నిమిషాల నిడివి గల యానిమేషన్‌ టైటిల్‌ సీక్వెన్స్‌ వస్తుంది. ఇది స్క్రీన్‌పై ఫాగ్‌ ప్రపంచ యాత్ర బొమ్మలతో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీన్ని డిజైనర్‌ సాల్‌ బాస్‌ రూపొందించారు. ఇన్ని అద్భుతాలను తెరపై ఆవిష్కరించిన ఈ సినిమాకు ఉత్తమ చిత్రంతో పాటు ఐదు అకాడమీ అవార్డులు లభించాయి.
ఫాగ్‌ పాత్రలో నటించిన జేంస్‌ డేవిడ్‌ గ్రహం నివెన్‌ హాలివుడ్‌లో క్లాసిక్‌ నటుడిగా పేరుపొందారు. ఈ పాత్రకు వీరు జీవం పోసారు. అలాగే నౌఖరు పాత్రలో నటించిన క్లాంతిఫ్లాస్‌ స్పానిష్‌ సినిమాలలో పేరు పొందిన మెక్సికన్‌ హాస్య నటుడు. ఈ సినిమాలో బుల్‌ ఫైట్‌ను కేవలం ఇతని కోసమే రూపొందించారు. స్పెయిన్‌లో ఆయనకున్న ఆకర్షణ అలాంటిది. ఈ బుల్‌ ఫైట్‌ ఒరిజినల్‌ నవలలో లేదు. ఫ్రెంచ్‌ పేరుతో స్పానిష్‌ మాట్లాడే వ్యక్తిగా ఈ సినిమాలో పాస్పార్తోత్‌ పాత్ర వేసిన కాంతిఫ్లాస్‌ ఈ సినిమా తర్వాత స్పెయిన్‌, ఫ్రాన్స్‌లో ఎంతో పేరు సంపాదించుకున్నారు. రాజకుమారి ఔడా పాత్రలో షిర్లీ మాక్లేన్‌ నటించారు. ఇందులో డిటెక్టివ్‌ ఫిక్స్‌గా నటించిన రాబర్ట్‌ న్యూటన్‌ ఈ సినిమా రీలీజ్‌ అయేటప్పటికే మరణించారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన నటులందరిలో ఔడా పాత్రధారి షిర్లో మాక్లేన్‌ ఒక్కరే జీవించి ఉన్నారు. ఈ సినిమా కోసం నలభైమందికిపైగా పేరుపొందిన నటులు కామియోలుగా ఒక్క క్షణం కనిపిస్తారు. వారిని గుర్తుపట్టడానికి సినీ ప్రేమికులు ఎగబడి ఈ సినిమాకు వెళ్ళేవారట. ఈ సినిమాకి మొత్తం హాలివుడ్‌ హీరోలను ఎక్స్ట్రాలుగా దర్శకులు పెట్టుకున్నారని అప్పట్లో విశ్లేషకులు చమత్కరించారట.
ఈ చిత్రానికి మైఖేల్‌ ఆండర్సన్‌ దర్శకత్వం వహిస్తే మైక్‌ టాడ్‌ నిర్మించారు. కెవిన్‌ మెక్‌క్లోరీ, విలియం కామెరాన్‌ మెన్జీస్‌ అసోసియేట్‌ నిర్మాతలుగా ఉన్నారు. టాడ్‌-Aఉ 70వీవీ సినిమాటోగ్రఫీ (టెక్నికలర్‌తో ప్రాసెస్‌ చేయబడింది)ని ఉపయోగించారు. టాడ్‌-Aఉ సెకనుకు 30 ఫ్రేమ్‌ల వేగంతో నడుస్తుంది. ఇది 35వీవీ స్టాండర్డ్‌ 24 టజూర కి విరుద్ధంగా ఉంటుంది. అందుకని ‘ఎరౌండ్‌ ది వరల్డ్‌ ఇన్‌ 80 డేస్‌’ను రెండుసార్లు చిత్రీకరించారు. దీనికి నిర్మాత టాడ్‌ అప్పుల పాలై మరీ డబ్బు సమకూర్చారు. ఇది ఘనవిజయం సాధించి ఆతన్ని ఆర్ధికంగా ఉన్నత స్థితికి చేరుస్తూ హాలివిడ్‌లో టాడ్‌ పేరును అత్యంత గౌరవప్రదమైన నిర్మాతల వరుసలో నిలబెట్టింది.
విభిన్న దేశాల భౌగోళిక వాతావరణాన్ని, అక్కడి ప్రజల సాంస్కతిక జీవనాన్ని కండ్లకు కట్టినట్లు అత్యంత వాస్తవికంగా చూపిస్తూ వైజ్ఞానికంగానూ చిత్రీకరించిన ఈ చిత్రం ‘ది ఫర్పెక్ట్‌ పిక్చర్‌’గా నిలుస్తుంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్‌ డేట్‌ లైన్‌ గురించి తెలియని వారికి ఈ చిత్రం ఎంతో సమాచారాన్ని ఇస్తుంది. అలాగే ప్రపంచ యాత్రకు ఈ కథలో ఫాగ్‌ ఉపయోగించిన దారిని కొందరు ఔత్సాహికులు అదే దారిలో ప్రయాణించి దీని ప్రామాణికతను ఒప్పుకున్నారు. ఇది కల్పిత కథే అయినా 1872లోనే భూగోళాన్ని చుట్టాలంటే వెళ్లవలసిన దారిని రచయిత ఎంతో దూర దష్టితో అత్యంత ప్రామాణికంగా కనుగొన్నారు. ఈ పుస్తకం, సినిమాలు సాహిత్యరంగం, సినీ రంగంలోనూ అత్యంత గొప్పవిగా పాఠకులు, ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు చేసుకుంటారు.
పి.జ్యోతి
98853 84740

Spread the love