సాయంత్రం 7 గంటల సమయము. ఖైదీలను గదుల్లో పెట్టి తాళము వేసి వరండాలో పది జవానులు మాటా, మంతీ సాగించారు. తాము ఉద్యోగము చేసిన వివిధ జేళ్ళలో చేసిన దౌర్జన్యాలను ఘనకార్యాలుగా, ఖైదీలు చేసే సాహస చర్యలు, వాని నణచుటకై అవలంబించే వివిధ పద్ధతులను తమ అమూల్య అనుభవాలుగా చెప్పుకుంటున్నారు జవానులు.
‘ఖైదీల గది నుండి ఒక ఖైదీ ఏడ్పు వినబడింది. ఎంతసేపటి నుండో వుప్పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటున్నప్పటికీ, హద్దుదాటి విధి లేక పెద్దగా ఏడ్వాల్సి వచ్చింది. అయినప్పటికి ”ఇది జేలు, ఏడ్వటానికి కూడా స్వాతంత్య్రము లేదు. ఎదురుగా వరండాలో నున్న జవానులు ఏమంటారో” అనే భయము కూడా ఆ ఏడ్పులో ధ్వనిస్తున్నది.
ఆ గదిలో తమతమ స్థలాల్లో కూర్చొని, తమ బయటి ప్రపంచాన్ని తలచుకుంటున్న యితర ఖైదీలు, ఏడుస్తున్న ఖైదీ – మల్లయ్యవైపు సానుభూతితో, ఆశ్చర్యముతో దృష్టి మరల్చారు.
జవానులు ”ఏమిటోరు! అల్లరి” అని తమ కర్తవ్యాన్ని లాంఛనంగా అమల్లో పెట్టి, ఆ ఖైదీ దుఃఖాన్ని సామాన్య విషయంగా, అట్టివెన్నో తమ అనుభవానికి వచ్చినట్లు నిర్లక్ష్యంగా, తిరిగి మాటా, మంతీ సాగించారు. ”ఈ ఖైదీలు కూర్చొని మాట్లాడటానికి కూడా అవకాశమివ్వరు” అని ఒక జవాను విసిగాడు.
ఖైదీలు వారేకుటుంబానికి, మతానికి, కులానికి, గ్రామానికి సంబంధించిన వారైనా వారంతా ఖైదీలు, నేటి ఒకే విష సమాజ వృక్షానికి కాసిన కుక్కమూతి పిందెలు.
మల్లయ్య ఖైదీ వద్ద ఇతర ఖైదీలు మూగారు, మల్లయ్య ఏడ్పు కొద్దిగా తగ్గింది. కాని చుట్టు ఖైదీలంతా ఆప్తులుగా చేరేవరకు తిరిగి దుఃఖము పొంగివచ్చింది. ఎక్కి ఎక్కి ఏడ్వసాగాడు.
”ఏమి జ్ఞాపకమొచ్చిందో” ఒక ఖైదీ సానుభూతిగా అన్నాడు.
”జేలుకు వచ్చి ఏడిస్తే ఏమి లాభం? మొదటనే హుషారుగా ఉండాలె?” ఒకడు ధర్మపన్నాలు పలికాడు.
”మూడు నెలలకే ఇంత బుగులుపడతారోరు! నా సగం వయసు జైల్లో గడిచింది. ఇంకా జైల్లోనే ఉన్నాను నేను. ఇంకా ఎన్నిసార్లు రావలసి ఉందో” ఒక జేలుపిట్ట పలికింది.
”ఎందు కేడుస్తున్నావు మల్లన్నా” చాలా దీనంగా ఒక ఖైదీ పరామర్శ చేశాడు.
తన తండ్రి మంచములో పడి మూల్గుతుండగా ఎక్కి ఎక్కి ఏడుస్తున్న తనను తన తండ్రి పరామర్శ చేసిన దృశ్యం మల్లయ్య కండ్లల్లో ఆడింది.
****
మల్లయ్య ఖానాపురం వంతుమాదిగ. తల్లి చిన్నప్పుడే ప్రసూతి రోగంతో మరణించింది. పొట్టకు చాలని, కష్టంతో జీవితమెల్ల కండలు కరిగించి చావుకు కాళ్ళు చాపి మంచములోపడి ఉన్న ముసలితండ్రి, చస్తూ వదలిపోయిన ఆడపసికూన, ప్రేమతో పెంచి పెద్దచేసిన చెల్లెలు – యివే అతని కుటుంబము.
తండ్రి ముసలివాడైనందున గ్రామ బేగారిపని మల్లయ్య మెడబడ్డది. తండ్రి మంచముపట్టాడు. పది, పన్నెండేండ్ల చెల్లెలు పెండ్లిభారం, మంచంపట్టిన తండ్రి చికిత్స – ముఖ్యంగా కుటుంబ పోషణభారం మల్లయ్యపై బడ్డది. బేగారి చేసిన తర్వాత దొరికే కొద్ది సమయములో ఇతర కూలిపని చేసుకోవడం కూడా ఒక్కొక్కప్పుడు సాధ్యంకాక పోయేది. మల్లయ్య ఒక్కొక్కప్పుడు ప్రభుత్వాధికారుల బరువులకు పోవడం చెల్లెలు గ్రామ బేగారిపని చేస్తూ, తండ్రిని చూసుకోవడం జరుగుతుండేది. ఒక్కొక్కసారి బేగారి చేసిన తర్వాత వేరే కూలిలేక దినమంతా పొట్ట మాడ్చుకునే ఉండాల్సివచ్చేది. తంటాలుపడి తండ్రికిమాత్రం పేరుకు నోరు తడిపేవారు.
మల్లయ్య ఒకనాడు బరువుకుపోయి సాయంత్రము యింటికి చేరుకున్నాడు. తండ్రి ఆరోగ్యము మరీ చెడిపోయింది. ప్రమాదస్థితిలో నున్నాడు. చెల్లెలు ఏడుస్తూ కూర్చున్నది. ఒకవైపు కడుపు మాడ్తున్నది. రెండోవైపు తండ్రి దూరమయేస్థితి వచ్చింది. వస్తున్న దుఃఖాన్ని మల్లయ్య ఆపుకొని చెల్లెలును సముదాయించి, ఆ రాత్రికై ఏవిధంగానైనా ఇంత ఆదరువు సంపాదించడానికి ఇల్లువదలి బయలుదేరాడు.
ఆలోచిస్తు మల్లయ్య గ్రామం వెలుపలికి పోయాడు. పొలాల్లో కుప్పలు పేరుస్తున్నారు. మెల్లగా ఒక కళ్ళం వద్దకి చేరాడు.
ఆ రోజంతా పొలాలలో పనిజేసిన కూలీలు తమ కూలి తక్కువ దొరికి నందుకు భూస్వామితో బేరాలు చేస్తున్నారు. భూస్వామి లోభత్వానికి విసిగి, బిచ్చము గింజలకై ప్రాధేయపడ్తున్నారు. భూస్వామి ఎంగిలి మెతుకులు దులిపినట్లు ఇన్ని గింజలు కూలివాండ్ల ఒళ్ళో చల్లాడు. ఈ దృశ్యమంతా జూస్తున్న మల్లయ్య నిరాశచెందాడు. కష్టపడినవాండ్లకే కూలి సరిగా యివ్వక బిచ్చము గింజలు కూడా ఏడుస్తు పెడ్తున్నప్పుడు తనకొక గింజ కూడా ఆశలేదని నిరాశతో కొయ్యకాలు పొలాలవైపు వెళ్ళాడు.
పనులు ముగించుకొని భూస్వాములు, జీతగాండ్లు, కూలీలు గ్రామం ముఖం పట్టారు.
ముసి, ముసి చీకట్లో ఒక్కొక్క పరిగెకర్రను పోగుచేసుకొని కట్టగాకట్టి ఆనాటి రాత్రికి ఆదరువు దొరికినందుకు తన ప్రయోజకత్వానికి గర్విస్తు, వీరునిగా ఉత్సా హంతో ఇంటిదోవ పట్టాడు. తండ్రిని తలచుకొని, ఏర్పడిన ఆపద జ్ఞాపకము రాగానే ఉత్సాహానికి, గర్వానికి చెంపపెట్టయి కుంగిపోయాడు.
మార్గమధ్యమున అక్కడక్కడ చిన్న, చిన్న గుట్టలుగా పేర్చి ఉన్న వరికుప్పలకు, తన చంకలోని పరిగెకట్టకు పోల్చుకున్నాడు. ఈర్ష్యపడ్డాడు.
”అవి ఎంత పెద్దగా నున్నప్పటికి ఈ కట్టకిందికిరావు. పనికిరాని కుప్పలు కుక్కగొడుగులు” అనుకుంటు ముందుకు సాగాడు.
”ఎవరోరు, అటుపోయేదీ” ఒక కుప్పవద్ద నుండి ధ్వని వచ్చింది.
మల్లయ్య నిలబడ్డాడు. నలువైపుల పరికించాడు.
ఒక ఆజానుబాహుడు మెడమీద అడ్డంగా చేతికర్రను ఆనించుకొని కర్ర రెండు చివరలు పట్టుకొని మల్లయ్యవైపు వస్తున్నాడు.
”ఎవడ్రానీవు? ఎక్కడనుంచి తెస్తున్నావు ఆ కట్టను?”
”పొలాల్లో పరిగెను కట్టకట్టాను” మల్లయ్య తన నిర్దోషిత్వాన్ని గట్టిగా ఎరుకపరచాడు.
”ఓహౌ! నీవు వస్తావని పరిగె కట్టి పెట్టామోరు. ఈ కుప్పలన్ని పరిగెకట్టలతో పేర్చినవే. ఏమి వగలమారి మొగాడివిరా?”
”పరిగె ఏరుకోవడం తప్పేనా?” తనకు కలిగిన అన్యాయముపై, ఆ వ్యక్తి యొక్క అంతులేని స్వార్థముపై ఆశ్చర్యమును కనబరచు ధ్వనితో మల్లయ్య అన్నాడు.
”ఇంకా నీల్గుతున్నావు? పెట్టు అక్కడ ఆ కట్టను” కర్రలేపాడు.
మల్లయ్య ఇక లాభంలేదని గ్రహించి, దీనంగా తన దీనస్థితిని తండ్రి గతిని తెలిపాడు. బ్రతిమిలాడాడు.
మల్లయ్య బ్రతిమిలాడటంతో, తప్పకుండా ఆ కట్ట దొంగిలింపబడినదనే గట్టి నమ్మకం ఆ వ్యక్తికి కలిగి ”ఎవడికి పుట్టావురా?” అని ఇంకా రౌద్రముతో కర్రలేపి కొట్టబోయాడు.
ఇక నిలబడితే లాభములేదని పరిగెకట్టను చంకలో గట్టిగా పట్టుకొని కాలికి బుద్ధిచెప్పాడు. ముందు మల్లయ్య, వెనుక ఆ వ్యక్తి గ్రామం ముఖం పట్టారు.
మల్లయ్య తండ్రిని చేరుకోవాలె. పరిగెకట్టను ఎలాగైనా రక్షించుకోవాలె. చెల్లెలుకు, తండ్రికి రాత్రికి ఇన్ని మెతుకులు పెట్టాలె అనే నిశ్చితాభిప్రాయమునకు తన బలాన్ని చేయూతనిచ్చి, సర్వశక్తుల నుపయోగించి వడిగా పరుగెత్తుతున్నాడు.
గ్రామములో మార్గమధ్యమున నున్న చావిడివద్దకి వచ్చేవరకు చెల్లెలు కండ్ల నీళ్ళు తుడుచుకుంటు ఒకగోడ ప్రక్కన నిలబడివుంది. పోలీసుపటేలు బండ బూతులు తిడ్తున్నాడు.
****
సాయంత్రం మల్లయ్య పొలాలవైపు వెళ్ళినతర్వాత మల్లయ్యకొరకు పోలీసు పటేలు కబురంపాడు. ప్రక్క గ్రామం అత్యవసర పనిమీద వంతు పోవలసి ఉంది. ఇంట్లో మల్లయ్య లేనందున తండ్రి ప్రమాదస్థితిపై ఏడుస్తు కూర్చున్న చెల్లెలును సేతుసింధీ తీసికెళ్ళాడు. చెల్లెలును వంతుకు పొమ్మని ఒత్తిడి చేస్తున్నారు. చెల్లెలు ఏడుస్తు తన తండ్రి అవస్థ పోలీసుపటేలుకు తెలుపుతు ఉంది.
ఇంతలో అన్న మల్లయ్య పరుగెత్తుతు రావడం తనకు పోలీసుపటేలు ఎర నుండి రక్షించడానికని భావించింది.
కాని ఇద్దరూ వలలో చిక్కారు. మల్లయ్యను చూడగానే బావురుమని ఏడుస్తు మల్లయ్య పంచ చేరింది.
ఇంతలో వెనుకనుండి పరుగెత్తి వస్తున్న వ్యక్తి అమాంతంగా మల్లయ్య వీపుపై బలంగా చేతికర్రతో దెబ్బవేశాడు.
”చస్తిన”ని మల్లయ్య, అతని చెల్లెలు కిందపడిపోయారు. ఒకరిపై ఒకరు పడి ఏడుస్తున్నారు.
మల్లయ్యను వెంబడించిన ఆ వ్యక్తి పోలీసుపటేలు ముందు ఆ పరిగెకట్టను పెట్టి అది తన వరికుప్ప నుండి మల్లయ్య దొంగిలించాడని ఫిర్యాదు చేశాడు.
పడి ఏడుస్తున్న మల్లయ్యను చెల్లెలు నుండి వేరుచేసి, చావిడి స్థంభానికి కట్టారు సేతుసింధీలు.
చెల్లెలును బలవంతంగా వంతుకు పొమ్మని తిరిగి పోలీసుపటేలు బలవంత పెట్టసాగాడు.
”దీని తండ్రికి ఎట్లా ఉందోరు” క్రూర పాలకయంత్రములో భాగమై మానవత్వాన్ని చంపుకొని ఛండపాలన చేస్తున్న ఆ పోలీసుపటేలు నోటినుండి మానవత్వాన్ని జ్ఞప్తికితెచ్చు ఒక వాక్యము వెళ్ళింది.
”ముసలితొక్కు ఆరునెలలైంది మంచాన్నిబట్టి చావక, బ్రతక్క ఉన్నాడు. బ్రతికే ఆశలేదు. కాని ఈరోజే చస్తాడని అనుకోవడానికి వీండ్లేం బ్రహ్మకొడుకులా? ఒళ్లొంగక ఏదో వగలు” సేతుసింధీ పోలీసుపటేలుకు జవాబు చెప్పాడు.
ఇంట్లో తండ్రి – ఇవన్ని తన జీవిత అనుభవాలే అన్నట్టు నిర్లక్ష్యంగా పడి ఉన్నాడు, పరధ్యాన్నంలో, స్మృతితప్పి,
తుదకు చెల్లెలును బలవంతముజేసి ప్రక్కగ్రామానికి వంతు పంపారు. ఝామురాత్రి వేళ బిక్కురు, బిక్కురు మనుకుంటు దిక్కులు చూస్తు చెల్లెలు వంతుకు బయలుదేరింది.
తండ్రికి అండగా వున్న చెల్లెలు దూరమైంది. మల్లయ్య నిర్బంధములో ఉన్నాడు. తండ్రిని కండ్లజూస్తానో లేదో అని బాధపడ్తున్నాడు మల్లయ్య.
తెల్లవారి మల్లయ్యను పోలీసుస్టేషన్కు పంపాడు పోలీసుపటేలు. దొంగ నేరము క్రింద మల్లయ్యకు మూడునెల్ల శికైంది.
తండ్రి, చెల్లెలు సంగతి ఏమైందో తెలియదు.
****
ఒకనాడు జేలు పనిమీద మల్లయ్య బజారుకు పొయ్యాడు. అంగడిలో ఒక పరిచయస్తుడు కనబడ్డాడు. జవానును బ్రతిమిలాడి అతన్ని కలిసికొని మాట్లాడితే, తండ్రి మరణించాడనీ, చెల్లెలు ఊరు విడిచి ఎక్కడికో వెళ్ళిపోయిందని, ఇల్లు పాడుపడిందని తెలిసింది.
ఉబికి వస్తున్న పట్టరాని దుఃఖాన్ని బహుకష్టంగా ఆపుకున్నాడు. పెద్దగా ఏడిస్తే పదిమంది కూడ్తారు. దయతలచి మాట్లాడ అవకాశమిచ్చిన జవానుకు మాట వస్తుంది.
లోపల, లోపల కుమిలిపోతున్నాడు. అన్నం తిని గదిలోకి చేరిన తర్వాత ఇక ఏడ్వవచ్చనుకున్నాడు. సర్వస్వతంత్రుడనని భ్రమపడి పెద్దగా ఏడ్చాడు.
”మా చెల్లెలు ఏమైందో” తపిస్తున్నాడు హృదయంలో.
– వట్టికోట ఆళ్వారుస్వామి