గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలి

– కలెక్టర్‌ ప్రియాంక అలా
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువై ఉన్న ప్రదేశానికి రాష్ట్రం నుంచి కాక ఇతర దేశాల నుంచి గణేష్‌ నిమజ్జనం చేయడానికి భక్తులు వస్తుంటారని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవలసిన బాధ్యత మన పైన ఉందని కలెక్టర్‌ ప్రియాంక అలా అన్నారు. మంగళవారం గణేష్‌ నిమజ్జనం చేసే ప్రదేశాలను ఆమె ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్‌ జైన్‌తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగ అయిన మూడో రోజు నుంచి వినాయక ప్రతిమలు గోదావరిలో నిమజ్జనం చేయడానికి భక్తులు వస్తారని వారి కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. చివరి రోజు చాలామంది భక్తులు వస్తున్నందున నిమజ్జనం చేసే చోట భారీకేట్లు నిర్మించాలని అలాగే క్రేన్లు, గజ ఈత గాళ్లను సిద్ధం చేసుకోవాలని, గోదావరి బ్రిడ్జిపై నుంచి వచ్చే వాహనాలు అలాగే చర్ల, కూనవరం నుంచి వచ్చే వాహనాల కోసం ట్రాఫిక్‌ పోలీసు నియంత్రణ పాటించి ఎవరూ ఇబ్బందులు పడకుండా క్రమ పద్ధతిలో వాహనాలను పంపించాలన్నారు. భక్తులు ఎవరూ గోదావరిలో దిగకుండా చూసుకోవాలని అన్నారు. ముఖ్యంగా ప్రతిచోట లైటింగ్‌ శానిటేషన్‌ పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం ప్రకారము భక్తులందరికీ తెలియజేసే విధంగా సూచనలు ఇస్తూ ఉండాలని ఐటీసీ సింగరేణి వారు ఏర్పాటు చేసిన క్రేన్లను సిద్ధంగా ఉంచుకొని వచ్చిన వినాయక ప్రతిమలను భక్తులు రాకుండా వారే స్వయంగా గోదావరి నిమర్జనం చేసే విధంగా చూసుకోవాలన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి శానిటేషన్‌ సిబ్బంది చెత్త ఏర్పడకుండా శుభ్రం చేస్తూ ఉండాలని అక్కడక్కడ డస్ట్‌ బీన్స్‌ ఏర్పాటు చేయాలని అన్నారు. భక్తులకు స్వచ్ఛమైన మంచినీరు అందించాలని అవసరమైతే స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన శిబిరాలలో వారికి మంచినీళ్లతో పాటు అల్పాహారం అందే విధంగా సంబంధిత ఆర్డీవో చూసుకోవాలన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం జరిగిన సంబంధిత అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె అన్నారు. పోలీస్‌ శాఖ సిబ్బంది, ట్రాఫిక్‌ పోలీసు, ఫైర్‌ శాఖ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి భద్రాచలం గోదావరిలో వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయడానికి వచ్చే భక్తులకు సహాయ సహకారాలు అందించి వారు నిమజ్జనం చేసిన తర్వాత శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకొని వారి గమ్య సురక్షితంగా వెళ్లే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం స్పెషల్‌ ఆఫీసర్‌ నాగలక్ష్మి, ఆర్డిఓ మంగీలాల్‌, పరితోజ్‌ పంకజ్‌, వివిధ శాఖలకు చెందిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love