– వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసుల అడ్డగింత
– గాంధీ విగ్రహాలకు వినతులు
– కొనసాగుతున్న అంగన్‌వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె
నవతెలంగాణ- విలేకరులు
తమ సమస్యలపై మంత్రి కేటీఆర్‌కు మొర పెట్టుకునేందుకు వెళ్తున్న అంగన్‌వాడీ, ఆశా కార్య కర్తలు, మధ్యాహ్నభోజన కార్మికులను, సీఐటీయూ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సమ్మెలో భాగంగా సోమవారం కార్మికులు గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చారు. నల్లగొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో వినతిపత్రం ఇచ్చేందుకు కార్మికులు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. కార్మికులతోపాటు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.సీలీంను అరెస్టు చేశారు. మిర్యాగూడలో, మర్రిగూడ, మునుగోడు, దామరచర్ల మండల కేంద్రాల్లో అంగన్‌వాడీలు, ఆశాలు గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. దేవరకొండ లో సమ్మె కొనసాగింది. యాదాద్రిభువనగిరి జిల్లా రాజాపేటలో అంగన్‌వాడీలు గాంధీవిగ్రహానికి వినతి పత్రం అందజేశారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మధ్యాహ్నభోజన కార్మికుల సమ్మెను సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నారబోయిన శ్రీనివాస్ ప్రారంభించారు.
ఖమ్మం జిల్లా చింతకాని, వైరా మండలాల్లో ఆశాలు, అంగన్‌వాడీలు గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. బోనకల్‌లో ఆశాలు ర్యాలీగా గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి, భద్రాచలంలో సమ్మె శిబిరం నుంచి ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్‌వాడీ కార్యకర్తలు గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి వినతిపత్రం అందజేశారు.
కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లో ఆశా కార్యకర్తలు గాంధీ జయంతి సందర్భంగా నివాళ్లర్పించి, ఆయన విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఆశాల యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లో ర్యాలీ తీసి.. గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.