– నల్ల బెల్లాన్ని తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు సప్లయర్స్
– 4500 కిలోల నల్ల బెల్లం, 250 కేజీల పటిక పట్టివేత
– మొత్తం రూ. 15 లక్షల విలువైన వాహనం, సామాగ్రి స్వాధీనం
నవతెలంగాణ – ఉప్పునుంతల
ప్రభుత్వ అదేశాలతో ఎక్సైజ్‌శాఖ నాటుసారాను ఆగస్టు 31 నాటికి నిర్మూలించాలనే లక్ష్యంతో విస్తృతంగా దాడులు చేస్తుంది.నాటుసారా తయారీని ప్రోత్సహించి లబ్ది లబ్ధిపొందాలని, పల్లెలకు నాటుసారా తయారీకి వినియోగించే నల్ల బెల్లం సరఫరాచేసే ఇద్దరూ వ్యక్తులను ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి ఇద్దరు వ్యక్తులు చాలా కాలంగా నాగర్ కర్నూల్ జిల్లాలోని తెలకపల్లి, అచ్చంపేట ప్రాంతాలకు నాటుసారాకు వినియోగించే బెల్లం, పట్టికను పోలీసులకు దొరకకుండా సరఫరా చేస్తూ ఉన్నారు. మహబూబ్ నగర్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ పోలీసులు పక్కాగా అందుకున్న సమాచారం మేరకు సోమవారం ఉప్పునుంతల మండల పరిధిలోని దేవదారుకుంట దగ్గర రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి వచ్చిన వాహనాన్ని నిలిపి తనిఖీలు నిర్వహించగా అందులో ఉన్న 150 బ్యాగుల బెల్లం, ఒక బ్యాగులో 30 కేజీలు మొత్తం 4500 కేజీల బెల్లాన్ని, 250 కేజీల పట్టికను, 5 లీటర్ల నాటుసారాను పట్టుకున్నారు. ఇట్టి బెల్లాన్ని సరఫరా చేస్తున్న అచ్చంపేట మున్సిపాలిటీ కి చెందిన ఏం.సతీష్ ను, అచ్చంపేట మండలం లోని లింగోటము తండా కు చెందిన కాట్రవత్ ప్రేమ్ చందును అరెస్ట్ చేశారు. నిందితులను పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు వాహనం, బెల్లం, అలం విలువ రూ. 15 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. బెల్లాన్ని పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ మెంట్ ఏఈఎస్ శ్రీనివాస్, సీఐలు బాలకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, శారద, ఎస్సై సృజన్ రావు తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. బెల్లం సరఫరాదారులను పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ మెంట్ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అసిస్టేంట్ కమిషనర్ విజయ భాస్కర్‌రెడ్డి అభినందించారు.