– వెనక్కి తగ్గం..పోరాటాలు తధ్యం..విజయమే లక్ష్యం : తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ ఆవిర్భావం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లను శాశ్వత ఉద్యోగులుగా (కన్వర్షన్) గుర్తించాలని పలువురు నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ డిమాండ్ సాధన కోసం వెనక్కి తగ్గేది లేదనీ, పోరాటాలు తధ్యమని స్పష్టం చేశారు. ఆదివారంనాడిక్కడి బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ సమావేశం జరిగింది. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 23,667 మంది కార్మికులను ఏకతాటిపైకి తెస్తూ యూనియన్లు అన్నీ కలిసి జేఏసీగా ఏర్పడ్డాయని చైర్మెన్ కే ఈశ్వరరావు (టీజీయూఈఈయూ-సీఐటీయూ) తెలిపారు. ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్ ఎమ్‌ఏ వజీర్ (టీఎస్‌పీఈయూ-1535), కో చైర్మెన్లు బీ భాస్కర్ (ఏఐటీయూసీ-హెచ్64), వీ నరేందర్, సీహెచ్ ఎల్లయ్య (బీవీఏయూ-541), కో కన్వీనర్లు గంబో నాగరాజు (టీవీడబ్ల్యూయూ-2871), జీ అర్వింద్‌కుమార్ (టీవీడీఈఏ-హెచ్579), వీ తిరుపతి (టీఆర్‌ఎస్‌కేఎస్-హెచ్58) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్ల కన్వర్షన్ సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. కార్మికులను గ్రేడ్స్ రూపంలో విడదీసి వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని విమర్శించారు. శాశ్వత ఉద్యోగులు చేసే పనుల్నే ఆర్టిజన్ కార్మికులు కూడా చేస్తున్నారనీ, అలాంటప్పుడు ఒకే సంస్థలో రెండు రకాల విధివిధానాలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ కార్మికులందర్నీ రెగ్యులర్ చేస్తామని గత ప్రభుత్వం చెప్పిందనీ, అనేక పోరాటాల తర్వాత ఆర్టిజన్ పేరుతో ప్రత్యేకమైన స్టాండింగ్ ఆర్డర్స్ తెచ్చి మోసం చేశారని అన్నారు.
ఏపీఎస్‌ఈబీకి రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రత్యేకమైన రూల్స్ రూపొందించి, ఆర్టిజన్ అనే పేరు తగిలించి, శ్రమదోపిడీ చేయడం అన్యాయమని చెప్పారు. ఇకపై ప్రభుత్వాల జిమ్మిక్కులకు మోసపోయేది లేదనీ, ఆర్టిజన్లంతా ఏకమై, ఐక్య పోరాటాలతో కన్వర్షన్ పొందుతామని ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్థలు ఆర్టిజన్ వ్యవస్థను కొనసాగిస్తూనే, జేఎల్‌ఎమ్, జూనియర్ అసిస్టెంట్స్, సబ్ ఇంజినీర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల్ని రిక్రూట్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నదనీ, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఖాళీ పోస్టుల్ని ఆర్టిజన్స్‌తో భర్తీ చేయాలనీ, దీనివల్ల విద్యుత్ సంస్థలపై అదనంగా ఎలాంటి ఆర్థికభారం పడబోదని స్పష్టం చేశారు. ఈ డిమాండ్ సాధన కోసం జేఏసీగా త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ జాయింట్ సెక్రటరీలు ఎస్ చంద్రారెడ్డి, కే లింగం, కే కృష్ణ, పీ మురళి, కే రఘునాథ్‌రెడ్డి, జీ స్వామి, వీ ప్రభుదాస్, మీడియా ఇంచార్జి జే ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి పెద్ద సంఖ్యలో ఆర్టిజన్లు హాజరయ్యారు.