
నిన్నటి రోజు పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ పార్టీపై చేసిన అనుచిత వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామని పీసీసీ ఉపాధ్యక్షులు తాహెర్ బీన్ హమ్దాన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి ఉపాధ్యక్షులు తాహేర్ బిన్హమ్దాన్ ,పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగర కాంగ్రెస్ కమిటీ కేశ వేణు విలేకరల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ సంపదను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలను బీజేపీ మూసివేసిందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా ఉన్న ఉద్యోగులను కూడా ఉద్యోగాల నుండి తీసివేస్తూ నిరుద్యోగులుగా మార్చే ప్రక్రియ బీజేపీ చేసిందని ఆయన అన్నారు. 2018లో పార్లమెంటు ఎన్నికలకు ముందు బోధన్ నుండి మెట్పల్లి వరకు బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని, చెరుకు రైతులకు మాట ఇస్తూ పాదయాత్ర చేసిన అరవింద్ ఈ నాలుగున్నర సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వంతో గాని రాష్ట్ర ప్రభుత్వం గానీ ఏ రోజు కూడా ఎందుకు బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దాలను విషయం మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా పసుపు రైతులకు ఎన్నికల్లో బాండ్ పేపర్ రాసి ఇచ్చిన విధంగా పసుపు బోర్డు ఎందుకు తీసుకురాలేదని, పసుపు బోర్డు విషయం కేవలం పేపర్ ప్రకటనలకు మాత్రమే పరిమితమైందని, ఆచరణలో ఇప్పటివరకు మొదలు కాలేదని కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.పసుపు ధర 14 వేల రూపాయలు కేవలం మా వల్లనే పలుకుతుందని అరవింద్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్వింటాల్ పసుపు 17 వేల రూపాయలకు వెళ్లడం జరిగిందని, ఇది బిజెపి నాయకులు ఎంపీ అరవింద్ గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు .అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిజామాబాద్ జిల్లాలో 60 వేల ఎకరాల పసుపు సాగు భూమి ఉంటే ప్రస్తుతం పసుపు సాగు చేసే భూమి 22 వేల ఎకరాలకు పడిపోవడం బీజేపీ పాలనకు నిదర్శనం అని ఆయన అన్నారు. మైక్ దొరికింది కదా అని కేవలం కాంగ్రెస్ పార్టీని తిట్టడం ఇష్టం వచ్చింది మాట్లాడడం సరికాదని ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలని ఎంపీ అరవింద్ కు అదే విధంగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి హితవు పలికారు. నిన్న మొన్నటి వరకు బిజెపితో సంబంధం లేని రాకేష్ రెడ్డి ఇప్పుడు బోధన్ వెళ్లి సుదర్శన్ రెడ్డి పై మాట్లాడటం తగదని, ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేసిందని సుదర్శన్ రెడ్డి గారు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల మనిషిగా పేరు పొందిన వ్యక్తి అని, కానీ కేవలం స్వార్థాల కొరకు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఒకసారి ఎన్నికైన రాకేష్ రెడ్డి కాంగ్రెస్ పై మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనమని ఆయన అన్నారు .బిజెపి కేవలం మతాలతో యువకుల మధ్య చిచ్చులు పెడుతూ యువతను మతం పేరుతో రెచ్చగొడుతుందని ఆయన అన్నారు .రాహుల్ గాంధీ గారు భారత్ జూడో యాత్ర దేశంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా చేస్తున్నారని, దేశంలో న్యాయం నిలబడాలని అన్ని వర్గాల ప్రజలు అన్ని కులాల ప్రజలు అన్ని మతాల ప్రజలు సమానమేనని, ప్రజలందరూ ఏకం కావాలని రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నారని ఈ సందర్భంగా వివరించారు.ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, భక్తవత్సలం ,జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వేణురాజ్, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు జావేద్ అక్రమ్, పిసిసి మాజీ కార్యదర్శి రాంభూపాల్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సుధాకర్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ ,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, కైసర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.