దొంగలంతా బీజేపీ పార్టీలోనే ఉన్నారు : అర్వింద్‌ కేజ్రీవాల్‌

నవతెలంగాణ – ఢిల్లీ : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టై శుక్రవారం జైలు నుంచి విడుదలైన ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌.. లోక్‌సభ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. తొలి రోజే అధికార బీజేపీపైన, మోడీపైన ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తర్వాత మరే పార్టీ కూడా ఆమ్‌ఆద్మీ పార్టీ అంతగా వేధింపులకు గురికాలేదని అన్నారు. అధికార బీజేపీ, ప్రధాని ఆమ్‌ఆద్మీ పార్టీని హింసించడమే ప్రధానమైన పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. మోడి ఎక్కడ మాట్లాడినా తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని చెబుతూ ఉంటాడని, వాస్తవానికి ఆయన పార్టీలోనే దొంగలు ఉన్నారని కేజ్రీవాల్‌ ఎద్దేవా చేశారు. పది రోజుల క్రితం కూడా కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని బీజేపీలో చేర్చుకున్నారని, అంతేగాక అతనికి డిప్యూటీ సీఎం పదవిని, మంత్రి పదవిని కట్టబెట్టారని విమర్శించారు. నిజంగా ప్రధాని డీ అవినీతిపై పోరాడాలని ఉంటే అది ఎలాగో ఈ కేజ్రీవాల్‌ నుంచి నేర్చుకోవాలని సూచన చేశారు. తాము ఢిల్లీలో అధికారం చేపట్టిన తర్వాత ఒక మంత్రి అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు లభించాయని, దాంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి, జైలుకు పంపించామని అర్వింద్‌ కేజ్రీవాల్‌ చెప్పారు.
పంజాబ్‌లో కూడా ఆప్‌ సర్కారు ఏర్పాటైన తర్వాత ఒక అవినీతి మంత్రిని జైలుకు పంపామని తెలిపారు. అవినీతిపై పోరాటం అంటే అలా ఉండాలని, కానీ మీరు దొంగలందరినీ మీ పార్టీలో చేర్చుకుంటున్నారని, కానీ కేజ్రీవాల్‌ను మాత్రం జైలుకు పంపించారని విమర్శించారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం అవినీతిపై పోరాటం కాదని ఆయన అన్నారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే దేశంలో తమకు అడ్డుగా ఉన్న ఎవరినైనా అరెస్టు చేయవచ్చని మోదీ సర్కారు భావించిందని ఆరోపించారు. అవినీతిపై పోరాటం పేరుతో మోదీ అమలు చేస్తున్న ఈ ఆపరేషన్‌ పేరు ‘వన్‌ నేషన్.. వన్‌ లీడర్’ అని విమర్శించారు.

Spread the love