హైకోర్టులో అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురు

నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయడాన్ని ఆయన సవాల్ చేశారు. అయితే ఈ అరెస్ట్‌ను హైకోర్టు సమర్థించింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు కొట్టివేసింది. సరైన కారణాలు లేకుండా సీబీఐ అరెస్ట్ చేసిందని చెప్పడానికి ఆధారాలు లేవని పేర్కొంది. బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తును కూడా హైకోర్టు కొట్టివేసింది. అయితే బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించింది.  ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై తొలుత ఈడీ కేజ్రీవాల్‌ను మార్చి 21న అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆయనకు ఊరట లభించినప్పటికీ సీబీఐ అరెస్ట్ విషయంలో జైల్లోనే ఉండిపోయారు. ఈడీ కేసులో జులై 12న ఆయనకు బెయిల్ లభించింది.
Spread the love