– కేంద్రంలో అధికారంలో ఉన్న అరవింద్ పసుపు బోర్డు తేలే
– ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి ఏనాడు మంచి చెడులకు రాలే
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్ళే మిగిలాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.అడ్రస్, ఆఫీస్ లేని పసుపు బోర్డు ఎక్కడా? అరవింద్ అని ప్రశ్నించారు.రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బిజేపీ లు హామీల అమలులో విఫలమయ్యాయన్నారు.హమీల అమలు కోసం మీ పక్షాన నిలబడి ప్రశ్నించే బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డిని గెలిపించాలని కోరారు.ఆదివారం వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడ గ్రామంలో నిజామాబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి,ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనేక అలవి కానీ హామీలు ఇచ్చి, ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ 5 నెలల పాలనలోనే ప్రజలకు కష్టాలు కన్నీళ్లు మిగిలాయని అన్నారు. మాది ప్రజాపాలన, మార్పు కోసం అంటూనే కరెంట్ కోతల్లో, త్రాగు, సాగు నీరు అందించడంలో కాలిపోతున్న మోటార్లతో అనేక అంశాలలో కాంగ్రెస్ మార్పులు తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 100 రోజుల గడువు దాటి 140 రోజులు అయినా ఎందుకు హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.ఎంపీ ఎన్నికల సమయంలోనే ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్, ఎన్నికలు అయిపోయాక పట్టించుకోరని అన్నారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలా? రైతన్నలు, ప్రజలు, మహిళలు, యువత ఆలోచించాలని కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. అప్పుడే ఇచ్చిన హామీలు నెరవేర్చలన్న భయం వారికి కలుగుతదని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న పసుపు బోర్డు తేలే
5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని మాటిచ్చిన అరవింద్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి పసుపు బోర్డు తేలేదన్నారు.అలాంటి వ్యక్తికి ఈ ఎన్నికల్లో ఎందుకు ఓట్లు వేయాలో ఆలోచన చేయాలని ప్రశాంత్ రెడ్డి కోరారు. ఇప్పుడేమో పసుపు బోర్డు సాధించానని చెబుతున్న అరవింద్, పసుపు బోర్డు సాధిస్తే ఆఫీస్ మెయిన్ దర్వాజ ఎక్కడ? ఆఫీస్ ఎక్కడ? ఆ ఆఫీస్ లో నీకుర్చీ లేదా నా కుర్చీ చూపిస్తావా అని ప్రశ్నించారు. పసుపు పంట భారీగా సాగు తగ్గడం వల్లనే ధర ఈసారి పెరిగిందని,ఇందులో బీజేపీ ఘనకార్యం ఏమి లేదన్నారు.అరవింద్ ఎంపీగా ఉన్న 5 ఏండ్లలో అభివృద్ధి పనులకు ఏ గ్రామానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అన్నారు.
ఎమ్మెల్సీగా ఉన్న ఈ ప్రాంత ప్రజల మంచి చెడులకు రాలే…..
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థుల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి ఏ నాడు ఇక్కడ ప్రాంత ప్రజల మంచి చెడుకు రాలేదన్నారు.బాజిరెడ్డి గోవర్ధన్ 40ఏండ్లుగా రాజకీయ జీవితంలో 20ఏండ్లు ఎమ్మెల్యేగా ప్రజల మధ్యనే ఉన్నాడన్నారు.ఎప్పుడు ఎవరికి ఎం అవసరం వచ్చిన ముందుంటాడు..ఈ ప్రాంత ఎమ్మెల్యేగా చేసిన అనుభవం కూడా ఉంది అన్నారు.ఈ ఎంపీ ఎన్నికలు మీ కోసం వచ్చాయి..కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేయాలి లేకుంటే ప్రజలు తిరస్కరిస్తారు అనే భయం వారిలో కలగాలన్నారు. మీ ఓటును బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డికి వేసి నాకు తోడు గా ఆయనను ఇవ్వండని కోరారు. కాంగ్రెస్,బిజెపి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరపున ఇద్దరం పోరాడుతామని ఎమ్మెల్యే అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతం కేసీఆర్ వెంట నడిచింది… రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి
రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతం కేసీఆర్ వెంట నడిచింది అన్నారు.కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా వచ్చిన తెలంగాణను అనేక రంగాల్లో దేశంలో అగ్రగామిగా ఉంచాడని, దేశంలో ఎక్కడికి వెళ్లిన తెలంగాణ గురించి గొప్పగా చెబుతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే మళ్ళీ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మంట గలుపుతుందన్నారు. కేసీఆర్ కు తెలంగాణ పై ఉన్న ప్రేమ కాంగ్రెస్, బిజేపీకి లేదన్నారు.తను పార్లమెంట్ లో పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రశ్నిస్తే, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అలాంటి ఆలోచన లేదని సమాధానం ఇచ్చారని తెలిపారు.అందుకే నేను పసుపు బోర్డుపై ప్రైవేట్ బిల్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టానన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవం నిలబడాలంటే ఈ ఎన్నికలో కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులను ఓడించాలన్నారు. బాజిరెడ్డి ని ఎంపీగా గెలిపిస్తే నేను రాజ్యసభలో, బాజిరెడ్డి లోక్ సభలో తెలంగాణ సమస్యలపై మీ పక్షాన పోరాడుతాం అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.