ఓట్స్‌తో వెరైటీగా…

ఓట్స్‌ వాడకం ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు అధిక బరువు తగ్గాలనుకునే వారు మాత్రమే ఓట్స్‌ను ఉపయోగించే వారు. ఇప్పుడు రోజువారీ ఆహారంలో భాగమయ్యాయి. బరువుతో నిమిత్తం లేకుండా ప్రతీ ఒక్కరూ ఓట్స్‌తో చేసిన వంటకాలను ఇష్టపడుతున్నారు. ఉప్మా, ఇడ్లిలాంటివే కాకుండా చిన్న చిన్న మార్పులతో వెరైటీగా చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అవేంటో మనమూ ఓ సారి ప్రయత్నిద్దాం…

పుంగనాలు
కావాల్సిన పదార్థాలు : ఓట్స్‌ – కప్పు, నీళ్ళు – ఒకటిన్నర కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిగడ్డ – పావు కప్పు, పచ్చిమిర్చి – ఒకటి (సన్నగా తరిగినది), అల్లం – అంగుళం ముక్క (సన్నగా తరిగి పెట్టుకోవాలి), క్యారెట్‌ – ఒకటి (తురిమి పెట్టుకోవాలి), ఉడికించిన పచ్చి బఠానీలు – అర కప్పు, క్యాబేజి – పావు కప్పు (సన్నగా తరిగి పెట్టుకోవాలి), జీలకర్ర – అర టీ స్పూన్‌, ఉప్పు – రుచికి సరిపడా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నెయ్యి – కొద్దిగా
తయారుచేసే విధానం : ఒక గిన్నెలోకి ఓట్స్‌ తీసుకుని కప్పున్నర నీళ్ళు పోసి అరగంట పాటు నానబెట్టాలి. నానిన ఓట్స్‌ను నీళ్ళతోపాటు మిక్సి జార్‌లోకి తీసుకుని కొంచెం పలుకులుగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి మార్చుకుని అందులో తగిరిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, క్యారెట్‌ తురుము, బఠానీలు, క్యాబెజీ తురుము, అర టీస్పూన్‌ జీలకర్ర, పసుపు, కొత్తిమీర, ఉప్పు, బియ్యం పిండి అన్ని వేసి బాగా కలపాలి. గుంతపుంగనాల గిన్నె తీసుకుని స్టవ్‌ మీద పెట్టి కాస్త వేడయ్యాక ఆయిల్‌ లేదా నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని ఆ గుంతల్లో వేసుకుని మీడియం మంట మీద కనీసం మూడు నుంచి ఐదు నిమిషాలు కాలాక తీసుకుంటే సరి. కమ్మని ఓట్స్‌ గుంతపుంగనాలు రెడీ.
ఇడ్లీ
కావాల్సిన పదార్థాలు : ఓట్స్‌- రెండు కప్పులు, పుల్లని పెరుగు – రెండు కప్పులు, ఆవాలు- టీస్పూన్‌, మినప్పప్పు – టేబుల్‌ స్పూన్‌, సెనగపప్పు- అర టేబుల్‌స్పూన్‌, నూనె-అరటీస్పూన్‌, పచ్చిమిర్చి -రెండు (సన్నగా తరగాలి), క్యారెట్‌ తురుము-రెండు టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర తురుము- టేబుల్‌ స్పూన్‌, పసుపు- చిటికెడు, ఉప్పు – తగినంత.
తయారుచేసే విధానం : మొదట బాణలిలో ఓట్స్‌ వేసి కాస్త రంగు మారే వరకూ సన్నని మంట మీద వేయించాలి. తర్వాత మిక్సీలో వేసి పొడిలా చేయాలి. తర్వాత చిన్న కడాయిలో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు వేసి వేయించాలి. కొద్దిసేపటి తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, క్యారెట్‌ తురుము, పసుపు వేసి ఓ నిమిషం వేగాక దించి ఓట్స్‌ పొడిలో కలపాలి. అందులోనే కొద్దిగా పెరుగు, తగినంత ఉప్పు వేసి కలిపి ఇడ్లీ పిండి మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో వేసి సుమారు 15 నిమిషాలు ఉడికించి దించాలి. అంతే వేడివేడి ఓట్స్‌ ఇడ్లీ రెడీ అయినట్టే.
ఉప్మా
కావాల్సిన పదార్థాలు : ఓట్స్‌ – రెండు కప్పులు, మినప్పప్పు- టేబుల్‌ స్పూన్‌, శనగపప్పు – రెండు టీ స్పూన్లు, అల్లం ముక్కలు – ఒక టీ స్పూన్‌, కరివేపాకు – కొద్దిగా, ఇంగువ – చిటికెడు, ఆవాలు – ఒక టీ స్పూన్‌, పచ్చి మిర్చి – మూడు, ఎండు మిర్చి – రెండు, ఉల్లిగడ్డ – ఒకటి, నూనె – ఒక టీస్పూన్‌, నీరు – నాలుగున్నర కప్పులు, ఉప్పు – తగినంత
తయారుచేసే విధానం : పాన్‌లో మూడు నిమిషాల పాటు ఓట్స్‌ వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్‌లో కొద్దిగా నూనె వేడిచేసి, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండు మిర్చి వేసి వేగనివ్వాలి. ఉల్లిగడ్డ, అల్లం ముక్కలు, కరివేపాకు కూడా వేసి వేయించాలి. తర్వాత ఇంగువ, ఉప్పు కలిపి నీరు పోసి మరిగించాలి. ఓట్స్‌ వేసి, నీరంతా పీల్చేదాకా సన్నని సెగపై ఉడికించాలి. అంతే రుచికర ఓట్స్‌ ఉప్మా రెడీ. షుగర్‌తో బాధపడే వారికి ఇది మంచి ఆహారం.
ఖీర్‌
కావాల్సిన పదార్థాలు : ఓట్స్‌ – పావు కేజీ, గ్రాములు, పంచదార – రెండు టేబుల్‌ స్పూన్‌లు, ఆపిల్‌ -ఒకటి, తేనె – యాభై గ్రాములు, కాజు, బాదం పలుకులు – ఇరవై ఐదు గ్రాములు, పాలు – అర లీటరు, నెయ్యి – టేబుల్‌ స్పూన్‌, యాలకుల పొడి – చిటికెడు
తయారుచేసే విధానం : ఒక పాన్‌లో నెయ్యి వేసి అందులో ఓట్స్‌ కూడా వేసి సన్నని మంట మీద కొద్దిగా వేయించాలి. చాల్లారాక మిక్సి జార్‌లో వేసి పొడి చేసుకోవాలి. స్టవ్‌ మీద పాత్ర పెట్టి పాలు బాగా మరగ నివ్వాలి. అందులో ఈ ఓట్స్‌ మిశ్రమం వేసి తిప్పుతూ ఉండాలి. ఆపిల్‌ను చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని అందులో వేసి కలపాలి. మిశ్రమం మొత్తాన్ని బాగా కలియ తిప్పుతూ పంచదార, తేనె వేయాలి. పంచదార అందులో కలిసి పోయాక బాదం, జీడిపప్పు పలుకులు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. స్టవ్‌ ఆఫ్‌ చేసి దించి కాస్త చల్లారాక సర్వ్‌ చేసుకుంటే సరి. ఈ ఖీర్‌ చాలా వెరైటీ రుచితో మళ్ళీ తినాలనిపిస్తుంది.
ఊతప్పం
కావాల్సిన పదార్థాలు : ఓట్స్‌- రెండు కప్పులు, సేమియా- కప్పు, పెరుగు- రెండు కప్పులు, ఉల్లిగడ్డ – రెండు, పచ్చిమిర్చి- నాలుగు, కొత్తిమీర – కొంచెం, టమాటా- ఒకటి, ఉప్పు – తగినంత, నూనె – కొంచెం,
తయారుచేసే విధానం : ఓట్స్‌ను పెరుగులో, నీళ్లలో సేమియాను నానబెట్టాలి. రెండు గంటలయ్యాక సేమియాలో నీళ్లు వంపేసి, ఓట్స్‌లో కలపాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, టమాటాలను సన్నగా తరిగి ఓట్స్‌ మిశ్రమంలో కలపాలి. అందులోనే కొత్తిమీర, కొద్దిగా ఉప్పు వేసి కలియ తిప్పాలి. గట్టిగా ఉంటే కొన్ని నీళ్లు చేర్చి కలపాలి. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టాలి. వేడయ్యాక మిశ్రమాన్ని ఊతప్పంలా మందంగా వేసి నూనెతో రెండు వైపులా కాల్చాలి. పోషకాలు మిళితమైన వేడి వేడి ఓట్స్‌ ఊతప్పాన్ని కొబ్బరి పచ్చడితో తింటే రుచిగా ఉంటుంది.

Spread the love