– పీ.హెచ్.సీ ముందు సీఐటీయూ ధర్నా
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరుతూ స్థానిక ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని పీ.హెచ్.సీ వైద్యాధికారి డాక్టర్ అర్వపల్లి రేవంత్ కు అందజేశారు. తదనంతరం ఆళ్ళపల్లి సీఐటీయూ మండల కన్వీనర్ సడియం సుగుణ అధ్యక్షతన జరిగిన సభలో సీఐటీయూ జిల్లా, డివిజన్ నాయకులు అబ్దుల్ నబి, ఈసం వెంకటమ్మలు పాల్గొని, వారు మాట్లాడుతూ.. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఆశా వర్కర్లు అందరూ కదిలిరావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధాన కర్తలుగా ఆశా వర్కర్లు పనిచేస్తుంటే వారికి కనీస వేతనం ఇవ్వకుండా అనేక పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో రావాల్సిన బకాయిలు ఇంకా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సీతాదేవి, కావేరి, చంద్రకళ, దేవకుమారి, సుందరమ్మ, అనసూర్య, లక్ష్మీకాంత, సత్యవతి, అనసూర్య, తిరుపతి, రాధ, రమా, తదితరులు పాల్గొన్నారు.