ఆశాల ధర్నాలు వాయిదా

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆశాల సమస్యల పరిష్కారానికి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు, ఆ శాఖ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 12న కలెక్టరేట్ల ముందు తలపెట్టిన ధర్నాలను వాయిదా వేస్తున్నట్టు ఆశా యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి తెలిపారు. సోమవారం ఆశా డే సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డీహెచ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆశాలకు ఎలాంటి పరీక్ష నిర్వహించబోమనీ, ఫిక్స్‌డ్‌ వేతనం, ఇతర సమస్యల పరిష్కారం కోసం వైద్యారోగ్యశాఖ మంత్రితో సమావేశం జరిపిస్తామని డీహెచ్‌ హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఆశాలతో సోమవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు, పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారని వివరించారు. ప్రసూతి సెలవులు ఇస్తామనీ, రెస్ట్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. నాణ్యతతో కూడిన యూనిఫారాలను ఈ నెల 10న అంద జేస్తామనీ, 32 రకాల రిజిస్టర్లను ప్రింట్‌ చేసి ఇస్తామని చెప్పారు. జాబ్‌చార్ట్‌ రూపొందిస్తామంటూ కూడా మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. పోరాటాలు చేసి ప్రభుత్వం నుండి హామీలు సాధించుకున్న ఆశావర్కర్లకు ఆశా యూనియన్‌ రాష్ట్ర కమిటీ పక్షాన అభినందనలు తెలిపారు. రానున్న కాలంలో కూడా ఇదే స్పూర్తిని ప్రదర్శించాలని కోరారు.

Spread the love