మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీ (ఎంటిఆర్ఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు పోతు అశోక్ నేత నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ లో తన నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు అందజేశారు. పద్మశాలి కులానికి చెందిన పోతు అశోక్ నేత 2018లో మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీని స్థాపించారు. 2020-21వ సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తన పార్టీ తరపున అభ్యర్థులను బరిలో నిలిపారు. గత సంవత్సరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పై నామినేషన్ వేసి ఐదో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీ తరపున ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పటి వరకు ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు తెలిపారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీ జిల్లా అధ్యక్షులు మంతెన బాజా గౌడ్, నాయకులు అంకం శ్రీనివాస్, పోలపల్లి సాయికుమార్, పోతు నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.