నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎట్టకేలకు అశ్వారావుపేట మున్సిపాల్టీగా అవతరించింది. ఈ మేరకు జనవరి 4 వ తేదీ న గవర్నర్ ఆమోదం పొందుతూ విడుదల రాజ పత్రం ఒకటి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం బహిరంగం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లెక్సీకి నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ సమీపంలో పాలాభిషేకం చేసారు. అశ్వారావుపేట తో పాటు పేలాయి గూడెం,గుర్రాల చెరువు పంచాయితీలు ను కలుపుతూ 31696 జనాభా ప్రాతిపదికన అశ్వారావుపేట మున్సిపాలిటీగా అవతరించింది. అశ్వారావుపేట 1959 లోనే పంచాయితీగా ఏర్పడి,నాటి పాలనా విధానంలో బ్లాక్ కేంద్రంగానూ ఉండేది. అనంతరం మండల వ్యవస్థ రావడంతో 1980వ దశకంలో మండల కేంద్రంగా రూపొందింది. 2009 లో నియోజక వర్గం కేంద్రంగా మారింది. నేడు మున్సిపాలిటీ గా రూపుదిద్దుకోనుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సమక్షంలో జరిగిన పాలాభిషేకం వేడుకలో ఆయన మాట్లాడుతూ.. నా పాలనాకాలంలో ప్రతీ క్షణం అశ్వారావుపేట అభివృద్ధికే కేటాయిస్తానని అన్నారు. దొంతికుంట చెరువును టూరిజం కేంద్రంగా, మరో ఎకో పార్క్ ను అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అద్యక్షులు తుమ్మ రాంబాబు, సుంకవల్లి వీరభద్రరావు, జూపల్లి రమేష్ లు పాల్గొన్నారు.