అశ్వారావుపేట హస్తగతం…

– జారే ఆదినారాయణ ఘన విజయం
– ప్రజాభీష్టం మేరకే పరిపాలన
– ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యం
– నా విజయం ప్రజలకే అంకితం
– ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట: అశ్వారావుపేట ఓటర్లు మళ్ళీ కాంగ్రెస్ కే చేయూతను ఇచ్చారు. నియోజక వర్గం ఏర్పాటు అయిన నాటి నుండి ఈ నియోజక వర్గంలో ఎవరు విజయం సాధించినా హస్తం బలంతోనే అని ఈ నియోజక వర్గం ఓటర్లు మరొక్క సారి  నిరూపించారు. సాదారణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి గతనెల 30 న పోలింగ్ జరగగా ఆదివారం పాల్వంచ అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్ధి జారే ఆదినారాయణ ఘన విజయం సాధించారు.14 రౌండ్ లలో ప్రతీ రౌండ్ లోనూ ఆధిక్యం కనబరిచిన జారే ఆదినారాయణ 74,420 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్ధి మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కు 45,963 ఓట్లు వచ్చాయి. దీంతో మెచ్చా పై 28,457 ఓట్ల ఆధిక్యంతో జారే ఘన విజయం సాధించారు.
అంతే గాకుండా ఈ కౌంటింగ్ రాష్ట్రంలోనే తొలి విజయం సాధించిన స్థానంగా రికార్డ్ పొందాడు.
గతంలో ఈ నియోజక వర్గంలో ఎవరూ సాధించని ఘన ఆధిక్యం సాధించారు.
2009 లో ప్రధమ ఎమ్మెల్యే గా విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్ధి మిత్ర సేన 46,187  ఓట్లు సాధించి సమీప ప్రత్యర్ధి సీపీఐ(ఎం) అభ్యర్ధి పాయం వెంకయ్య పై 5,111 ఓట్లు మాత్రమే ఆధిక్యత సాధించారు.
2014 లో రెండో ఎమ్మెల్యే గా వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా తాటి వెంకటేశ్వర్లు 49,546 ఓట్లు సాధించి తన సమీప తెదేపా ప్రత్యర్ధి మెచ్చా నాగేశ్వరరావు పై 930 ఓట్లు మాత్రమే ఆధిక్యం కనబరిచారు.
2018 లో మూడో ఎమ్మెల్యే గా కాంగ్రెస్ బలపరిచిన తెదేపా అభ్యర్ధి మెచ్చా నాగేశ్వరరావు 61,124 ఓట్లు పొంది తన సమీప తెరాస ప్రత్యర్ధి తాటి వెంకటేశ్వర్లు పై 13,117 ఓట్లు ఆధిక్యంతో విజయం సాధించారు.
ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యం
విజయం సాధించాక మొదటిగా లెక్కింపు కేంద్రంలోనే విలేకరులతో ఆయన మాట్లాడు ప్రజా సంక్షేమానికే ప్రధమ ప్రాధాన్యత ఇస్తాను అని,వారి అభీష్టం మేరకు పరిపాలన చేస్తానని‌ హామి ఇచ్చారు. ప్రధాన్యతా క్రమం లో అభివృద్ది పనులు చేపడతానని అన్నారు. కాంగ్రెస్ అమలు చేయనున్న ఆరు గ్యారంటీ లను అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేలా కృషి చేస్తానని అన్నారు. ఈ నా విజయాన్ని నియోజక ప్రజలకే అంకితం చేస్తున్నాను ప్రకటించారు. అనంతరం రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ డాక్టర్పి. రాంబాబు, ఎ.ఆర్.ఒ, తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ చేతులు మీదుగా విజయం సాధించిన దృవీకరణ పత్రం అందుకున్నారు. ఈయన వెంట జూపల్లి రమేష్,మలి రెడ్డి పూర్ణ చంద్రారెడ్డి ఉన్నారు.
Spread the love