నవతెలంగాణ – హైదరాబాద్: చెన్నై వేదికగా భారత్ – బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదం తొక్కిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో అశ్విన్ తన కెరీర్‌లో మరో రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. బంగ్లాపై అద్భుత ప్రదర్శనతో కెరీర్‌లో 37వ సారి 5 వికెట్లు తీసిన ఘనతను అశ్విన్ అందుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు, మాజీ దిగ్గజం షేన్ వార్న్ రికార్డును సమం చేశాడు. వార్న్ కూడా తన టెస్ట్ కెరీర్‌లో 37 సార్లు 5 వికెట్లు తీశాడు. అయితే వార్న్ కంటే 81 ఇన్నింగ్స్ ముందుగానే అశ్విన్ ఈ ఘనతను సాధించడం విశేషం.